Share News

భ్రాంతిలో బతికితే ఫలితమిదే!

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:01 AM

‘అంతా భ్రాంతియేనా... కలగా మిగిలి పోయేనా!’... ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఇలాగే ఉండి ఉంటుంది. నిజానికి స్థానిక ఎన్నికల ఫలితాలను చూసి ప్రతిపక్షం...

భ్రాంతిలో బతికితే ఫలితమిదే!

ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నప్పటికీ ఏపీలో స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగానే జరిగాయి. ప్రజా తీర్పును హైజాక్‌ చేశారనే నిందలు నిలబడవు.

ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయని గతంలో జగన్‌ అండ్‌ కో వలె కూటమి నేతలు కూడా రెచ్చిపోతే 2029లో ఫలితాలు చేదుగా ఉండే ప్రమాదం ఉంది.

ఎమ్మెల్యేలు అరాచకంగా వ్యవహరిస్తున్న నియోజకవర్గాలలో వెంటనే పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం కనబడుతోంది. సీట్ల సర్దుబాటులో లుకలుకలు తలెత్తడం ఎక్కడైనా సహజం. అయితే కలసి ఉంటే కలదు సుఖమని తెలుసుకోకుండా ఎవరికి వారు మేమే తోపులం అని చెప్పుకొని విర్రవీగితే అందరికీ మొహం పగులుతుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా జగన్‌ అండ్‌ కో తమ వైఖరి మార్చుకోలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకు కారణాలను సమీక్షించుకుంటుంది. తప్పులు పునరావృతం కాబోవని ప్రజలకు హామీ ఇస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకొంటుంది. జగన్‌ అండ్‌ కో ఇందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే నరుకుతాం, చంపుతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రప్పా రప్పా అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో కత్తులు, గొడ్డళ్లకు స్థానం లేదని మరచిపోయి వాటినే చేతబట్టి వైసీపీ శ్రేణులు ప్రదర్శనలు చేశాయి. దీంతో అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఇంకెంతగా రెచ్చిపోతారోనన్న భయం ప్రజల్లో ఏర్పడింది. ఈ కారణంగానే స్థానిక సంస్థలకు ఎన్నికల్లో వైసీపీ ఓటింగ్‌ శాతం పడిపోయింది.

కమ్యూనిస్టులు ముఖ్యంగా, సీపీఎం పార్టీ ఈ ఎన్నికలపై చేస్తున్న విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వైసీపీ కంటే అధికంగా ఆ పార్టీ నేతలు కొందరు బాధపడటం వింతగా ఉంది. 2021లో అక్రమాలపై ఆ పార్టీ నోరు విప్పకపోవడం గమనార్హం.

జగన్‌ రెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. తాను భ్రమల్లో జీవిస్తూ కార్యకర్తలనూ భ్రమల్లో జీవింపజేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సమీక్షించుకుంటే ఆయనకే మంచిది.

2024లో కూటమి భారీ మెజారిటీ సాధించడానికి లేదా అధికారంలోకి రావడానికి చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌-లోకేశ్‌ మాత్రమే కారణం కాదు. ముఖ్యమంత్రిగా ఉండిన జగన్మోహన్‌ రెడ్డి కూడా కూటమిని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు! ఇప్పుడు కూడా ఆయన తన వైఖరిని మార్చుకోకుండా 2029లో కూడా కూటమినే గెలిపించడానికి ఉత్సాహపడుతున్నారు!


