తొలి ఏడాది తీపి గుర్తులు!
ABN , Publish Date - Oct 04 , 2026 | 07:59 AM
అమ్మ కడుపులో జీవం పోసుకున్న బుజ్జాయి... ఈ నేలమీదికి రావడం ఓ అద్భుతం. పూర్తిగా విచ్చుకోని కళ్లు... చిట్టి చిట్టి చేతులు, కాళ్లు... పాపాయి నవ్వినా, ఆవలించినా కూడా క్యూట్‌గా ఫీలవుతాం.
అమ్మ కడుపులో జీవం పోసుకున్న బుజ్జాయి... ఈ నేలమీదికి రావడం ఓ అద్భుతం. పూర్తిగా విచ్చుకోని కళ్లు... చిట్టి చిట్టి చేతులు, కాళ్లు... పాపాయి నవ్వినా, ఆవలించినా కూడా క్యూట్‌గా ఫీలవుతాం. అయితే ఈ అరుదైన కదలికల్ని మురిపెంగా చూడటం నిన్నటి మాట. ఈతరం పేరెంట్స్ ఫొటోలతో పాటు తేదీలు, వర్ణనలు, పాపాయి తొలి వస్తువులు... అన్నీ ఓ పుస్తకంలో భద్రంగా దాచిపెడుతున్నారు. పిల్లల బాల్యాన్ని ‘మెమొరీ బుక్’గా మారుస్తు న్నారు. మార్కెట్లో లభిస్తున్న ‘మెమొరీ బుక్’ల ట్రెండ్ గురించిన విశేషాలివి...
తల్లిదండ్రులయ్యే అనుభూతి జీవితంలో మర్చిపోలేనిది. పుట్టినరోజు నుంచి ఏడాది దాకా పాపాయి ప్రతీ కదలికను మురిపెంగా చెప్పుకుంటుంటారు. ఈరోజు పాప నవ్విందని, బాబు గుర్తుపట్టాడని... బుజ్జాయి బుడి బుడి అడుగులు వేస్తోందని... అన్నీ అద్భుతాలే. కొందరు ఫొటోలు తీసి ఆల్బమ్‌లలో భద్రపరుస్తారు. అయితే పిల్లల జ్ఞాపకాలకూ ‘బేబీ మెమొరీ బుక్’లు వచ్చేశాయి. అందులో ఏడాది లోపు పాపాయికి సంబంధించి ప్రతీ విషయాన్ని రికార్డు చేసుకుంటున్నారు ఈతరం పేరెంట్స్. పెరిగే పిల్లలకే కాదు... తల్లిదండ్రులకు ఇదో అందమైన మెమొరీ బ్యాంక్. ప్రస్తుతం ప్రపంచమంతా ఫాలో అవుతోన్న ట్రెండ్ ఇది.
రెండూ వేర్వేరు...
ఇది ఓ ఫోటో ఆల్బమ్ లాంటిదే అనుకుంటే పొరపాటే. పుట్టిన పిల్లలు పెరుగుతూనే ఉంటారు. ప్రతీరోజూ వాళ్లను ఫొటోలు తీస్తూ, ఆల్బమ్స్‌ను నింపేసి... కొన్ని రోజుల తరవాత వాటిని అటక మీదకు ఎక్కిస్తుంటారు. చాలామంది ఇళ్లలో ఇలాంటి ఫొటో ఆల్బమ్స్‌కు లెక్కలేదు. అయితే వాటికీ ‘మెమొరీ బుక్’లకూ తేడా ఉంది.
పిల్లలు పుట్టడం ఓ అపురూప ఘట్టం. ఆస్పత్రిలో నుంచి పసికూనగా వచ్చిన బిడ్డ రోజు రోజుకూ పెరుగుతూ మన ప్రపంచమే తనదిగా చేసుకుంటాడు. అందుకే ఆ పసిపాపల ప్రతీ చర్యనూ పదిలంగా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా ఇది పిల్లలకు ఓ చక్కని బహుమతిగా, పెద్దలకు ఓ చిక్కని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ కొత్త ఆలోచన వల్లే నేడు ‘మెమొరీ బుక్స్’ ప్రపంచమంతా ట్రెండ్ అయ్యాయి.
పసిపాపలు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన రోజు, నామకరణం, తొలిసారి నవ్విన రోజు, అన్నప్రాశన, పుట్టెంట్రుకలు, అడుగులు వేసిన రోజు, బల్ల సహాయంతో నిలుచున్న రోజు, అమ్మా అని తొలి పలుకులు పలికిన రోజు, అక్కను చూసి పొంగిపోయిన క్షణం, మొదటి పుట్టిన రోజు వరకు... ఇలా పిల్లలకి సంబంధించి ప్రతీ విషయాన్నీ ఎంతో ప్రేమతో కెమెరాలో బంధించి, దానికి తేదీలు, వ్యాఖ్యానాలు జతచేసి ఆనందంగా పదిలపరుచుకోవడమే ఈ ‘బేబీ మెమొరీ బుక్’ ప్రత్యేకత. దీన్నే కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్‌ఫాంట్ కీప్‌సేక్ బుక్’ ‘బేబీ మైల్‌స్టోన్ బుక్’ అని కూడా అంటున్నారు. పేరు ఏదైనా ఏడాది లోపు పిల్లలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని బంధించి, పుస్తకంలో పదిలపరచుకోవాలని సూచించేవే అన్నీ.
