పెరిగిన అద్దెలు.. ఇళ్ల కొరత.. స్పెయిన్‌లో లక్షలాది మంది నిరసన
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:47 PM
స్పెయిన్‌లో ఇటీవల లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, ఇళ్ల కొరతకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో ఇటీవల లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనకు దిగడం సంచలనంగా మారింది. అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, ఇళ్ల కొరతకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంటిని ఓ పెట్టుబడిగా చూసే ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ వల్ల సామాన్యులు నరకం అనుభవిస్తున్నారంటూ రాజధాని మాడ్రిడ్ సహా పలు నగరాల్లో వీధుల్లోకి వచ్చిన పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రాబోయే రోజుల్లో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని కూడా నిర్వాహకులు హెచ్చరించారు.
వృద్ధురాలి గెంటివేతతో..
అద్దె ఇంట్లో ఉంటున్న ఓ 87 ఏళ్ల వృద్ధురాలిని ఇటీవల ఓనర్లు బలవంతంగా వెళ్లగొట్టడంతో స్పెయిన్ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అద్దె పెంపునకు అంగీకరించని కారణంగా వృద్ధురాలిని గెంటేశారు. దీంతో, ఒక్కసారిగా నిరసనలు భగ్గుమన్నాయి. దేశంలోని పలునగరాలకు విస్తరించాయి. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నివేదిక ప్రకారం, దేశంలో 7 లక్షల ఇళ్ల కొరత ఉంది. ఇది చాలదన్నట్టు 2025లో ఇళ్ల అద్దెలు 8.5 శాతం మేర పెరిగాయి. మాడ్రిడ్‌లో ఏకంగా 9.7 శాతం మేర పెరిగాయి. రియలెస్టేట్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యుల సొంతింటి కల కల్లగా మారిపోయింది. మరోవైపు ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిపడింది.
రాబందుల్లాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్..
స్పెయిన్ రియలెస్టేట్ రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అని ప్రజలు నిందిస్తున్నారు. సామాన్యులు నివాసముండే సముదాయాలను ఇన్వెస్టర్లు పెట్టుబడి సాధనాలుగా చూస్తూ భారీ ఎత్తున కొనుగులు చేస్తున్నారని, ఫలితంగా సామాన్యుడి సొంతింటి కల చెదిరిపోయిందని అంటున్నారు. ఇళ్ల అద్దెలు కూడా అదే స్థాయిలో పెరిగి పరిస్థితి సంక్షోభ స్థాయికి చేరుకుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలు విఫలం..
ఇళ్ల అద్దెలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. ఇంటి అద్దెలు పెంపుపై నిషేధం విధించేందుకు, పాత రెంటల్ కాంట్రాక్ట్‌లు మరో రెండేళ్ల పాటు కొనసాగించేందుకు ప్రధాని పెడ్రో శాంఛెజ్ సారథ్యంలోని సోషలిస్టు పార్టీ రెండు మార్లు బిల్లులను అక్కడి సభలో ప్రవేశపెట్టింది. టూరిస్టు అపార్ట్‌మెంట్లపై పన్నులు పెంచడం, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఇళ్ల కొనుగోళ్లపై పరిమితులు విధించే ప్రతిపాదనలనూ సభ ముందుకు తీసుకొచ్చింది. కానీ మైనారిటీ ప్రభుత్వం కావడంతో బిల్లును పాస్ చేయించుకోలేకపోయింది. రైటిస్టుపార్టీలు ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో, స్పెయిన్‌లో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఫ్లైదుబాయ్ విమానం దారి మల్లింపు.. లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్
ఫ్లైదుబాయ్ ఉదంతం.. విమానంలోని ఆ ఇద్దరూ ఎవరు?