‘అంతా భ్రాంతియేనా... కలగా మిగిలి పోయేనా!’... ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఇలాగే ఉండి ఉంటుంది. నిజానికి స్థానిక ఎన్నికల ఫలితాలను చూసి ప్రతిపక్షం డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ పరిస్థితి వేరు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనీ, జగన్మోహన్‌రెడ్డి మళ్లీ రావాలని, తమకు ఆయనే కావాలని ప్రజలు అల్లాడిపోతున్నారని తాము నమ్మడమే కాకుండా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్‌రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజలు పోటెత్తుతున్నారని భ్రమలు కల్పించారు. ఆయన పెళ్లిళ్లవంటి శుభకార్యాలకు హాజరైనప్పుడు కూడా ర్యాంపులు ఏర్పాటు చేసి హడావిడి చేశారు. జగన్‌రెడ్డిని చూడ్డానికి జనం అంతులేని ఆత్రుతతో ఉన్నారన్న భావన కలిగించేలా ఎంపిక చేసిన కొంత మందిని ఆయన వద్దకు పరుగు పరుగున వెళ్లేలా డ్రామాలు ఆడించారు. పరామర్శలకు వెళ్లినప్పుడు చేసే హడావిడికి అంతే లేదు. జగన్‌రెడ్డికి ఇంత క్రేజ్‌ ఏమిటి? అని సొంత మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్‌తో చిడతలు కొట్టించారు. 2024 ఎన్నికల్లో జగన్‌రెడ్డిని ఓడించడం ద్వారా తప్పు చేశామని ప్రజలు తెలుసుకున్నారని నమ్మబలికారు. స్టేజ్‌ మేనేజ్డ్‌షోలతో సొంత పార్టీ కార్యకర్తలను భ్రమల్లో జీవించేలా చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఈ వాపంతా ప్రచారాల స్టిరాయిడ్స్‌ ఫలితమేనని తేలిపోయింది. జగన్‌ అండ్‌ కో చేసిన ప్రచారం నిజమేనని నమ్మిన పార్టీ శ్రేణులు ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికి తనకు ప్రజాదరణ పెరిగిందని చెప్పుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా భ్రాంతిలో బ్రతకడానికి అలవాటుపడేలా కార్యకర్తలను మార్చివేసింది. నిజంగానే ప్రజాభిప్రాయం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతోందా? అని తటస్థులు సైతం సందేహించేలా చేయడంలో జగన్‌ అండ్‌ కో సక్సెస్‌ అయ్యారు. అయితే 2024 ఎన్నికల నాటి పరిస్థితితో పోల్చితే ప్రజాభిప్రాయంలో పెద్దగా మార్పు లేదని స్థానిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం అయింది.


అక్రమాలు నిజమా?

ఈ ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలు చోటుచేసుకున్నాయని జగన్‌ అండ్‌ కో గొంతు చించుకుంటున్నారు. కానీ, వారి హయాంలో చోటు చేసుకున్న అరాచకాలతో పోల్చితే ఇవి ఏపాటివో అర్థమవుతుంది. అంతే కాదు! జగన్‌ అండ్‌ కో ప్రచారం చేస్తున్నట్టుగా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఉంటే... ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడలేకపోయింది. పాల్పడినా ప్రజలే ఎదిరించి నిలబడతారు. అలాగని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు న్యాయబద్ధంగా, సజావుగా జరిగాయని కూడా చెప్పలేం. ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో అధికార కూటమి ఫలితాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేయకపోలేదు. ఉదాహరణకు, పులివెందుల మునిసిపాలిటీనే తీసుకుందాం. అక్కడ ఎన్నికలు న్యాయంగా, సక్రమంగా జరిగి ఉంటే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని వైసీపీ అభ్యర్థి వైఎస్‌ ప్రమీల స్వల్ప మెజారిటీతో గెలుచుకొని ఉండేవారని చెబుతున్నారు. అక్కడక్కడా ఎన్నికల ఫలితాలు తారుమారు అయి ఉండవచ్చునుగానీ మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రచారం చేస్తున్నట్టుగా వ్యతిరేకత ఏర్పడలేదని మాత్రం స్పష్టం అవుతోంది. సజావుగా ఎన్నికలు జరిగిన ప్రాంతాలలో కూడా అధికార కూటమికీ ప్రతిపక్షానికీ మధ్య ఓట్ల తేడా 20శాతానికి పైగా ఉంది. వైసీపీ బలంగా ఉండే ప్రాంతాలలో ఈ వ్యత్యాసం ఐదు శాతం మాత్రమే ఉంది. దీన్ని బట్టి ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా ఎన్నికల్లో పెద్దగా అవకతవకలు జరగలేదని భావించవచ్చు. జగన్‌రెడ్డి ఆరోపించినట్టు ప్రజాస్వామ్యం నిజంగానే ఖూనీ అయి ఉంటే అనంతపురం నగర పాలక సంస్థను వైసీపీ ఎలా గెలుచుకోగలదు? కమ్యూనిస్టులు ముఖ్యంగా, సీపీఎం పార్టీ ఈ ఎన్నికలపై చేస్తున్న విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వైసీపీ కంటే అధికంగా ఆ పార్టీ నాయకులు కొందరు బాధపడటం వింతగా ఉంది. 2021లో జరిగిన అక్రమాలపై అప్పుడు ఈ పార్టీ నోరు విప్పకపోవడం గమనార్హం.


ఎప్పటికప్పుడే.. ఎన్నికల పరీక్ష!

జగన్‌ అండ్‌ కో ఆక్రోశాన్ని పక్కన పెడితే స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార – ప్రతిపక్షాలకు మార్గనిర్దేశనం చేశాయి. ప్రజాభిప్రాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అందుకే ఒక ఎన్నికల ఫలితంతో మరో ఎన్నికను పోల్చలేం. స్థానిక ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలకు గీటురాయి కాకపోయినా రాజకీయ పార్టీలకు ప్రజలు అంతర్లీనంగా ఒక సందేశం ఇస్తుంటారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పుర పోరుకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండింది. అక్కడక్కడా పార్టీ నాయకులు కొన్ని మునిసిపాలిటీలలో మాత్రమే పోటీకి దిగారు. అలా పోటీకి దిగిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీని గెలుచుకోగలిగారు. ఇప్పుడు వైసీపీ ఎన్నికలకు దూరంగా లేదు. దాదాపుగా అన్ని స్థానాల్లో పోటీకి దిగింది. 2021లో జరిగిన ఎన్నికల్లో 90శాతం పైగా స్థానాలు గెలుచుకున్నామని వైసీపీ నాయకులు జబ్బలు చరుచుకోగా... ఇప్పుడు 95శాతంపైగా సీట్లు సాధించామని, జిల్లా పరిషత్‌లను నూటికి నూరు శాతం గెలుచుకున్నామని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే, ప్రజలు అప్పుడూ ఇప్పుడూ రాజకీయ పార్టీలకు తాము చెప్పాలనుకున్నది చెప్పారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలంటారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నయానా భయానో దాదాపుగా అన్ని స్థానాలనూ గెలుచుకున్న వైసీపీ... ఒదిగి ఉండకపోగా తన వికృత రూపాన్ని బాహాటంగా ప్రదర్శించింది. నిజానికి అప్పటి వరకు జగన్‌రెడ్డి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత ఏర్పడలేదు. స్థానిక ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు, చోటుచేసుకున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకుండా చేశారు. జగన్‌రెడ్డి మద్దతుదారులు సైతాన్ల వలె రెచ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా ఎదిరించిన వారందరిపైనా విరుచుకుపడ్డారు. మొత్తం రాష్ర్టాన్ని ఒక జైలుగా మార్చారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కల్పించడమే కాకుండా నోళ్లకూ చేతులకూ పనిచెప్పారు. హుందాగా రాజకీయాలు చేసిన ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులను చూశాం. జగన్‌రెడ్డి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరిలో విపరీత పోకడలు ప్రవేశించాయి. మా ఓటర్లు వేరు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గుర్తుండే ఉంటుంది. ఓటర్లను ఎలా విడగొట్టారో, రెడ్లను కూడా అలా విడగొట్టినట్టుంది. జగన్‌రెడ్డి తయారు చేసిన పేటీఎం బ్యాచ్‌కు చెందిన కొంత మంది రెడ్లు నోటికి అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయారు. ఫలితంగా మిగతా వర్గాల్లో ఏవగింపు ఏర్పడింది. కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు సైతాన్లుగా మారిపోయారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సతీమణిని దారుణంగా అవమానించారు. బూతును అధికార భాషగా మార్చివేశారు. చివరికి ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపడం ద్వారా అరాచకాన్ని క్లైమాక్స్‌కు చేర్చారు. ఫలితంగానే 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. అధికార పక్షానికి ఇది ఒక గుణపాఠం అని చెప్పవచ్చు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా జగన్‌ అండ్‌ కో తమ వైఖరి మార్చుకోలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకు కారణాలను సమీక్షించుకుంటుంది. తప్పులు పునరావృతం కాబోవని ప్రజలకు హామీ ఇస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకొంటుంది. జగన్‌ అండ్‌ కో ఇందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే నరుకుతాం, చంపుతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రప్పా రప్పా అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. మొత్తంగా 2019–2024 మధ్య కాలం నాటి భయానక వాతావరణాన్ని ప్రజలు మరచిపోలేకుండా చేస్తున్నారు. 2029లో అధికారంలోకి వస్తే అందరి లెక్కలూ తేలుస్తామని హెచ్చరికలు చేయడం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఫ్యాషన్‌గా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కత్తులు, గొడ్డళ్లకు స్థానం లేదని మరచిపోయి వాటినే చేతబట్టి ప్రదర్శనలు చేశారు. దీంతో అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఇంకెంతగా రెచ్చిపోతారోనన్న భయం ప్రజల్లో సహజంగానే ఏర్పడింది. ఈ కారణంగానే స్థానిక సంస్థలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటింగ్‌ శాతం పడిపోయింది. అనేక ప్రాంతాలలో కూటమికి వచ్చిన ఓట్లలో సగం కూడా వైసీపీ పొందలేకపోయింది.