పన్నెండు అంశాలు...
కొత్తగా పేరెంట్స్ అయినవారికి పిల్లల్ని డీల్ చేయడమే పెద్ద ఛాలెంజ్. ఇక పిల్లల ప్రతీ చర్యలను కెమెరాలలో బంధించి, పదిలపరచుకోవడం అంటే మాటలా? ఇది కూడా పెద్ద పనిగా భావించి, భయపడేవారు ఉండవచ్చు. అలాంటివారు సులువుగా అర్థమయ్యే విధంగా ఈ మెమొరీ బుక్‌లో ఎలాంటి అంశాలను పొందుపరచాలంటే...
కడుపులో ఉన్నప్పుడే: తల్లి కడుపులోకి చేరినప్పటి నుంచే పాపాయి లైఫ్ జర్నీ మొదలవుతుంది. అందుకే ఈ విషయాలు కూడా ఆల్బమ్‌లో ఉండేలా చూసుకోవాలి. తొలి స్కానింగ్, బేబీ బంప్ పెరగడం, చక్కని పేర్ల కోసం వెతుకులాట, ఎంపిక చేసుకున్న పేర్లను కాగితాల మీద రాసుకోవడం... లాంటివన్నీ మెమొరీ బుక్‌లో ఉపోద్ఘాతంగా పనికి వస్తాయి. కాబట్టి వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పుస్తకంలో రాయడం, అతికించడం మరచిపోకండి.

వెల్కమ్ సెరమనీ: ఒక్కో కుటుంబం ఒక్కో పద్ధతిలో పిల్లల నామకరణం వేడుకలు చేస్తుంటాయి. ఈ సంభ్రమాన్నంతా రికార్డు చేయడం తప్పనిసరి. తాతా నానమ్మలతో, అమ్మమ్మ తాతయ్యలతో పిల్లల ఫొటోలు తీసుకోవాలి. ఆ వేడుకకు వచ్చిన అతిథుల పేర్లను రాసుకోవాలి.
చిన్ని పాదాల అచ్చులు: కొత్తగా పుట్టిన పిల్లలు ఎంత క్యూట్‌గా ఉంటారో చెప్పక్కర్లేదు. ప్రపంచమంతా ఓ వైపు... బోసినవ్వుల పసిపాప మరో వైపు అనిపిస్తుంది ప్రతీ తల్లిదండ్రులకి. ఇంకా వారి బుల్లిబుల్లి పాదాలు, చేతులు, వేళ్లు... అద్భుతంగా అనిపిస్తాయి. వీలైతే ఆ బుజ్జిపాదాల అడుగులని భద్రరచుకోవడానికి ప్రయత్నించాలి. ఎలాంటి రసాయనాలు లేని కుంకుమ లేదా పసుపు నీళ్లలో ఓ క్షణం పాదాల్ని అద్ది కాయితం మీద పాద ముద్రలు సేకరించాలి. వీటికి ఏ ఫొటోగ్రాఫ్‌లూ సాటిరావని వేరే చెప్పక్కర్లేదు.
కొన్ని అల్లర్లు కూడా: అన్ని జ్ఞాపకాలూ ఘనంగా ఉండక్కర్లేదు. కొన్ని కాస్త చిరాకు, కంగారు పెట్టినవి కూడా ఉండకపోవు. ఉదాహరణకు స్నానం చేయిస్తుంటే నీళ్లంతా ఒలికిపోయి హాలంతా చిన్నపాటి సరస్సు అయిన సంఘటన. ఏదో అసౌకర్యం వల్ల బుజ్జాయి రాత్రంతా నిద్రపోకుండా అమ్మని ఇబ్బంది పెట్టిన సందర్భం లాంటివీ ఈ పుస్తకంలో రాసిపెట్టుకోవాలి. ఇప్పుడు చిరాకుగా అనిపించినా పిల్లలు పెద్దయ్యాక ఇవే చిరునవ్వులై విరబూస్తాయి.

