అయోధ్య వివాదంలో చర్చలను సమర్థించిన నద్వీ కన్నుమూత
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:30 PM
అయోధ్య వివాదంలో చర్చల మార్గాన్ని సమర్థించిన మౌలనా సల్మాన్ నద్వీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదానికి చర్చల మార్గాన్ని బహిరంగంగా సమర్థించిన ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా సల్మాన్ నద్వీ(72) లఖ్‌నవూ(ఉత్తర్‌ప్రదేశ్)లో కన్నుమూశారు. మత సామరస్యం, పరస్పర సంభాషణకు ప్రాధాన్యం ఇచ్చిన ముస్లిం మతపెద్దగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
2018లో అయోధ్య వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో నద్వీ పలుమార్లు సమావేశమయ్యారు. వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ, మసీదును ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించవచ్చని ఆయన ప్రతిపాదించారు. ఈ అభిప్రాయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడంతో.. కొందరు ప్రశంసించగా, మరికొందరు విమర్శించారు. అయితే.. నద్వీ అభిప్రాయాలను ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికారిక వైఖరిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. దీంతో నద్వీ ఆ సంస్థ నుంచి వైదొలిగారు. చివరకు.. అయోధ్య వివాదం 2019 నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పుతో ముగిసింది. దీని ప్రకారం రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం కావడం సహా మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని కేటాయించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ప్రముఖ నద్వీ పండితుల కుటుంబానికి చెందిన మౌలానా సల్మాన్ నద్వీ.. దేశంలో అత్యంత గౌరవనీయమైన ఇస్లామిక్ సెమినరీలలో ఒకటైన లఖ్‌నవూలోని దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమాతో అనుబంధం కలిగి ఉండేవారు. దశాబ్దాలుగా ఆయన ఇస్లామిక్ ధర్మ శాస్త్రవేత్తగా, రచయితగా, వక్తగా విశేష గుర్తింపు పొందారు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం, అంతర్ మత సంభాషణ, సమకాలీన సామాజిక అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు, రచనలు విశేష ఆదరణ పొందాయి.
ఇవీ చదవండి:
కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
భారత్-పాక్ సరిహద్దుల్లో మరో పాక్ వ్యక్తి అరెస్ట్