అడ్డగోలుగా... అభాసుపాలు..

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి మూడు రాజధానులు అని ప్రకటించి అభాసుపాలైన విషయం మరచిపోయారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తప్పు సరిదిద్దుకోకపోగా మావిగన్‌ అని మరో వింత వాదనను తెర మీదకు తెచ్చారు. జగన్‌ నోటి నుంచి వెలువడిన ఈ వింత ప్రకటనకు ఆయన మద్దతుదారులు జై కొట్టడం వైసీపీలోని విపరీత పోకడలకు నిదర్శనమని చెప్పవచ్చు. జగన్‌రెడ్డి ఏదో ఫ్లోలో మావిగన్‌ అని ఉంటారని తొలుత అంతా అనుకున్నారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా మావిగన్‌ రాజధాని కావాలనుకున్న వాళ్లు తనకు ఓటు వేయాలని, వద్దనుకున్న వాళ్లు కూటమికి ఓటు వేసుకోవాలని సవాలు కూడా చేశారు. పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత జగన్‌ చెబుతున్న మావిగన్‌ ప్రతిపాదనకు ప్రజలు ఏ స్థాయిలో తెర దించారో అర్థమవుతోంది. మచిలీపట్నం ప్రజలు వైసీపీని మట్టిలో కలపగా, విజయవాడ ప్రజలు విసిరికొట్టారు. గుంటూరు ప్రజలు ఆ పార్టీకి గునపం దింపారు. మేనకోడలు పెళ్లి విషయంలో జగన్‌రెడ్డి పేచీకి దిగడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత బహిర్గతం చేసింది. బెంగళూరులోని యలహంకలో తన కోసం తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించిన భవనంలో తన కుమార్తె పెళ్లి చేసుకోలేకపోవడంపై షర్మిల ఆవేదన చెందడం జగన్‌రెడ్డి మద్దతుదారులను కూడా ఆలోచనలో పడేసింది. షర్మిల తరఫున కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా రంగంలోకి దిగారు. ‘మీకు ఎంత భద్రత కావాలంటే అంత భద్రత కల్పిస్తాం. రెండు ఇళ్ల మధ్య రేకులతో అడ్డుగోడ నిర్మిస్తాం. అక్కడ పెళ్లి చేసుకోనివ్వండి’ అని ముఖ్యమంత్రి శివకుమార్‌ స్వయంగా జగన్‌కు ఫోన్‌ చేసి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ‘మా మధ్య వివాదం సమసిపోయింది’ అని కర్ణాటక ముఖ్యమంత్రికి జగన్‌రెడ్డి అబద్ధం చెప్పారు. మేనకోడలి పెళ్లికి మేనమామగా జగన్‌రెడ్డి అడ్డుపడటాన్ని సభ్య సమాజం ఎలా జీర్ణించుకుంటుంది? స్థానిక ఎన్నికల్లో ఈ ఉదంతం ప్రభావం ఉందని కూడా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిపోవడానికి ఇలాంటి సంఘటనలన్నీ కారణం కాకుండా ఉంటాయా! జగన్‌రెడ్డి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. తాను భ్రమల్లో జీవిస్తూ కార్యకర్తలనూ భ్రమల్లో జీవింపజేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సమీక్షించుకుంటే ఆయనకే మంచిది. అంతేగానీ ఈవీఎంల వల్ల ఓడిపోయామని కొంత కాలం, ఓట్‌ చోరీ అని మరికొంత కాలం చెప్పుకొంటూ భ్రమల్లో జీవించడం వల్ల అంతా భ్రాంతియేనా అని పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకుండా ఎలా ఉంటుంది?