ప్రతీ మైలురాయి: తొలిసారి నవ్వడం, పక్కకి దొర్లడం, తుళ్లుతూ వేసిన తొలి అడుగు... ఇవన్నీ బుజ్జాయి జీవితంలో మైలురాళ్లు. వీటన్నింటినీ కెమెరాల్లో బంధించి... పుస్తకంలో తేదీలు, సమయంతో పాటు రాసిపెట్టుకోవాలి. అలాగే ఆ సమయంలో మీ హృదయ స్పందనలు రాసుకోవాలి. ‘ఈరోజు బాబు నవ్వాడు... ఆ నవ్వుకి ఓ క్షణం నా గుండె ఆగిపోయింది’, ‘ఈ ప్రపంచానికి నేనే మహారాజుని అన్న లెవెల్లో ముందుకు అడుగు వేశాడు... వాడు పడిపోతాడేమోనని నాకు భయం... ఈయనేమో పర్వాలేదంటూ నా చెయ్యి పట్టుకోవడం.... ఈ క్షణానికి ఈ జీవితానికి వేరే ఏదీ వద్దనేంతగా అనిపించింది’... ఇలా మీరు రాసే ప్రతీది మీకే కాదు, మీ పాపాయికి పెద్ద జ్ఞాపకంగా ఉంటుంది.
ఇష్టాయిష్టాలు: పాపాయి పెరుగుతోన్న కొద్దీ వాళ్ల ఇష్టాలు, అయిష్టాలు బయటపడుతుంటాయి. నచ్చని ఆహారం పెడుతుంటే ముఖం చిట్లించడం, ఏదైనా పాట వింటే హాయిగా స్పందించడం... మీరు రోజూ ‘జో అచ్యుతానంద...’ లేక ‘చందమామ రావే’... పాడితేనే నిద్రపోవడం లాంటివి కూడా ఈ పుస్తకంలో భద్రపరచాలి.
ఫొటో సిరీస్: ఏడాదికి పన్నెండు నెలలు.. ఒక్కో నెలకీ ఒక్కో థీమ్‌ని అనుకుని ఆ విధమైన రంగుల దుస్తులు, యాక్సెసరీలతో ఫొటో సిరీస్ చేస్తే కాస్త సృజనాత్మకంగా ఉంటుంది. అయితే తొలి నెలల పాపాయికి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరీ ఫ్యాన్సీ, అసౌకర్యం కలిగించే దుస్తులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బంధాలు: పాపాయికి అన్న, అక్క ఉంటే వాళ్ల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సహజమైన ఫొటోలు తీసుకోవడం మరచిపోకండి. ఒకవేళ మీ ఇంట్లో పెట్స్ ఉంటే ఆ ఆప్యాయతల ఫొటోలు కూడా తీయాలి.
ఓ రోజు పూర్తిగా: ఇక నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు... ఏదో ఒక రోజును పూర్తిగా రికార్డు చేయడానికి ప్రయత్నించండి. ఉదయం ఆహారం, స్నానం, నిద్రపోవడం, మధ్యాహ్నం కాసేపు కిటికీ పక్కన నారింజ ఎండలో పాపాయిని సేదతీర్చడం, సాయంత్రం నిద్రపోవడం లాంటివన్నీ రకరకాలుగా ఫొటోలు తీసి ప్రత్యేక అంశాలుగా పొందుపరుస్తే, సాధారణమే అయినా కొన్నేళ్లకి అసాధారణంగా అనిపిస్తాయి.
మొదటి పుట్టినరోజు: పాపాయి తొలి పుట్టినరోజు ఇంటికే పండగ లాంటి రోజు. స్నేహితులు, బంధువులతో కలిసి చాలా ఘనంగా చేసుకోవాలనే ప్లాన్ చేస్తారు అందరూ. ఆ హడావుడిలో మీరే ఫొటోలు తీయాలని అనుకోకుండా ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌తో పాపాయిని అందంగా ఫొటోలు తీయించి, కొన్నిటిని మెమొరీ బుక్‌లో అలంకరించి చూడండి. పుస్తకంలో ఈ పేజీలు ఎంతో స్పెషల్‌గా అనిపిస్తాయి.
ఫ్యామిలీ ట్రీ: పుస్తకం చివరలో మీ కుటుంబాన్ని తెలియజేసే ఫ్యామిలీ ట్రీని గీసి అందులో మీ అందరి ఫొటోలు పదిలపరచండి. కొత్తగా వచ్చిన పాపాయిని మధ్యలో పెట్టి అమ్మానాన్న, అన్న, అక్కతో పాటు తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలను, పెంపుడు జంతువులు... ఇలా అందరినీ ఇందులో భాగం చేస్తే గొప్ప జ్ఞాపకంగా మారుతుంది.
ఇలా ఎన్నో అపురూప సందర్భాలను ఒడిసిపట్టే ‘మెమొరీ బుక్’ పిల్లలకు పెద్దయ్యాక తమ జీవితంలో ఓ అపురూప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. కాదంటారా?
ఈ వార్తలు కూడా చదవండి:
జ్ఞానేశ్ ఉద్వాసనకు 10న దేశవ్యాప్త నిరసనలు
తండ్రి సూపర్ ఐడియా.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News