ఫామ్ 7తో ఓట్లు తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర: ఓవైసీ
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:02 PM
ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (SIR)పై హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 04: ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (SIR)పై హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎంపీ ఒవైసీ మాట్లాడుతూ.. ఫలానా ఓటర్ పేరు తొలగించాలని ఫామ్ 7 సమర్పిస్తున్నారని తెలిపారు. కానీ ఆ అప్లికేషన్ ఎవరూ ఇచ్చారో వివరాలు వద్ద ఉండటం లేదని పెదవి విరిచారు.
దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ)ని ఆయన డిమాండ్ చేశారు. ఈ డ్రామా ఇలాగే కొనసాగితే.. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌ను మించి హైదరాబాద్‌లో ఆందోళనలు చేస్తామని ఈసీని అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. ఈ అంశంపై ఎంఐఎం మౌనంగా ఉండబోదని ఈసీకి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
మరో వైపు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో దొడ్డిదారిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)గా మార్చాలని చూస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ మొదటి నుంచి ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ అమలు చేయడానికి ఇదే ప్రక్రియను ప్రాతిపదికగా తీసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.
దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. ఈ ఎస్‌ఐఆర్‌ను తేలికగా తీసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా ఓటు హక్కుతోపాటు పౌరసత్వం కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలను ఎంఐఎం చీఫ్ ఒవైసీ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం: మంత్రి కొండపల్లి
నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత.. ప్రత్యేక పూజలు