‘కూటమి’ ముందు కర్తవ్యం

జగన్‌రెడ్డి విషయం అలా ఉంచితే స్థానిక ఎన్నికల ఫలితాల నుంచి అధికార కూటమి నేర్చుకోవలసింది ఏమిటో ఇప్పుడు చూద్దాం! ఈ ఫలితాలను బట్టి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఏమీ లేదని స్పష్టమవుతోంది. ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఆగ్రహం ఉంది. అయితే, తెలుగుదేశం కార్యకర్తలకు ఒక ప్రత్యేకత ఉంది. వారికి పార్టీ నాయకత్వంపై ఎంత కోపం ఉన్నా ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించరు. నాయకులు ద్రోహం చేస్తారేమోగానీ కార్యకర్తలు మాత్రం కలలో కూడా పార్టీకి ద్రోహం తలపెట్టరు. స్థానిక ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటో ప్రజలు చెప్పకనే చెప్పారు. పార్టీ పరిస్థితి ఎక్కడెక్కడ బాగాలేదో ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ఎమ్మెల్యేలు అరాచకంగా వ్యవహరిస్తున్న నియోజకవర్గాలలో వెంటనే పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి బలమైన అనంతపురంలో నగర పాలక సంస్థను కోల్పోవడం సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. భారతీయ జనతా పార్టీకి కేటాయించడం వల్లనే ఓడిపోయామని కొందరు చేస్తున్న వాదనలో పస లేదు. ఎమ్మెల్యేల అరాచకాలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మేయర్‌ స్థానాన్ని మాత్రమే కోల్పోయారు. ఎమ్మెల్యేలను కట్టడి చేసి పరిస్థితిని చక్కదిద్దని పక్షంలో దాని ప్రభావం మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాపై పడే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు బ్యాడ్‌గా ఉన్న చోట కూటమికీ, వైసీపీకీ మధ్య ఓట్ల అంతరం తక్కువగా ఉండటాన్ని కూడా కూటమి నేతలు గ్రహించాలి. ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయని గతంలో జగన్‌ అండ్‌ కో వలె కూటమి నేతలు కూడా రెచ్చిపోతే 2029లో ఫలితాలు చేదుగా ఉండే ప్రమాదం ఉంది. అనంతపురంతో పాటు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ అరాచకంగా వ్యవహరిస్తున్నారో గుర్తించి వెంటనే కట్టడి చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుకోని పక్షంలో ప్రమాద ఘంటికలు మోగుతాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూటమి పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఉత్తర కోస్తాలో కూటమి బలంగా ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ విజయనగరం జిల్లాలో పరిస్థితి అంత సజావుగా లేదని స్పష్టమవుతోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమి పార్టీల మధ్య తలెత్తిన విభేదాల ప్రభావం అక్కడక్కడా ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా పడింది. సాలూరు, నెల్లిమర్ల, ఆదోని లాంటి చోట్ల కూటమిలో లొసుగులు ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనిపించాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూటమిలోని ఇతర పార్టీల నాయకులను కలుపుకొని వెళ్లడంలో విఫలం కావడం వల్ల ప్రతికూల ఫలితాలను చవిచూశారు. నెల్లిమర్లలో తెలుగుదేశం పార్టీ రెబల్‌ విజయం సాధించగా, సాలూరులో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందమైంది. ఆదోని మరో ఉదాహరణ. కూటమిలో లుకలుకలు, స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉండకపోతే మొత్తం మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలు కూటమి వశమయ్యేవి.


