Share News

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:17 AM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Vikarabad mother children incident

  • కుటుంబ కలహాలతో బావిలోకి దూకి బలవన్మరణం

  • వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో ఘటన

పూడూరు, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తిలో జరిగింది. మండలంలోని మాటుగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి రాజు, మమత అలియాస్‌ పద్మమ్మ(30) దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వారిపై గతంలో వికారాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన ఇద్దరు పిల్లలు సాకెత్‌ (8), జనశ్రీ (4)ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన మమత.. సోమన్‌గుర్తి సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకింది.


బావి గట్టుపై చెప్పులు, హ్యాండ్‌ బ్యాగ్‌ను గమనించిన స్థానికులు.. బావిలోని మృతదేహలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, భర్త రాజు వేధింపుల కారణంగానే మమత ఈ ఘటనకు పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ మేరకు మమత తండ్రి బేగరి హన్మయ్య ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 07:39 AM