Share News

ఇది కాలం కరువు కాదు కాంగ్రెస్‌ కరువు

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:08 AM

ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ సర్కారు అసమర్ధత వల్ల వచ్చిందేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.

ఇది కాలం కరువు కాదు కాంగ్రెస్‌ కరువు
Harish Rao

  • నెలల క్రితం హెచ్చరించినా ముందస్తు చర్యల్లేవు..

  • కాంగ్రెస్‌ సర్కారుకు కమీషన్లపైనే శ్రద్ధ

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపణ

నర్సాపూర్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ సర్కారు అసమర్ధత వల్ల వచ్చిందేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని 6 నెలల క్రితమే వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోనందువల్లే ఈనాడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం కాగజ్‌మద్దుర్‌లో పలుగ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, యువకులు భారీగా శనివారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. హరీశ్‌రావుతోపాటు నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కమీషన్లపై ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి ప్రజాసంక్షేమంపై లేదన్నారు. రాష్ట్ర రైతాం గం కరంటు కష్టాలను ఎదుర్కొంటుంటే రాజస్థాన్‌కు 800 మెగావాట్ల విద్యుత్‌ విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం ఈప్రభుత్వ పిచ్చికి నిదర్శనమన్నారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాయమైందని తాము చెబితే ప్రభుత్వ పెద్దలు బుకాయించారని, ఇప్పుడు థర్మల్‌ విద్యుత్‌కేంద్రాలు మూత పడటానికి కారణమేమిటని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. అనంతరం పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువకులు, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణనిచ్చేందుకు ఎమ్మెల్యే సునీతారెడ్డి సొంత ఖర్చుతో రూపొందించిన ‘సునీతమ్మ ఉద్యోగ మిత్ర’ యాప్‌ను హరీశ్‌రావు ప్రారంభించారు.


కరంటు లేక పొలానికి బీటలు

బోరు బావిలో పుష్కలంగా నీరు ఉన్నా.. కరంటు కోత వల్ల 3 ఎకరాల వరి పొలంలో సగభాగం ఎండిపోయే పరిస్థితి నెలకొందని మహిళా రైతు నాగమణి వాపోయారు. కాగజ్‌మద్దుర్‌లో పార్టీ కార్యక్రమానికి వెళుతున్న హరీశ్‌రావు, సునీతారెడ్డి.. మార్గమధ్యంలో బీటలు వారిన వరి మళ్లను చూసి.. కారు దిగి అక్కడే ఉన్న రైతు నాగమణిని పలకరించారు. పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అవసరమైనా కరంటు సరఫరాలో తీవ్ర అంతరాయంవల్ల ఏం చే యాలో పాలుపోవట్లేదని ఆమె వాపోయారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలనకు ఎండిపోయిన పొలమే సజీవ సాక్ష్యమన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 07:08 AM