ఫ్లైదుబాయ్ ఉదంతం.. విమానంలోని ఆ ఇద్దరూ ఎవరు?
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:54 AM
ఫ్లైదుబాయ్ ఉదంతంలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన ఇద్దరు పైలట్లు ఎవరన్న అంశంపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ ఉదంతంలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన ఇద్దరు పైలట్లు ఎవరన్న అంశంపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతోంది. ఘటన జరిగి మూడు రోజులు కావొస్తున్నా ఎయిర్‌లైన్స్ వారి వివరాలను వెల్లడించలేదు. కాక్‌పిట్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో అదుపుతప్పిన విమానాన్ని ఆ ఇద్దరు పైలట్లు మళ్లీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో వారు విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు.
అది అద్భుతమే..
ప్రమాద సమయంలో ఆ పైలట్లు విమానంలో ఉండటం అద్భుతమేనని మరో ప్యాసింజర్ చెప్పారు. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన కోపైలట్ హమమ్‌ను ప్రయాణికులు నిలువరించే సమయంలో ఆ పైలట్లు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మొదట ఓ పైలట్ ప్రయాణికులను దాటుకుంటూ వెళ్లి విమానాన్ని నియంత్రించారని చెప్పారు. ఆ వెంటనే రెండో పైలట్ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లారని చెప్పారు. ఆ తరువాత వారిద్దరూ కాక్‌పిట్ తలుపులు మళ్లీ వేసుకుని విమానాన్ని సేఫ్‌గా తబుక్‌లో ల్యాండ్ చేశారు. ఫ్లైట్ తిరుగుప్రయాణంలో విధులు నిర్వర్తించేందుకు వారిద్దరూ విమానంలో వెళుతున్నట్టు సదరు ప్రయాణికుడు చెప్పారు. వారే లేకపోతే పరిస్థితి ఏమై ఉండేదోనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన రోజు కోపైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ కాక్ తలుపులు తెరవడంతో ప్రయాణికులకు జోక్యం చేసుకునే అవకాశం దక్కింది. అప్పటికే తాము కాక్‌పిట్‌లో అరుపులు విన్నామని రెండో వరుసలోని సీటులో కూర్చున్న ప్యాసింజర్ ఒకరు తెలిపారు. కాక్‌పిట్ తలుపులు తెరుచుకోగానే ఓ ప్రయాణికుడు కోపైలట్‌ను నిలువరించే ప్రయత్నం చేయగా ఇతర ప్రయాణికులు సాయం చేశారని చెప్పారు. ఈలోపు విమానంలోనే ఉన్న ఇద్దరు పైలట్లు ఫ్లైట్‌ను అదుపులోకి తెచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారని అన్నారు. విమానం సేఫ్ అని వారు చెప్పగానే తమ మనసు కుదుటపడిందని ఆ ప్రయాణికుడు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్
కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్