Share News

'అయోధ్య విరాళాల కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు'

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:43 PM

అయోధ్య విరాళాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల తరఫున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని నిర్ణయించింది. బార్ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

'అయోధ్య విరాళాల కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు'

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని బార్ అసోసియేషన్ సోమవారం సంచలన తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే న్యాయవాదులపై రూ.5 లక్షల జరిమానా విధిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా శరణ్ మిశ్రా స్పష్టం చేశారు.

నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన రోజే నిర్వహించిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని బార్ అసోసియేషన్ తెలిపింది. అందువల్లే సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంది.

ఇదే సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ ఇన్‌ఛార్జి గోపాల్‌రావుపై కేసు నమోదు చేయాలని కూడా బార్ అసోసియేషన్ తీర్మానించింది. వీరంతా మరో మూడు రోజుల్లో అయోధ్యను వీడాలని, లేనిపక్షంలో నగరమంతా బంద్ చేపట్టి, ఆలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించింది.

కాగా.. 2005లో రామ జన్మభూమి తాత్కాలిక ఆలయంపై జరిగిన ఉగ్రదాడి కేసులోనూ నిందితుల తరఫున వాదించబోమని నాడు ఇదే బార్ అసోసియేషన్ ప్రకటించింది.


ఇవీ చదవండి:

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

భారత్-పాక్ సరిహద్దుల్లో మరో పాక్ వ్యక్తి అరెస్ట్

Updated Date - Jun 29 , 2026 | 01:53 PM