Share News

నవ్వుల్లో సీరియస్‌.. బొమ్మల్లో జీనియస్‌

ABN , Publish Date - May 24 , 2026 | 11:32 AM

మేరియో మిరాండా... కార్టూనింగ్‌లో సూపర్‌స్టార్‌. ఈ గొవారియన్‌ గీతల్లో గోవా, బొంబాయి వంటి మహానగరాలు... అక్కడి ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు మెరిసి మురిసిపోయాయి.

నవ్వుల్లో సీరియస్‌.. బొమ్మల్లో జీనియస్‌
Mario Miranda

మేరియో మిరాండా... కార్టూనింగ్‌లో సూపర్‌స్టార్‌. ఈ గొవారియన్‌ గీతల్లో గోవా, బొంబాయి వంటి మహానగరాలు... అక్కడి ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు మెరిసి మురిసిపోయాయి. వ్యంగ్యచిత్రాల సవ్యసాచిగా... ప్రసిద్ధ ‘ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లి’లో అనేక అద్భుతాలను ఆవిష్కరించిన మేజికల్‌ మేరియో శత జయంతి సంవత్సరమిది. ఈ సందర్భంగా వన్‌ అండ్‌ ఓన్లీ మేరియోపై కవర్‌స్టోరీ...

నీలికళ్ల ప్రియురాలు గోవా. విలాసంగా సిగరెట్‌ కాల్చే ఉంగరాల జుత్తు ప్రేమికుడు బొంబాయి. వీళ్లిద్దరూ సముద్రం వొడ్డు తడి ఇసుక మీద ప్రేమపాటలు రాసుకున్నారు. పనాజీ వాళ్లను పిలిచింది. ప్రేమ కవిత్వం వాళ్లతో కలిసి నడిచింది. గోవా నవ్వుకీ, బొంబాయి రాగానికీ పుట్టిన పిల్లవాడి పేరు ‘మేరియో మిరాండా’. ఆర్టిస్ట్‌, కార్టూనిస్ట్‌, తర్వాతెప్పుడో కార్చిచ్చై ప్రపంచాన్ని చుట్టి వచ్చినవాడు. జన హృదయాలని జయించినవాడు. మనవాడు. మన భారతీయుడు.


book5.3.jpgగోవా ఇసుక తిన్నెల మీద నడిచి, బొంబాయి గందరగోళపు వీధుల్లో తిరిగి, ఆనక న్యూయార్క్‌ నగరాన్ని ప్రేమించి, జెరూసలేంలో జీవించి, జపాన్‌లో హిరోషిమా విధ్వంసానికి కలత చెంది... నిండైన కళాకారునిగా అరేబియా మహాసముద్ర కెరటాల మీద చెరగని సంతకం చేసినవాడు.

మేరియో మిరాండా భావుకుడు. ఉద్వేగపరుడు. శాంతమూర్తి. చదువుతో వెలిగిన జ్ఞాని. ఈ జీవితం ఎంత ఇష్టమో, అంత వెక్కిరింత! మెకానికల్‌ రొటీన్‌ అనే రోజువారీ బతుకులోని దరిద్రం అంటే పరిహాసం. ఆ వెటకారమే కార్టూన్లుగా మారి ఈసురోమనే ఈ పాడులోకాన్ని నవ్వించాయి. పిడికెడు ఆకాశాన్నీ, గలగలలాడే గుప్పెడు కెరటాలనీ ప్రసాదించాయి.


చినుకుల వానసీమలో...

2026- ఇది మేరియో శతజయంతి సంవత్సరం. 1926 మే నెల రెండో తేదీన మన కోనసీమలాంటి, పోర్చుగీస్‌ పాలనాకాలంలో డామన్‌లో పుట్టాడు. ‘వీడు తిన్నగా ఉండేవాడు కాద’ని తల్లిదండ్రులు గమనించడానికి ఎంతోకాలం పట్టలేదు. బాల మేరియో చేతికొచ్చిన గీతలు గీస్తున్నాడు. కాగితాలూ, గోడలూ, పుస్తకాల చివరి ఖాళీలూ... అన్నిచోట్లా బొమ్మలే! ‘ఈ నా కొడుకు ఆర్టిస్టు అవుతాడేమోన’ని తండ్రి కలవరపడ్డాడు. తండ్రి ఒక చిన్న ప్రభుత్వ అధికారి. కొడుకు ఐఏఎస్‌లాంటి పెద్ద ఆఫీసర్‌ కావాలని ఆశించాడు. పిచ్చిగీతలే అయినా బొమ్మలు వేయడంలో పిల్లవాడి శ్రద్ధనీ, ఆసక్తినీ తల్లి గమనించింది. ‘కాగితాలూ గోడలూ ఖరాబు చేయకురా వెధవా’ అని తిట్టకుండా, తెల్ల కాగితాల స్కెచ్‌బుక్‌ని వాడికి ప్రెజెంట్‌ చేసింది.


book5.2.jpgఇంకుపెన్ను కూడా ఇచ్చి, ‘ఇక నీ ఇష్టం’ అంది. కాబోయే ఒక పెద్ద ఆర్టిస్టు తల నిమిరి, నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆ తల్లి. కుర్రాడి పూర్తి పేరు మారియో జావో కార్లోస్‌ దో రొసారియో డీ మిరాండా. లౌటోలిమ్‌లో ముందుకు వంగిన పొడవాటి కొబ్బరి చెట్ల ఆకులు ఆడుకుందాం రమ్మని పిలిచాయి మేరియోని. ఆ అందాల గ్రామంలో వీధులు స్నేహగీతాలు పాడాయి. ఆ చెట్ల నీడల్లోనే, ఆ పాటల పూదోటల్లోనే తొలి రేఖాచిత్రాలు ఇచ్చిన ఆనందంలోనే పెరిగాడు. ఆ చిన్నారి గ్రామం, అక్కడి వ్యాపారస్తులు, కొందరి మనుషుల వింత ప్రవర్తన, కాలుతున్న రొట్టెల వాసన, ఊగే చెట్ల మీద నుంచి వీచేగాలీ... జీవితాంతమూ మేరియోతోనే ఉన్నాయి. ఆ కుర్రాడిలోని ఆర్టిస్టుని ఇన్‌స్పైర్‌ చేశాయి. ఒక యువకుడిలోని అశాంతి కళగా మారుతున్న కాలం అది.


లోలోపలి కల్లోల దు:ఖసముద్రపు అట్టడుగు పొరల్లోనే కాంతిని వెతుక్కునే వేళ అది. ‘లైట్‌ ఎట్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది టన్నెల్‌’ అంటారు. అదే! నీలోనే ఒక పద్మజ సూరపరాజు అనే సరస్వతో, సాక్షాత్తూ వాడ్రేవు వీరలక్ష్మీదేవో దాగి ఉండొచ్చు. ఆ తేజస్సులోకి నడవగలగాలి. నిరాశపడీ, అతిగా ఆవేశపడీ, ఆత్మహత్యకు పాల్పడీ... ప్రయోజనం లేదు. ధైర్యం కావాలి. ఆ దశ దాటి రావాలి. నువ్వు బడేగులాం అలీ ఖాన్‌వో, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మివో, ఎం.ఎఫ్‌. హుస్సేన్‌వో, మేరియో మిరాండావో తేలిపోవాలి. హాస్యదృష్టి, వెక్కిరింత, ఈ పిచ్చి బతుకును చూసి నవ్వుకోగల కళాత్మక సాహసం వల్ల మేరియో వ్యంగ్యంలో గురజాడ అప్పారావు, సౌందర్యంలో గుడిపాటి వెంకటచలమూ కాగలిగాడు. ముందుతరాల కోసం ఆధునిక వ్యంగ్యరేఖా చిత్రాల మూగభాషకి వ్యాకరణం రాసి ఉంచాడు.


book5.4.jpgబొంబాయి కదిలించింది...

