నీటి కోసం...నిలిచి గెలిచారు!
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:05 AM
సవి వచ్చిందంటే అంతటా నీటి ఎద్దడికి సంబంధించిన వార్తలే. ఒకప్పుడు ఊర్లలో కళకళలాడుతూ కనిపించిన చెరువులు ఇప్పుడెందుకు ఎండిపోయాయి?
వేసవి వచ్చిందంటే అంతటా నీటి ఎద్దడికి సంబంధించిన వార్తలే. ఒకప్పుడు ఊర్లలో కళకళలాడుతూ కనిపించిన చెరువులు ఇప్పుడెందుకు ఎండిపోయాయి? సరస్సుల్లో నీరున్నా తాగడానికి ఉపయోగపడవు ఎందుకు? 21వ శతాబ్దంలో కూడా ఎంతో దూరం నడిచి, బిందెల్లో మంచినీళ్లని మోసుకువస్తోన్న గ్రామాలు ఉన్నాయంటే... సమస్య ఎక్కడ ఉంది? లోపం ఎవరిది? ఇలా అనేకానేక ప్రశ్నలు వేయకుండా... ఇది మన సమస్య, మన ఊరి సమస్య... ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో కొంతమంది నీటిని ఒడిసిపట్టుకుని... ఆయా ప్రాంతాల్లో గొప్ప ‘జల సంరక్షకులు’ అయ్యారు. నేడు (మార్చి 22) ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా అలాంటి కొందరు ‘వాటర్ వారియర్స్’ కథనాలివి...
లేక్ మ్యాన్...
దుబాయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం... జీవితం సాఫీగా సాగుతోంది నిమల్ రాఘవన్‌కి. 2018లో వచ్చిన ‘గజ’ తుపాన్ ఆయన్ని ఊరి బాట పట్టేలా చేసింది. ఆ తుపానులో నిమల్ స్వగ్రామం నదియమ్‌తో పాటు 90 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. ‘బౌన్స్‌బ్యాక్ డెల్టా’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు నిమల్. కొంతమంది వాలంటీర్లను కూడగట్టుకున్నారు. విరాళాలు సేకరించి తుపానులో నష్టపోయినవారికి ఆహారం, దుస్తులు, వస్తువులు, మందులు చేరవేస్తూ ఆపన్నహస్తం అందించారు. పనిలోపనిగా తమ ఊరిలోని ‘పెరవురాణి’ సరస్సును పూడికతీసి ఆరు వేల ఎకరాలకు నీళ్లు అందించారు.
అలా తమిళనాడులోని తంజావూరు జిల్లా నుంచి మొదలైన ‘జల సంరక్షణ’ ఓ ఉద్యమంలా మారింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు, శ్రీలంక, కెన్యాలో కూడా నిమల్ సేవలు అందిస్తున్నారు. లక్షల మంది వాలంటీర్లు ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే సుమారు 300 చెరువులను పునరుద్ధరించారు. పాతిక లక్షల మొక్కలని నాటారు. అలా బీడుబారిన 70 లక్షల మంది రైతుల జీవితాల్లో పచ్చదనాన్ని తీసుకొచ్చారు. అందరూ నిమల్‌ను ‘లేక్ మ్యాన్’ అని పిలవడం మొదలెట్టారు. ‘నీళ్లని వృథా చేయకండి, నీళ్లు లేకపోతే ఏమీ లేద’ని హెచ్చరించే నిమల్ మాటలు అక్షరసత్యాలు.
నీటి నెచ్చెలి...
సాధారణంగా పంతొమ్మిదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? అటు కాలేజీ ఇటు స్నేహితులు అంటూ అదో లోకంలా ఉంటారు. కానీ అదే వయసులో ఉన్న బబిత రాజ్‌పుత్ మాత్రం ‘మన ఊరు చెరువు ఎందుకు ఎండిపోతోంది... రోజూ నీళ్లకోసం అంత దూరం ఎందుకు నడవాలి...’ అని ప్రశ్నించుకుంది. మధ్యప్రదేశ్‌లోని అగ్రోథా ఆమె స్వగ్రామం. వానాకాలంలో మాత్రమే చెరువు కాసిన్ని నీళ్లతో అందంగా మారుతుంది. మిగతా సమయంలో నీటి ఎద్దడి. రోజూ చాలా దూరం నడిచి వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఊరికి కాస్త దూరంలో నీటి కాలువ ఉన్నా, మధ్యలో కొండ ఉండడం వల్ల ఊరికి ఉపయోగకరంగా లేకపోయింది. ఇక్కడే బబిత కాస్త గట్టిగా ఆలోచించింది. కాలువ నీళ్లని చెరువులోకి మళ్లించడానికి కొండ పక్క నుంచి ఓ కాలువ తవ్వాలని బబిత నిర్ణయించుకుంది.
