మాల్దీవుల్లో సముద్రగర్భ విల్లా.. అర్ధరాత్రి గదిని చుట్టుముట్టిన షార్కులు!
ABN , Publish Date - Nov 08 , 2026 | 10:32 AM
చుట్టూ చిమ్మచీకటి... కాంక్రీట్ గోడల్లేని పడకగది... పైగా ఆ గాజు గది సముద్రం మధ్యలో ఉంటుంది.
చుట్టూ చిమ్మచీకటి... కాంక్రీట్ గోడల్లేని పడకగది... పైగా ఆ గాజు గది సముద్రం మధ్యలో ఉంటుంది. అద్దాల అవతల నీటిలో ఈదుతున్న వందలకొద్దీ సముద్ర జీవులు! ఆ అందమైన అనుభూతిని ఒంటరిగా ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకునే వేళ...
ఓ భారీ సొరచేప (షార్క్) వచ్చి మంచం చుట్టూ తిరగడం ప్రారంభిస్తే...? సముద్ర విల్లా ‘మురాకా’లో ఉంటే... యురేకా అనాల్సిందే.
ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలోని కాల్పనిక దృశ్యం కాదు. మాల్దీవుల్లోని కాన్రాడ్ రంగాలి ఐలాండ్ రిసార్టులో ఉన్న ‘ది మురాకా’ విల్లాలో ఓ పర్యాటకుడికి ఎదురైన అనుభవం. ప్రపంచంలోనే జలగర్భంలో తొలిసారి నిర్మితమైన ఈ విల్లాలో ఒక్క రాత్రి గడపాలంటే.. 20 వేల డాలర్లు (సుమారు రూ. 19 లక్షలు) చెల్లించాల్సిందే. హిందూ మహా సముద్రంలో దాదాపు 16 అడుగుల లోతున కర్వ్డ్ డోమ్‌తో తయారైన పారదర్శకమైన బెడ్రూమ్ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి.
యు.కె.కు చెందిన విల్ డేవిస్ జీవితంలో ఎన్నడూ చూడని అనుభవాన్ని సొంత చేసుకోవాలనుకున్నాడు. సాయంత్రం వేళ లిప్టు ద్వారా సముద్రపు అడుగు భాగంలో ఉన్న పడక గదిలోకి అడుగుపెట్టాడు. చుట్టూ తిరుగుతున్న రంగురంగుల చేపలూ, తాబేళ్లూ, ఇతర జలచరాలను చూస్తూ.. ఇష్టమైన పానీయం సేవిస్తూ... ఆ రాత్రిని అపురూపంగా ఆరంభించాడు.
అర్ధరాత్రి ఉత్కంఠ...
రాత్రి సుమారు 1.30 గంటలు. గదిలోని లైట్లన్నీ స్విచాఫ్ చేశాడు విల్ డేవిస్. బెడ్‌సైడ్ సాఫ్ట్ లైట్ ఒక్కటి మాత్రమే పల్చని వెలుగు పంచుతోంది. అతడు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఒక భారీ నీడ అద్దంపై పడింది. కళ్లు తెరిచి చూస్తే... వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న రీఫ్ షార్క్ పడకగది పైకప్పు దగ్గర నెమ్మదిగా ఈదుతోంది. దానికి తోడుగా మరో రెండు సొరచేపలు అక్కడికి చేరుకున్నాయి. గది నుంచి వస్తున్న మందకొడి వెలుతురు, లోపలున్న మనిషి కదలికలు ఆ జీవుల్లో ఆసక్తిని రేకెత్తించి వుంటాయి. అవి అద్దం అంచులను రాసుకుంటూ గుండ్రంగా ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాయి.
భయోద్విగ్నం... పరవశం...
ఆ గాజు గోడ పటిష్ఠమూ, సురక్షితమూ అయినది కావొచ్చు. కానీ మానవ సహజమైన భయాందోళనలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. మంచం మీద అచేతనంగా కూర్చుని చూస్తున్న అతడికి షార్క్‌ల పదునైన కళ్లు, వాటి చర్మపు గరుకుదనం కొన్ని అంగుళాల దూరంలోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపలికి కూడా వినిపించే భీతి గొలిపే శబ్దాలు... వాటిలో ఒక సొరచేప నేరుగా డోమ్ వైపు దూసుకొచ్చి, చివరి క్షణంలో పక్కకు తిరిగినప్పుడు అతడి గుండె వేగం అమాంతం పెరిగింది. విలాసవంతమైన ఆ బెడ్రూమ్ ప్రమాదకరమైన బోనులా అనిపించింది.
కానీ వాటి స్వేచ్ఛా విన్యాసాలు చూస్తూ... సమయం గడుస్తున్న కొద్దీ ఆ భయం క్రమక్రమంగా అద్భుతంగానూ, ఆ వీక్షణం పరవశంగానూ మారిపోయింది. వాటి కదలికలను అంత దగ్గరగా, ప్రమాదరహితంగా చూసే అవకాశం తనకు మాత్రమే దక్కిందని గ్రహించినప్పుడు ఆనందం రెట్టింపయ్యింది. తెల్లవారుజామున సూర్య కిరణాలు కడలి నీటిని చీల్చుకుంటూ లోపలికి ప్రసరించడం మొదలైనప్పుడు షార్కులు వెళ్లిపోయాయి. ‘‘మొదటి అరగంట చాలా భయపడ్డాను. కానీ తర్వాత గడిచిన ప్రతీ క్షణం నేను వెచ్చించిన 20 వేల డాలర్లకు పదిరెట్లు విలువైనదిగా అనిపించింది. ప్రకృతి మధ్యలో ఒక సందర్శకుడిగా మాత్రమే నిలబడటం అంటే ఏమిటో తెలిసొచ్చింది’’ అన్నాడు విల్ డేవిస్.
రెండంతస్తుల భవంతి
అండర్‌వాటర్ విల్లా ‘మురాకా’ అంటే స్థానిక ధివేహి భాషలో ‘పగడం’ (కోరల్) అని అర్థం. సముద్రంపైన ఒక అంతస్తు, సముద్రం లోపల మరో అంతస్తు నిర్మించారు. పై అంతస్తులో రెండు బెడ్ రూములూ, అవుట్డోర్ డెక్, స్విమ్మింగ్‌పూల్, జిమ్, వంటగది, బార్ ఉన్నాయి. ఒకేసారి 9 మంది ఇక్కడ బస చేయొచ్చు. అతిథుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే బట్లర్, వ్యక్తిగత షెఫ్‌లతో పాటు స్పా సేవలు కూడా లభిస్తున్నాయి. దీన్నుంచి కిందికి వెళ్లేందుకు స్పైరల్ మెట్లూ, లిఫ్టూ ఉంటాయి. నీటి అడుగున ఉండే డోమ్‌లో పడక గది, బాత్రూమ్, లివింగ్ ఏరియాలు పూర్తిగా అక్రిలిక్ గ్లాసుతో తయారైనవి. గది చుట్టూ ఉన్న పగడపు దిబ్బలనూ, జలచరాలనూ 180 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూడొచ్చు.
ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించే ఈ విల్లాను మొదట సింగపూర్‌లో నిర్మించారు. తర్వాత మాల్దీవులకు నౌకలో తరలించి సముద్రగర్భంలో కాంక్రీట్ పిల్లర్ల సాయంతో స్థిరపరిచారు. సాగర గర్భంలో రాత్రివేళ విశ్రమించాలనుకునే ఽసంపన్నులకూ, సెలబ్రిటీలకూ ఇదో కలల ప్రపంచం!
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News