మేరియో అసలు కథ బెంగుళూరులో మొదలైంది. అక్కడ సెయింట్‌ జోసెఫ్‌ బాయ్స్‌ హైస్కూల్లో చేర్పించారు. పల్లెటూరి సరదాలకి దూరంగా క్రమశిక్షణతో నడిచే బెంగుళూరు బోర్డింగ్‌ స్కూల్లో ఇరుక్కుపోయాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులూ, రకరకాల అలవాట్లూ, సంస్కృతులూ, నాణ్యమైన చదువూ, పరీక్షలూ తప్పనిసరి అయ్యాయి. స్కూలు చదువు ముగించాక బొంబాయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో చేరాడు. హిస్టరీ డిగ్రీ చదువు. కళకే కట్టుబడి ఉండాలని అప్పటికి అనుకోలేదు. అయినా లెక్చరర్లు, మిత్రులు, కొందరు గురువుల బొమ్మలు వేస్తూనే ఉన్నాడు. సున్నితమైన హాస్యంతో, నాజూకు గీతల్తో అందర్నీ ఆకర్షించాడు. తొలి గుర్తింపు అక్కడే.


ఇక కనిపించినదానినల్లా స్కెచ్‌ గీయడం, నవ్వొచ్చేలా కామెంట్‌ రాయడం రోజువారీ పనిగా మారింది. స్నేహితుల మెప్పు, ప్రోత్సాహంతో హాబీగా నడిచిన బొమ్మల సరదా సీరియస్‌ ఆర్ట్‌గా మారింది. నిష్పూచీగా ప్రశాంతంగా ఉండే మనుషుల మధ్య నుంచి వచ్చిన మారియోను గందరగోళంగా ఉండే బొంబాయి కదిలించింది. రద్దీ, బిజీ, ట్రాఫిక్కు, హోటళ్లు, బార్లు, వ్యాపారాలు, ఒకటే పరుగు... ఇవన్నీ హాస్యం చిప్పిల్లే బొమ్మలయ్యాయి. ఆ గీతల్లో ఫ్రెష్‌నెస్‌, కొత్తదనం, నవ్వించే శక్తీ, విరుపూ... తనని అంతర్జాతీయ కార్టూనిస్టుని చేస్తాయని మారియోకి అప్పటికి తెలీనే తెలియదు. కిక్కిరిసి ఉండే బాంబే భేండీ బజార్‌ ప్రతీ ఒక్కరికీ తెలుసు. అక్కడ గీసి గీసి బేరాలాడుతున్న కుటుంబాన్ని చచ్చేంత నవ్వొచ్చేలా మేరియో కార్టూన్‌గా వేశారు. ‘బార్‌గైనింగ్‌ ఎట్‌ భేండీ బజార్‌’ బొమ్మ సూపర్‌ హిట్‌ అయ్యింది.


ఇండియాలో రోజువారీ ప్రయాణం అనేది ఎంత నరకమో... గతుకుల్లో ఎగిరిపడుతోన్న బస్సులోంచి జారిపడుతున్న జనాన్ని చిన్న అతిశయోక్తి జోడించి వేసిన నలుపుతెలుపు బొమ్మ- ఒక విజువల్‌ ఎమోషనల్‌తో మనల్ని నవ్విస్తుంది. అలాంటి అనేక కార్టూన్లు, ఇల్లస్ట్రేషన్లు భారతీయ కళా సంప్రదాయంలో ఒక భాగం అయ్యాయి. రోజువారీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలూ, అల్పత్వమూ, కొందరి వికారపు ప్రవర్తన మేరియో చేతిలో అపురూపమైన రేఖాచిత్రాలై జీవకళతో వెలిగాయి. మనం విస్మరించే అతిచిన్న అంశాలనూ గీతల్లో పలికించడం, దానికి హాస్యం జోడించడం, వ్యక్తిగతం నుంచి సామాజిక చిత్రణవైపునకు సాగడంలో మేరియో కళాకౌశలం చూసి తీరాలి. ఆ శైలీ, వొయ్యారపు గీతల్లోని అభివ్యక్తీకరణ ఎంతో ప్రత్యేకమైనవి.


నగర జీవితానికి కొత్తకోణం...

మనకు స్వాతంత్య్రం వచ్చేసరికి మేరియోకి 21 ఏళ్లు. చదువు పూర్తయ్యింది. ఇప్పుడేం చేయాలి? అప్పటి యువకులందరి డైలమా అది. ‘లింటాస్‌’ అనే ప్రసిద్ధ యాడ్‌ ఏజెన్సీలో చేరాడు మేరియో. వాణిజ్య ప్రకటనలు, పౌడర్‌ రాసుకోవాలి, మా సబ్బుతోనే రుద్దుకోవాలి, మా కాటుకనే దిద్దుకోవాలి... వంటి కార్పోరేట్‌ ప్రమోషన్లకు పాల్పడాల్సిన ఉద్యోగం అది. అయినా తన సృజనాత్మక కళని వదులుకోకుండా, టీ అమ్మేవాడూ, పక్కటేబుల్‌ ఉద్యోగి, బాస్‌, ఆయన సెక్రెటరీ... ఇలా సొంత బొమ్మలు, కేరికేచర్లు వేస్తూనే ఉన్నాడు. ఓన్లీ విమల్‌, అమూల్‌ ది టేస్ట్‌ ఆఫ్‌ ఇండియా, లిరిల్‌ సబ్బు వాడకపోతే మీరసలు మనుషులే కాదు... ఇలాంటి స్లోగన్స్‌ని పాపులర్‌ చేస్తుంటాయి యాడ్‌ ఏజెన్సీలు.


book5.8.jpgజలపాతం కింద ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి స్నానం చేస్తూ, లా... లాలాలలా అని పాడుతూ, జీవనోత్సవాన్ని లిరిల్‌తో సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్రచారం చేసిన పాపులర్‌ యాడ్‌ఫిల్మ్‌ గుర్తుందా? అప్పట్లో దాన్ని ఎంతో కష్టపడి తీసింది లింటాస్‌వాళ్లే. కమర్షియల్‌ ప్రమోషన్లు మేరియో పని కానప్పటికీ, ఆ అనుభవం ఉపయోగపడింది. తెల్ల కాగితమ్మీద బొమ్మ కంపోజిషన్‌, అనగా అందంగా అమర్చడం, విషయాన్ని సింపుల్‌గా, సూటిగా చెప్పడం, మరింత లాఘవంగా గీత గీయడం మారియోకి పట్టుబడింది. ఎట్టకేలకు ఎదురుచూసిన బంగారం లాంటి అవకాశం ఎదురొచ్చింది. ప్రతిష్టాత్మకమైన పత్రిక ‘ఇలస్ట్రేటేడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’, ప్రసిద్ధ దినపత్రిక ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ మేరియో కార్టూన్లు ప్రచురించడం మొదలైంది. సంప్రదాయ రాజకీయ కార్టూన్లకి పూర్తి విరుద్ధంగా నగర జీవితాన్నీ, జీవన సంఘర్షణనీ ఒక కొత్తకోణం నుంచి చూడటం, పదునైన వ్యంగ్యాన్ని ఆయుధంగా వాడటం అందరికీ నచ్చింది. పేరు దానంతట అదే పరుగెత్తుకుంటూ వచ్చింది.


సొంత ఒరిజినల్‌ రేఖ...

మేరియో సృష్టించిన మిస్‌ఫోన్సెకాని ఆర్ట్‌లవర్స్‌ అంతా ఇష్టపడతారు. నల్లచుక్కల గౌను వేసుకునే ఫోన్సెకా ఆధునిక వర్కింగ్‌వుమన్‌. సరదాగా, ఈజీగా, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆఫీసులో ఆమె బాస్‌ ఇంత పొట్టేసుకుని, పెద్ద కోటుతో ఉద్యోగుల్ని మందలిస్తూ, పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. సహజమైన రోజువారీ జోకులా, చమత్కారాలతో మేజికల్‌ మేరియో కార్టూన్లు వీళ్లని పాపులర్‌ స్టార్లని చేశాయి. నిజజీవిత సంఘటనల్నీ, సంఘర్షణల్నీ నవ్వించే కథలుగా, డాక్యుమెంటరీలుగా ఆయన రికార్డు చేశాడు. హాస్యమూ, వెటకారమూ అంటే వెవ్వెవ్వే అని వెక్కిరించడం మాత్రమే కాదు. సమాజంలో ఆ దుస్థితిని ఎక్స్‌పోజ్‌ చేయడం, ప్రొటెస్ట్‌ చేయడం కూడా. ఆర్టిస్టు తన కోపాన్నీ, నిరసననీ లైటర్‌వీన్‌లో ఘాటుగా చెప్పడం. చార్లీచాప్లిన్‌ చేసిన పని అదే. వెక్కిరించడం అంటే ఈ అష్టావక్ర సమాజాన్ని చాచికొట్టడమే.


book5.9.jpgడబ్బూ, సెక్సూ మనకి తేలిగ్గా అర్థం అవుతాయి. పచ్చి వ్యాపారసినిమాలకీ, క్రికెట్‌లాంటి వేలంవెర్రి ఆటలకీ ఈజీగా కనెక్ట్‌ అయిపోగలం. కానీ, సురయా, నూర్జహాన్‌ పాటలు వినడానికీ, మెహదీహసన్‌ గజల్‌ని ఎంజాయ్‌ చేయడానికీ, అబూ అబ్రహాం కార్టూన్‌ని, విన్సెంట్‌ వాంగో సన్‌ఫ్లవర్స్‌నీ, స్టారీ నైట్స్‌నీ అర్థం చేసుకోవడానికి మనకి కొంత శిక్షణ కావాలి. భానుమతో, ఎస్‌.వరలక్ష్మో పాడుతున్నప్పుడు ఆ రాగం ఏమిటో తెలిస్తే శ్రోత ఆనందం రెట్టింపవుతుంది. అసలు తగినంత అక్షరాస్యతే లేని దేశంలో విజువల్‌ లిటరసీ ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. అంచేత అమితాబ్‌బచ్చనో, షారుక్‌ఖానో తెలిసినంతగా మేరియో మిరాండా తెలియకపోవడం ఆశ్చర్యమేమీ కాదు. ఉన్నతమైన కళా, సీరియస్‌ సాహిత్యమూ పామర జనానికి సంబంధించినది కాదుగనక, ఒక సాదత్‌ హసన్‌ మంటో, ప్రేమ్‌చంద్‌, పెయింటర్‌ ఫ్రాన్సిస్‌ న్యూటన్‌ సౌజా, మేరియో కోట్లాదిమందికి తెలియదే అని కన్నీళ్లు పెట్టుకోనవసరం లేదు. ఒక గోరటి వెంకన్న జానపద పాట జనాన్ని వెర్రెత్తించి ఉర్రూతలూగించగలదు. ఈ సమాజాన్ని హేళన చేస్తూ వేసిన ఒక శక్తివంతమైన కార్టూన్‌- అబ్బ నీ తియ్యనీ దెబ్బ పాటంత బంపర్‌హిట్‌ ఎన్నటికీ కాలేదు.