కానీ సవాలక్ష అడ్డంకులొచ్చాయి. చెరువును ఆక్రమించుకున్న రైతులు అడ్డుపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు భయపెట్టాయి. ఆఖరుకి ఓ ఎన్‌జీఓ సహాయంతో బబిత కావలసిన అనుమతులు తెచ్చుకుంది. గట్టి సంకల్పంతో 2018లో ఆమె 12 మంది మహిళలతో కలిసి ‘జల్ సహేలీ’ బృందాన్ని ఏర్పరచి, కాలువ తవ్వడం ప్రారంభించారు. ఆ బృందం మొక్కవోని దీక్షను చూసి పొరుగున ఉన్న పది గ్రామాల మహిళలూ వచ్చి చేరారు. అలా రెండు వందలకు చేరుకున్న ఆ బృందం 12 అడుగుల వెడల్పుతో 107 మీటర్ల పొడవున కాలువను తవ్వి నీళ్ల దారిని మళ్లించింది. ఇప్పుడు గ్రామంలో నీటి ఎద్దడే లేదు. పైగా ఎండిపోయిన బావుల్లో కూడా నీళ్లు బాగా చేరాయి. పంటపొలాలతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. చిన్న వయసులోనే గట్టి సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందీ వాటర్ వారియర్.
బోర్లకు జీవం...
ప్రస్తుతం ప్రపంచం అంతా రీఛార్జ్ చుట్టే తిరుగుతోంది. ఎండిపోయి, పనిచేయకుండా పోయిన బోర్లను రీఛార్జ్ చేస్తే నీటి ఎద్దడి సమస్య సగం వరకూ తీరుతుంది కదా. ఇదే ఆలోచనను నిజం చేసి ‘జల యోధుడి’గా మారారు దేవరాజ్ రెడ్డి ఎన్‌ఎ. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన దేవరాజ్ భూగర్భ జల శాస్త్రవేత్త. ఎండిపోయిన బోర్‌వెల్స్‌ను రీఛార్జ్ చేసే టెక్నాలజీని ఈయన కనుగొన్నారు. దీని ఖరీదు కూడా తక్కువ. గత మూడు దశాబ్దాలుగా ఇరవై వేలకు పైగా బోర్లను ఆయన రీఛార్జ్ చేశారు. రెండు లక్షలకు పైగా ఎకరాలలో పంటల సాగుకు తోడ్పడి, రైతుల జీవితాలనూ, నేల తల్లినీ సస్యశ్యామలం చేశారు.
‘ఇన్‌స్టా’తో అవగాహన...
ఇన్‌స్టాలో ప్రతి ఒక్కరూ తమ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ముంబైకి చెందిన లిస్బన్ ఫెరారో ఇన్‌స్టా చూస్తే ‘900 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరాను. అందులో 40 టన్నులు రీసైకిల్ చేశా. 3 వేల మొక్కలను నాటాను..’ అని చెప్పుకుంటారు. పైగా.. ‘వియ్ కెన్ డూ ఇట్. డ్రాప్ ద ఈగో, పిక్ అప్ ద ట్రాష్’ అని సముద్ర తీరాల్లో చెత్త ఎత్తుతూ క్యాప్షన్‌లు పెడుతుంటారు. ఇన్‌స్టాలో లిస్బన్ ఫెరారోకి 25 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పర్యావరణ పరిరక్షకుడిగా లిస్బన్ కథ 2017లో మొదలైంది. అప్పుడు ఆయన మార్కెటింగ్ రంగంలో పనిచేసేవారు. ఓ ఆదివారం పిల్లలతో కలిసి బొరివలీ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే.
