'అందుకే నాకు భారత్ అంటే ఇష్టం'.. పోలండ్ మహిళ వీడియో వైరల్
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:29 PM
భారత్‌లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఓ మంచి అనుభవం ఎదురైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకన్న ఆమె.. భారతీయుల నిజాయతీని అభినందించారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు మాత్రమే కాదు.. అక్కడి ప్రజల ప్రవర్తనే ఆ దేశంపై చెరగని ముద్ర వేస్తుంది. అలాంటి అనుభవమే భారత్‌లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఎదురైంది. ఓ మెడికల్ షాపులో మర్చిపోయిన మందుల బ్యాగును 4 రోజుల తర్వాత భద్రంగా తిరిగి పొందిన ఆమె.. భారతీయుల నిజాయతీపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది..
డొమినికా ఇటీవల ఓ మెడికల్ షాపులో మందులు కొన్నారు. బిల్ పే చేశాక ఆ మెడిసిన్‌ను తన బ్యాగులో పెట్టుకోవడం మర్చిపోయి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె ఇంకో చోటుకు వెళ్లాల్సిరావడంతో వెంటనే రాలేకపోయారు. 4 రోజుల తర్వాత మళ్లీ ఆ స్టోర్‌కు వెళ్లి తన మందుల గురించి ఆరా తీశారు. సదరు వివరాల ఆధారంగా వెంటనే ఆ మందుల బ్యాగును తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారా షాప్ కీపర్. దీంతో డొమినికా ఆశ్చర్యానికి లోనయ్యారు. 'ఇంత జనాభా ఉన్న దేశంలో 4 రోజుల తర్వాత కూడా నా వస్తువులను భద్రంగా ఉంచడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే నాకు భారత్‌పై మరింత ప్రేమను పెంచుతున్నాయి' అని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంటూ 'అందుకే నాకు భారత్ అంటే ఎంతో ఇష్టం' అనే క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని తెగ ఆకర్షిస్తోంది.
దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు. భారత్‌లోని చిన్న చిన్న మెడికల్ షాపులు, కిరాణా దుకాణాల్లో ఇలాంటి నిజాయతీ ఇప్పటికీ కనిపిస్తోందని పలువురు కామెంట్ చేశారు. తాము కూడా పోగొట్టుకున్న వస్తువులను దుకాణదారులు భద్రంగా దాచి తిరిగిచ్చిన అనుభవాలను కొందరు షేర్ చేసుకోగా.. ఓ విదేశీయురాలు మన దేశంలోని సానుకూల అంశాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం నిజంగా అభినందనీయమని మరికొందరు కొనియాడారు.
విదేశీ పర్యాటకులు లేదా ఇక్కడ నివసించే ఇతర దేశాల ప్రజలకు భారత్ గురించి ఏర్పడే అభిప్రాయం పర్యాటక ప్రదేశాల వల్ల మాత్రమే కాకుండా సామాన్యుల ఆత్మీయత, నిజాయతీ, మానవత్వం వల్ల కూడా రూపుదిద్దుకుంటోంది. డొమినికా అనుభవం.. ఆ విలువలను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసినట్టైంది. పెద్ద పెద్ద సేవలకంటే చిన్నవైన మంచిపనులే మనుషుల మధ్య విశ్వాసాన్ని పెంచుతాయని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
ఇవీ చదవండి:
కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
'అయోధ్య విరాళాల కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు'