టీటీపీ ఉగ్ర స్థావరాలపై పాక్ వైమానిక దాడులు.. 29 మంది హతం..
ABN , Publish Date - Jun 29 , 2026 | 07:01 AM
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు వైమానిక దాడులు నిర్వహించి 29 మంది తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల స్థావరాలు, వారి సురక్షిత ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు వైమానిక దాడులు నిర్వహించి 29 మంది తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల స్థావరాలు, వారి సురక్షిత ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో పోలీసులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ హింసాత్మక ఘటనలకు తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ), దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపులే ప్రధాన కారణమని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాగా, గత శనివారం కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. తుపాకులు, పేలుడు పదార్థాలతో దాడులకు దిగి ముగ్గురు సైనికులను చంపేశారు. మరోవైపు ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ముగ్గురు దుండగులను హతమార్చగా.. ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నాయి. నిందితుడిని అఫ్గాన్ జాతీయుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
అనంతరం ఈ దాడికి తామే బాధ్యులమని టీటీపీ అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ ప్రకటించింది. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత అఫ్గాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దళాలు తాజా ఆపరేషన్ చేపట్టి టీటీపీ రహస్య స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు నిర్వహించాయి. దీంతో టీటీపీకి చెందిన 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, పాక్ తాజా దాడులు ఇస్లామాబాద్, కాబూల్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
పశ్చిమాసియాలోమళ్లీ యుద్ధ మేఘాలు