‘‘నేనెప్పుడూ ఖాళీ బుర్రతో బొమ్మ వేయడానికి కూర్చోను. రోజువారీ బతుకులోని గందరగోళం, రద్దీగా ఉండే వీధులూ, మనుషుల తిక్కవేషాలూ, అతి సాధారణమైన విషయాల్లో దాగివుండే హాస్యం నుంచే నా బొమ్మలు పుడతాయి’’ అన్నారు మేరియో. ప్రపంచమంతా తెలిసిన గోవా వాగ్గేయకారుడు రెమో ఫెర్నాండేజ్‌ పాటలు మర్చిపోలేదుగా. సముద్ర కెరటాల్లా ఎగసిపడే అతని పాటల్లాగే మేరియో ఒక సొంత ఒరిజినల్‌ రేఖ. మామూలు గీత కాదది. అచ్చంగా భగవద్గీత. మేరియోకి పద్మశ్రీ ఇచ్చినా, కొన్నేళ్ల తర్వాత పద్మభూషణ్‌ ఇచ్చి గౌరవించినా ఆయన మన జాతి సంపద అనే ఆపేక్షతోనే. గోవా బీచ్‌లూ, బొంబాయి భవంతులూ, రెస్టారెంట్లలో, బార్‌లలో మనుషుల ప్రవర్తనా మేరియో గీతలో ఎంత సహజసుందరంగా వెలిగిపోతాయో! సీరియస్‌ కార్టూన్‌ వేయడంలో ఆరితేరిన ఈ జీనియస్‌ కళకి సంబంధించి ఏ కోర్సూ చదువుకోలేదు. అనేకమంది ప్రఖ్యాత రచయితలూ, సంపాదకులూ రాసిన పుస్తకాలకు అర్థవంతమైన బొమ్మలు వేశారు.


మనోహర్‌ మాల్గాంకర్‌ రాసిన ‘ఇన్‌సైడ్‌ గోవా’, డామ్‌ మొరేస్‌ రాసిన ‘ఏ ఫ్యామిలీ ఇన్‌ గోవా’, ‘ది వోషెన్‌ ఐస్‌’ పుస్తకాలు చెప్పుకోదగ్గవి. మేరియో మిరాండా సొంత పుస్తకాలు గోవా విత్‌ లవ్‌, ఎ లిటిల్‌ వరల్డ్‌ ఆఫ్‌ హ్యూమర్‌, స్కెచ్‌బుక్‌, జర్మనీ ఇన్‌ వింటర్‌టైమ్‌, ఇంప్రెషన్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మారియో ది మిరాండా... కొని, దాచుకోదగ్గ అమూల్యమైన కళాత్మకమైన నిధినిక్షేపాలు. రాబోయే తరాలు అధ్యయనం చేయాల్సిన ఆర్ట్‌ సిలబస్‌ పుస్తకాలు. ఎన్నో దేశాలు మేరియోను పిలిచి గౌరవించాయి. ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు పెట్టించి గ్రేట్‌ ఇండియన్‌ ఆర్ట్‌ని సెలబ్రేట్‌ చేశాయి. అమెరికా, జపాన్‌, జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో ఆయన బొమ్మల్ని ఎగబడి చూశారు. అచ్చమైన భారతీయ ఆత్మావిష్కరణని చూసి మురిసిపోయారు. ఒక్కసారి మేరియోకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడమే గొప్ప గౌరవంగా భావించారు.


book5.10.jpgసహచరి హైదరాబాదీ...

మేరియో చాలా స్టయిల్‌గా ఉంటారు. నిండైన విగ్రహం. సంస్కారానికి ప్రాణం పోసినట్టు ఉంటారు. రేమండ్స్‌ దుస్తుల ప్రకటనలకి మోడల్‌గా ఉన్నారు. మేరియో మిరాండా మనోహరమైన చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించి, షేక్‌హ్యాండ్‌ ఇచ్చినపుడు తట్టుకోలేని ఆనందంతో తలకిందులైపోయామని మన కార్టూనిస్ట్‌ మోహన్‌, ఇతర ఆర్టిస్టులూ నాతో చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం ‘కర్ణాటక కార్టూనిస్టుల సంఘం’ మేరియో, యేసుదాసన్‌, బాపు, గోపులు గారికి జీవిత సాఫల్య పురస్కారాలు ఇచ్చి గౌరవించింది.


