Share News

పశ్చిమాసియాలోమళ్లీ యుద్ధ మేఘాలు!

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:27 AM

పశ్చిమాసియాను మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య అవగాహన ఒప్పందానికి పురిట్లోనే గండిపడింది.

పశ్చిమాసియాలోమళ్లీ యుద్ధ మేఘాలు!

  • వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిగా ఇరాన్‌పై అమెరికా దాడులు

  • ఖెష్మ్‌ దీవి, హోర్ముజ్‌ తీరప్రాంతంలోని పట్టణాలపై బాంబులు

  • దీటుగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్‌

  • కువైట్‌, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు

  • ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • మా జోలికి వస్తే నరకం చూపిస్తాం: ట్రంప్‌కు ఇరాన్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌/టెహ్రాన్‌/న్యూఢిల్లీ, జూన్‌ 28: పశ్చిమాసియాను మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య అవగాహన ఒప్పందానికి పురిట్లోనే గండిపడింది. శనివారం మొదలైన పరస్పర దాడులు ఆదివారం మరింత ఉధృతమయ్యాయి. దాడులు ఆపకుంటే ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించగా... తమ జోలికి వస్తే అమెరికాకు నరకం చూపిస్తామంటూ ఇరాన్‌ దీటుగా స్పందించింది. దీనితో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నౌకలపై ఇరాన్‌ దాడులతో మొదలు..

హోర్ముజ్‌ జలసంధిలో తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రయాణిస్తోందంటూ ఎవర్‌ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. అవగాహన ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోందంటూ.. శనివారం హోర్ముజ్‌ జలసంధికి సమీపంలో ఇరాన్‌లోని లక్ష్యాలపై అమెరికా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. దీనితో మండిపడిన ఇరాన్‌ గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది. అయితే హోర్ముజ్‌ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న భారీ చమురు ట్యాంకర్‌ నౌక ‘కికు’పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఇది ఇరాన్‌ పనేనంటూ అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఆదివారం తెల్లవారుజామున పర్షియన్‌ గల్ఫ్‌లోని ఇరాన్‌ దీవి ‘ఖెష్మ్‌’పై, హోర్ముజ్‌ జలసంధి సమీపతీరంలోని సిరిక్‌, బందర్‌ ఈ లెంగే నగరాల్లో 10 ప్రాంతాలపై భారీస్థాయిలో దాడులు చేసింది. ఇరాన్‌ నిఘా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, సముద్ర మందుపాతరల (సీమైన్ల) నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ దాడులకు సంబంధించి 38 సెకన్ల వీడియోను విడుదల చేసింది. పరస్పర దాడు లు కొనసాగుతున్నా హోర్ముజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని.. అమెరికా నౌకాదళం పూర్తి అప్రమత్తత ఉందని పేర్కొంది.


అమెరికా స్థావరాలపైకి ఇరాన్‌ క్షిపణులు

అమెరికా దాడులపై ఇరాన్‌ దీటుగా స్పందించింది. కువైట్‌, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్‌లోని అలీ అల్‌ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్‌ పోర్ట్‌ సల్మాన్‌ వద్ద ఉన్న అమెరికా ఐదో నావికాదళ స్థావరం సహా ఎనిమిది కీలక సైనిక కేంద్రాలను ధ్వంసం చేశామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) పేర్కొంది. అమెరికా చేసే ఎలాంటి దాడులకైనా మా స్పందన అత్యంత విధ్వంసకరంగా ఉంటుందని హెచ్చరించింది. కాగా, తమ దేశంవైపు వస్తున్న క్షిపణులు, డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకుంటున్నామని కువైట్‌ ప్రకటించింది.

