Share News

ఓ కొడుకు ‘మొక్క’వోని దీక్ష!

ABN , Publish Date - Oct 04 , 2026 | 01:14 PM

ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద బహుమతులు, ఆర్భాటాలు అవసరం లేదు. కొన్నిసార్లు ప్రియమైనవారికి సంతోషాన్నిచ్చేది చేసినప్పుడు ఆ తృప్తి వేరు.

ఓ కొడుకు ‘మొక్క’వోని దీక్ష!
Green Home

ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద బహుమతులు, ఆర్భాటాలు అవసరం లేదు. కొన్నిసార్లు ప్రియమైనవారికి సంతోషాన్నిచ్చేది చేసినప్పుడు ఆ తృప్తి వేరు. పాకిస్తాన్‌లోని మియాన్‌ అస్గర్‌ అలీ అమ్మ అడిగిందని, ఇంటి చుట్టూ ఏకంగా ఒక అడవినే పెంచేశాడు. ఆ తల్లి కళ్లలో ఆనందంతో పాటు... అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

పాకిస్తాన్‌లోని చిన్న పట్టణం పటోకిలో మియాన్‌ అస్గర్‌ అలీది మధ్యతరగతి కుటుంబం. పదేళ్ల క్రితం అతడి తల్లి ‘ఇంటిని పచ్చదనంతో నింపుతావా?’ అంటూ ఒక కోరిక కోరింది. బిడ్డ తన కోరికను తీర్చుతాడనే నమ్మకంతో ఆమె ఆ మాట అంది. చిన్న ఇల్లు... అక్కడ చెట్లు నాటేంత పెద్ద స్థలమూ లేదు. అసాధ్యమని అతడికి తెలుసు. అందుకే తల్లితో కుదరదని ఖరాకండిగా చెప్పేశాడు. ఆమె ఏమీ అనలేదు. తన కోరిక తీరలేదని బాధ పడింది. మౌనంగా ఉండిపోయింది. అలీకి ఆమె నిశ్శబ్దం తీరని బాధను కలిగించింది. ఆ క్షణమే తల్లి కోరికను తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడు.


xxx.jpg5,700 మొక్కలు...

2016లో అస్గర్‌ అలీ ఇంటి చుట్టూ చెట్లు నాటడం మొదలెట్టాడు. ముందుగా 50 మొక్కలు కొని వాటిలో 10 ఇంటి లోపల, 40 కాంపౌండ్‌ గోడ వెంబడి నాటాడు. మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా తీసుకుని, క్రమంగా ఇంటి చుట్టూ అందుబాటులో ఉన్న ప్రతీ అంగుళాన్ని పచ్చదనంతో నింపాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మొక్కల సంరక్షణ అనేది అతనికి రోజువారీ కార్యక్రమంగా మారింది. అలా ఈ పదేళ్లలో ఇంటి పరిసరాల్లో 5,700లకు పైగా మొక్కలను నాటి, వాటిని సంరక్షిస్తున్నాడు. మొదట్లో ఈ చెట్ల పెంపకం చూసి... చాలామంది అతడిని పిచ్చివాడనుకున్నారు. కానీ ఈ రోజు వారంతా ఆ ఇంటిని స్వర్గంతో పోల్చుతున్నారు. అతడి కృషి, పట్టుదలను మెచ్చుకుంటున్నారు.


రికార్డే లక్ష్యంగా...

మొత్తానికి అలీ తన ఇంటిని ఒక గ్రీన్‌హౌస్‌గా మార్చాడు. తల్లి కోరికను తీర్చేందుకు... మొక్కలు నాటడానికి ఇప్పటి దాకా అతను సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. నెలకు 10 వేల రూపాయలు వాటి సంరక్షణ కోసం ఖర్చు చేస్తున్నాడు. సోషల్‌మీడియాలో అలీ ఇల్లు వైరల్‌ కావడంతో... ఎక్కడెక్కడి నుంచో ప్రకృతి ప్రేమికులు సందర్శిస్తున్నారు. త్వరలోనే 10 వేల మొక్కలను పెంచి గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాలనుకుంటున్నాడు అలీ. ఇది కేవలం ఒక గ్రీన్‌హౌస్‌ కాదు... తల్లి కలకు ప్రతిరూపంగా ఓ కొడుకు ‘మొక్క’వోని దీక్ష అనొచ్చేమో!


ఈ వార్తలు కూడా చదవండి:

తొలి ఏడాది తీపి గుర్తులు!

అది మర్యాద కాదు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 01:14 PM