ఆ సభకు తెలుగు కార్టూనిస్టుల్ని పిలిచారు. దళనాయకుడు మోహన్‌తో జయదేవ్‌, సుభాని, శేఖర్‌, శంకర్‌, మృత్యుంజయ, అన్వర్‌, శ్యాంమోహన్‌, రాజు మరికొందరు వెళ్లారు. సూపర్‌హీరో మారియోతో గడిపిన సమయాన్ని, చెప్పుకున్న కబుర్లనీ వ్యాసాలుగా రాశారు. ‘గోవా సముద్రతీరం నుంచి మెరిసే బొమ్మల ముత్యాలు తెచ్చిన మారియోకి నా మూసీ మురికిగవ్వల బొమ్మలు చూపించడానికి సిగ్గుపడ్డాను’ అని కార్టూనిస్ట్‌ మృత్యుంజయ ఒక వ్యాసంలో రాశారు. తోటి ఆర్టిస్టుల నుంచి అంత ప్రేమనీ, గౌరవాన్నీ పొందిన లెజెండరీ కార్టూనిస్ట్‌ మేరియో.


ఆయన భార్య హబీబా మన హైదరాబాద్‌ అమ్మాయే. మేరియోకి రిషాద్‌, రావుల్‌ అనే ఇద్దరు కొడుకులున్నారు. 2011 డిసెంబర్‌ 11న ఆ మహా కళాకారుడు మనల్ని వొదిలి వెళిపోయాడు. కాగితాల మీద ఎన్నటికీ చెరిగిపోని గీతల్నీ, గోవా జానపద గీతాల్నీ తలుచుకుంటే చాలు నవ్వొచ్చే హాస్యాన్నీ, సముద్ర కెరటాల మీద కదిలే కలల్నీ, మెరిసే వెన్నెల్నీ ఒక అనుపమానమైన కళా సంప్రదాయాన్ని మనకి మిగిల్చి వెళ్లిపోయాడు. తిరిగి వస్తాడేమోనని గోవా దిగులు కళ్లతో ఎదురుచూస్తోంది. మేరియో... నీ గోవాకు ఒకసారి రావా...!


గ్లోరీ టు గోవా

మేరియో మిరాండాకు గోవా అంటే టూరిజం కాదు. ఒక సూర్యాస్తమయపు కాంతి. చర్చి, పాస్టర్లు, గుంపులుగా జనం, చేపల మార్కెట్లు, టీ కోట్లు, నడిచివెళ్లే పడుచు పిల్లలు... అందులోనే జీవన సంగీతాన్ని వినగలడు. సామాన్యుడే కవిత్వం అని తెలుసుకోగలిగాడు. కొందరు కార్టూనిస్టుల్లా కోప్పడిపోలేదు. ఆగ్రహంతో ఊగిపోలేదు. మనుషుల దినచర్యని ఒక చరిత్రకారుడిలా బొమ్మల్లో రికార్డు చేశాడు. కరుణతో, మానవీయతతో నిండిన ఆ గీతల్లో మాండొలిన్‌ రాగాల్ని పలికించాడు. కళ ఎందుకు? కళ దేనికి? క్షుణ్ణంగా తెలిసివాడు. ఒక గాఢమైన తాత్విక భూమిక గల పరిపూర్ణమైన కళాకారుడు. నిశ్చింతంగా బతికిన అలనాటి పురాతన గోవాకి మన కోసం గోల్డెన్‌ గేట్స్‌ తెరిచినవాడాయన. బ్లోఅప్‌ చేసిన మారియో బొమ్మల్ని కుడ్యచిత్రాలు (మ్యూరల్స్‌)గా గోవా, బొంబాయి హోటళ్లలో, అక్కడి కొత్త విమానాశ్రయంలో గొప్పగా అలంకరించారు. గోవా, బొంబాయి సజీవ సంస్కృతిని మనకి కానుకగా ఇచ్చినవాడు. పనిలో పనిగా ప్రపంచఖ్యాతి తెచ్చినవాడు మేరియో!