ఆయన హృదయం ద్రవించిపోయింది. తన చిన్నప్పుడు అక్కడి స్వచ్ఛమైన ఇసుకలో గంటలు గంటలు ఆడుకున్న గుర్తు. తన పిల్లలకీ అలాంటి జ్ఞాపకాలే అందించాలని అనుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు బీచ్‌కు వెళ్లినా చెత్తని ఏరి డస్ట్‌బిన్లలో పోగేసేవారు. ఓసారి వాళ్లు చేస్తున్న పనిని ఫొటోలు తీసి, ‘క్లీన్ చేయక ముందు, చేశాక..’ అని క్యాప్షన్‌లో రెండు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి బాగా వైరలయ్యాయి. ఎంతోమంది వాలంటీర్లు చేతులు కలిపారు. ‘వసై బీచ్ క్లీనర్స్’ పేరున ఎన్‌జీఓ సంస్థను నెలకొల్పి, 20 వేల మంది వాలంటీర్లతో బీచ్‌లను, సరస్సులు, చెరువులను శుభ్రపరుస్తూ అసలైన పర్యావరణ యోధుడిగా ముందుకు సాగుతున్నారు లిస్బన్.
సరస్సు సంరక్షకుడు
టూరిస్టుల అవగాహనలేమితో చాలా పర్యాటక ప్రాంతాలు మురికికూపాలుగా మారుతున్నాయి. స్వచ్ఛమైన సరస్సులూ కాలుష్యం బారిన పడిపోతున్నాయి. అలాంటి ఓ సరస్సే ‘సోమ్గో’. గాంగ్‌టక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు సిక్కిం రాష్ట్రంలో చూడచక్కని పర్యాటక ప్రాంతం. సిక్కిం వాసులకు పుణ్యతీర్థం ‘సోమ్గో’. అయితే ఓవర్ టూరిజం వల్ల ఈ సరస్సు క్రమక్రమంగా వ్యర్థాలతో నిండిపోయింది. దాంతో చుట్టుపక్కల ఇళ్ల వారికి తాగునీళ్ల కొరత ఏర్పడింది. ఆ రాష్ట్రానికే చెందిన సంజయ్ లామా అనే యువకుడు 2008లో కొంతమంది యువకులతో కలిసి సోమ్గో ప్రక్షాళన పనిని చేపట్టారు. ఆ సరస్సు నుంచి ఏకంగా 20 లారీల చెత్తని వెలికితీశారు. ‘సోమ్గో పోఖ్రి సంరక్షణ్ సమితి’ అనే సంస్థను స్థాపించి వ్యర్థ పదార్థాల నిర్వహణనూ కొనసాగిస్తున్నారు. దీనికి అటవీ శాఖ, వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్)తో కలిసి ఆయన పనిచేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటిని అందించే సరస్సుగా సోమ్గో నేడు పరివర్తన చెందింది. ‘పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ. మనం పరిశుభ్రంగా ఉంటే... రాష్ట్రం, దేశం కూడా పరిశుభ్రంగా మారుతాయి’ అని చెప్పే సంజయ్ మాటలు అనుసరణీయం.
చెక్‌డ్యాముల అమ్మ...
గాలి, నీళ్లు లేకపోతే మనుగడే లేదు. అయితే విచిత్రంగా ఈ రెండింటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ రాజస్థాన్‌లోని బీడు నేలలను చూసిన అమ్లా రూయి చలించిపోయారు. అమ్లాకు చిన్నప్పటి నుంచే కమ్యూనిటీ కార్యక్రమాలంటే ఆసక్తి. ఒకసారి రాజస్థాన్‌లో పర్యటించడం వల్ల ఆమె జీవితమే మారిపోయింది. 2006లో ‘ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్’ స్థాపించి నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టారు అమ్లా. మాండవార్ గ్రామంలో మొదటి చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. దీంతో అక్కడి ప్రజల పరిస్థితులు మారిపోయాయి. రైతులు ఆ ఏడాది 12 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పటిదాకా ఆమె దాదాపు 900 చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. దీంతో 500 సరస్సులు జలరాశులతో నిండిపోయాయి. ఫలితంగా రెండు వేలకు పైగా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతీ ప్రాజెక్టులో స్థానికులను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగడం అమ్లా రూయి విజయ రహస్యం. చెక్‌డ్యామ్‌లను నిర్మించడానికి అవసరమైన రాళ్లను గ్రామస్థులే అందించారు. గ్రామ స్వరూపమే కాదు, తమ జీవితాలూ మారిపోవడం వల్ల అమ్లా రూయిని అందరూ ‘నీళ్ల అమ్మ’గా పిలవడం మొదలెట్టారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో అమ్లా రూయిని ‘జల్ దేవీ’గా అమితాబ్ బచ్చన్ కీర్తించడం విశేషం.