కలిసి ఉంటే...

మొత్తంగా చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం కనబడుతోంది. సీట్ల సర్దుబాటులో లుకలుకలు తలెత్తడం ఎక్కడైనా సహజం. అయితే కలసి ఉంటే కలదు సుఖమని తెలుసుకోకుండా ఎవరికి వారు మేమే తోపులం అని చెప్పుకొని విర్రవీగితే అందరికీ మొహం పగులుతుంది. మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అంటే భయం పోలేదు. ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నప్పటికీ ఎన్నికలు స్వేచ్ఛగానే జరిగాయి. ప్రజా తీర్పును హైజాక్‌ చేశారనే నిందలు నిలబడవు. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. తొలి అర్ధ భాగం పట్ల ప్రజలు సంతృప్తితోనే ఉన్నారు. మిగతా అర్ధ భాగంలో కూటమి ప్రభుత్వం పనితీరును బట్టి 2029లో ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ గెలుపును బలుపుగా భావించకుండా మరింత బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తే 2029లో విజయానికి ఢోకా ఉండదు. అయితే, మొత్తం ఫలితాలను సమీక్షించుకుని ఎక్కడెక్కడ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తించే పనిలో ఉండాలి. ప్రభుత్వానికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. రానున్న రెండున్నరేళ్లలో ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. కూటమి పార్టీల మధ్య ఐక్యత వచ్చే ఎన్నికల వరకూ ఇదే విధంగా కొనసాగితే సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తినా అంతిమంగా 2029లో కూడా విజయ తీరాలకు చేరే అవకాశాలే కనిపిస్తున్నాయి. కూటమి ఐక్యతను చెడగొట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నించకుండా ఉండరు కనుక భాగస్వామ్య పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా అనుకూల శత్రువులు ఉంటారు. అలాంటి వారి మాటలు వింటే మొదటికే మోసం వస్తుందని కూటమి పార్టీలు గుర్తించడం వారికే మంచిది. 2024లో కూటమి భారీ మెజారిటీ సాధించడానికి లేదా అధికారంలోకి రావడానికి చంద్రబాబు–పవన్‌కల్యాణ్‌–లోకేశ్‌ మాత్రమే కారణం కాదు. ముఖ్యమంత్రిగా ఉండిన జగన్మోహన్‌రెడ్డి కూడా కూటమిని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆయన తన వైఖరిని మార్చుకోకుండా 2029లోనూ కూటమినే గెలిపించడానికి ఉత్సాహపడుతున్నారు. 2019లో చేసిన పొరపాటు మళ్లీ చేయకూడదన్న అభిప్రాయంతోనే ప్రస్తుతానికి ప్రజలు ఉన్నారు. 2029 వరకు వారు అదే అభిప్రాయంతో ఉంటారా? ఉండరా? అన్నది ఇటు కూటమి, అటు జగన్‌రెడ్డి పోకడలను బట్టి స్పష్టమవుతుంది.

ఆర్కే

ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..

అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..

Updated Date - Nov 08 , 2026 | 03:07 AM