Share News

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు..

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:06 PM

అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసుపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు అత్యవసర విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్ ముందు విచారణకు ఉంచాలని ఆదేశించింది.

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు..
Ayodhya Ram Mandir Case

ఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసుపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విరాళాల్లో అవకతవకలు జరిగాయని, కోట్ల కొద్దీ నగదు దోచుకున్నారని, ఘటనపై వెంటనే అత్యవసర విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది.


ఈ విషయాన్ని అత్యవసర ప్రాతిపదికన తక్షణమే విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు సెలవుల తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్ ముందు విచారణకు ఉంచాలని ఆదేశించింది. కాగా, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందిన విరాళాలు దుర్వినియోగం అయ్యాయని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని పిటిషన్‌దారుడు కోరాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈ విచారణ జరపాలని అభ్యర్థించాడు.


మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మందిని జ్యుడీషియల్ కస్టడీ విచారణ నిమిత్తం పోలీసులు నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయోధ్యలోని అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరిగి వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం కనిపిస్తోంది. సున్నితమైన అంశం కావడంతో అయోధ్య కోర్టు ప్రాంగణం లోపల, బయట భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.


ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, నిందితులకు తమ న్యాయవాదులు ప్రాతినిధ్యం వహించాలా, లేదా? అనే అంశంపై స్థానిక బార్ అసోసియేషన్ సమావేశమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

టీటీపీ ఉగ్ర స్థావరాలపై పాక్ వైమానిక దాడులు.. 35 మంది హతం..

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

Updated Date - Jun 29 , 2026 | 12:27 PM