మేరియో ఆర్ట్‌ ఫర్‌ సేల్‌

‘అరె భలే ఫన్నీగా ఉందే’ అనుకుంటూ గీతల్లోనే హాస్యరసం వొలికించిన మేరియో డబ్బు సంపాదన కోసం తాపత్రయపడలేదు. ‘మేరియో నిన్ను మార్కెట్‌ చేస్తా’ అన్నాడో మిత్రుడు. కళ్లు చెదిరే బొమ్మల్తో మేరియో ఆర్ట్‌ గ్యాలరీ ప్రారంభించాడు. కార్టూన్లు, ఇల్లస్ట్రేషన్లు, రంగుల నీటి చిత్రాలు... అన్నీ అందంగా ఫ్రేములు కట్టి అమ్ముతున్నాడు. తెల్లని టీ కప్పుల మీద, ప్లేట్ల మీద, టీషర్టుల మీద, చిన్నారి ఫ్రేముల్లో ఊరించే బొమ్మలు రంగుల్లో, నలుపు తెలుపుల్లో... ఒక జీవితకాలం దాచుకోదగ్గ జీవన చిత్రాలు. వాటి అమ్మకాల ద్వారా వచ్చిన కొంత మారియో కుటుంబానికి వెళుతుంది. వాటిని కొన్నవారికి మెమొరీస్‌ ఫరెవర్‌.


గుంపులు గుంపులుగా..

కిక్కిరిసిన బొంబాయి రైళ్లు, జనం వేలాడుతూ వెళ్లే ఎర్రబస్సులు, ఇరానీ చాయ్‌ కేఫ్‌లలో గుంపులు, కిటకిటలాడే మార్కెట్లూ... ఇలాంటి దృశ్యాలంటే మేరియోకి వెర్రి. పూనకం. ఒక భావోద్వేగంతో ఊగిపోతాడు. ఒక్క బొమ్మలోనే యాభై, అరవై మంది మనుషుల్ని వేస్తాడు. ప్రతీ ఒక్కరికీ ఒక ఎక్స్‌ప్రెషన్‌, మొహాల్లో ఆందోళన, బెరుకు, ఆనందం, విసుగు, ఆశ్చర్యం... ఎంత పొందిగ్గా వేస్తాడో చెప్పలేం. వాళ్లందరినీ ఒకే ఒక్క ఫ్రేములో నేర్పుగా, లాఘవంగా అమర్చడంలో సూపర్‌ స్పెషలిస్ట్‌ మేరియో. అద్భుతమైన పరిశీలన, నిశితమైన స్టడీ, ప్రతీ చిన్న డీటైల్‌నీ పట్టుకోవడం, భక్తిగా... నిబద్ధతతో ప్రాణం పెట్టి బొమ్మ వేయడం... దాని కోసమే పుట్టడేమో మేరియో. ది గ్లాస్‌ విండోస్‌ అనే కలర్‌ బొమ్మ చూడండి. మూర్ఛపోయేంత బ్యూటీ. జీన్‌పాల్‌ సాత్రే, మిత్రులూ కాఫీ తాగి కబుర్లు కొట్టిన కెఫే డి ఫ్లోర్‌... రోడ్డు పక్కన రెస్టారెంట్‌... ఆ బొమ్మ చూడాలి. ఈ బతుకు ధన్యమవ్వాలంటే!

- తాడి ప్రకాశ్‌, 97045 41559


ఈ వార్తలు కూడా చదవండి:

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 11:39 AM