నీళ్ల డాక్టర్
ప్రతీరోజూ మూడు కిలోమీటర్లు నడిస్తేనే ఇంట్లో నీళ్లు. అలా చిన్నప్పుడు ఎన్ని ఉదయాలు అమ్మకు తోడుగా వెళ్లాడో కానీ ఇప్పుడు ‘నీళ్ల డాక్టర్’గా మారారు. ఆయనే అయ్యప్ప మసగి. కర్ణాటకకు చెందిన అయ్యప్ప ఓ మెకానికల్ ఇంజినీర్. 23 ఏళ్ల సర్వీస్ తరవాత ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామాల బాట పట్టారు. ‘వాటర్ లిట్రసీ ఫౌండేషన్’ను నెలకొల్పారు. 26 వేల హెక్టార్ల డ్రై ల్యాండ్‌ను వెట్ ల్యాండ్‌గా మార్చారు. ఎన్నో సరస్సులు, బావులు, బోర్‌వెల్స్‌ను పునరుద్ధరించారు. బెంగళూరు పరిసరాల్లోని సుమారు 200 పరిశ్రమల్లో వాన నీటి సంరక్షణ పథకాలను ప్రారంభించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ నీళ్ల ఊటపడుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. చాలామంది ’నీళ్ల డాక్టర్’, ‘వాటర్ గాంధీ’, ‘బోర్‌వెల్ డాక్టర్’, ‘మోడ్రన్ భగీరథ’... ఇలా రకరకాల పేర్లతో అయ్యప్పను కీర్తిస్తారు. ‘దేవుడు సృష్టించిన అతి పెద్ద సరస్సు భూమి. ప్రతీ నీటి చుక్కనీ వినియోగించాలి కానీ వృథాచేయరాదు’ అని అయ్యప్ప పేర్కొంటారు. తన ప్రయత్నాలన్నింటినీ ‘భగీరథ: వార్ ఆన్ వాటర్ క్రైసిస్’ పేరున అక్షరబద్ధం చేశారు.
వ్యర్థాలను ఏరుతూ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’లో ప్రశంసలు అందుకున్న నీటి యోధుడు రామ్‌వీర్ తన్వర్. నోయిడాకు చెందిన రామ్‌వీర్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సరస్సుల పరిరక్షణకు తన జీవితాన్ని ధారపోస్తున్నారు. సరస్సుల్లోని వ్యర్థాలను ఏరుతూ, నీటి దారులను మెరుగుపరుస్తూ నీటి నిల్వలను పెంచుతున్నారు. ‘సే ఎర్త్’ పేరుతో ఎన్‌జీఓ నెలకొల్పారు. ఇప్పటిదాకా 50 ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్‌లు పెంచారు. ఏడు రాష్ట్రాలలో 80కి పైగా చెరువులను పునరుద్ధరించారు. నీటి సంరక్షణకు సంబంధించి ‘జల్ చౌపాల్’ పేరున ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ‘టెడ్‌ఎక్స్’లో పాల్గొని కాలుష్యం లేని జలవనరులను తీర్చిదిద్దాల్సిన అవసరం గురించి రామ్‌వీర్ ఆలోచింపజేసేలా మాట్లాడి ఆకట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి ఎంతోమంది జలసంరక్షకులు అడుగంటిపోతున్న నీటి నిల్వలకు జీవం పోస్తూ... నీటి చుక్కను జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటున్నారు. నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వాటర్ వారియర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని... వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు మనవంతు కర్తవ్యాన్ని కూడా పోషించాల్సిందే కదా. ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటిని పొదుపుగా వాడుదాం... నీటి వనరులను కాపాడుకుందాం.
- సండే డెస్క్
ఈ వార్తలు కూడా చదవండి:
మరో 260 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష
Read Latest Telangana News and National News