కాల్పులు ఆపేందుకు పాక్‌ ప్రయత్నాలు

అమెరికా, ఇరాన్‌ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్‌.. తాజా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్ర యత్నాలు మొదలుపెట్టింది. దీనిపై పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ ఇరుదేశాల ప్రతినిధులను సం ప్రదించారు. కాల్పుల విరమణ, అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కరారు. ఇక యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ విధానం చీఫ్‌ కాజా కల్లాస్‌, బహ్రెయిన్‌ విదేశాంగ మంత్రి రషీద్‌ కూడా ఇషాక్‌దార్‌తో మాట్లాడారు. కాగా కువైట్‌, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ దాడులను గల్ఫ్‌ దేశాల కూటమి ‘గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)’ ఖండించింది. వెంటనే దాడులు ఆపాలని విజ్ఞప్తి చేసింది.

అమెరికాకు నరకం చూపిస్తాం: ఐఆర్‌జీసీ

అమెరికా చేసే ప్రతీ దాడికీ తమ ప్రతిదాడి ఉంటుందని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. కాల్పుల విరమణను అమెరికాయే ఉల్లంఘిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలన్నీ నిలిచిపోతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్‌జీసీ నావికాదళ కమాండర్‌ ప్రకటన చేశారు. ‘‘సిరిక్‌పై, హోర్ముజ్‌ తీరప్రాంతాలపై అమెరికా గుడ్డిగా చేసిన దాడులేవీ కూడా.. హోర్ముజ్‌ జలసంధిపై మా నియంత్రణను ఏమా త్రం దెబ్బతీయలేవు. హోర్ముజ్‌లో నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు మా దాడులతో గట్టి హెచ్చరిక సంకేతాలు వెళ్లాయి’’ అని పేర్కొన్నారు.


ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తా: ట్రంప్‌

గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అవగాహన ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ‘‘ఇరాన్‌ మళ్లీ కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో మా సైన్యం దాడులు చేయాల్సి వచ్చింది. ఇరాన్‌ ఎప్పటికీ పాఠం నేర్చుకునేలా కనిపించడంలేదు. మా సహనానికి హద్దు అంటూ ఉంటుంది. అది దాటితే మేం సైన్యంతోనే పని పూర్తి చేయాల్సి వస్తుంది. అదే జరిగితే ఇక ఇరాన్‌ అనే దేశమే ఉండదు’’ అని ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు.

3 రోజుల్లో 7 నౌకలు

  • హోర్ముజ్‌ జలసంధి దాటి భారత్‌కు మరో 15 పర్షియన్‌ గల్ఫ్‌లో నిరీక్షణ

విదేశాల నుంచి భారత్‌కు సరుకు రవాణా చేస్తున్న ఏడు కార్గో నౌకలు గత మూడు రోజుల్లో హోర్ముజ్‌ జలసంధిని దాటాయి. వీటిలో 65 వేల టన్నుల రసాయన ఎరువులు తీసుకొస్తున్న రెండు ‘ఏపీజేప్రీతి2’ నౌకలు శనివారం ఈ మార్గం గుండా వచ్చాయి. అంతకుముందు రోజు లక్ష టన్నులకు పైగా ముడి చమురుతో ‘దేశ్‌ సురక్ష’ ట్యాంకర్‌, 18,732 టన్నుల సరుకుతో ‘ప్రభు పార్వతి’ నౌక ఇదే మార్గం గుండా భారత్‌కు వచ్చాయి. ఇవిగాక మరో రెండు విదేశీ నౌకలు ఇదే మార్గంలో ప్రయాణించాయి. అధికారిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఘర్షణ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకూ భారత్‌కు సరుకులు రవాణా చేసే 44 నౌకలు ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా ప్రయాణించాయి. హోర్ముజ్‌ ద్వారా భారత్‌కు రావాల్సిన మరో 15కు పైగా నౌకలు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్‌ గల్ఫ్‌లో వేచి ఉన్నాయి. వీటిలో భారతీయ జెండా గల 10 నౌకలు ఉన్నాయి. వాటిలో నాలుగు ఎరువులను, మరొకటి ఇంధనాన్ని తీసుకురానున్నాయి.

Updated Date - Jun 29 , 2026 | 04:27 AM