Share News

పారిశ్రామిక విప్లవానికి పునాది

ABN , Publish Date - May 24 , 2026 | 05:40 AM

‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు) రంగంలో భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధమైంది.

పారిశ్రామిక విప్లవానికి పునాది

  • రేపు విజయవాడలో ‘ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌’

  • లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధం

  • ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్లతో అనుసంధానం కల్పించడమే లక్ష్యం

  • రూ.200 కోట్లతో పారిశ్రామిక కస్టర్ల అభివృద్ధికి శ్రీకారం

  • 38 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన

  • మెటా, అమెజాన్‌ తదితర దిగ్గజ సంస్థలతో ఎంవోయూలు

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు) రంగంలో భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధమైంది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్లతో అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ‘ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌-2026’ను నిర్వహిస్తోంది. విజయవాడలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కళావేదికలో నిర్వహించనున్న ఈ రాష్ట్రస్థాయి సదస్సును సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10.45 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంఎస్ఎంఈ రంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, మార్కెట్‌ అవకాశాలు, పెట్టుబడులను సమీకరించే దిశగా మెటా, అమెజాన్‌, జోహో తదితర అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఏపీ క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా రూ.200 కోట్లతో రాష్ట్రంలో 45 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేయనున్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ విస్తరణ కార్యక్రమంలో భాగంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురంలలో ‘రూట్యాగ్‌ స్మార్ట్‌ విలేజ్‌ సెంటర్‌ (ఆర్‌ఎస్‌వీసీ) విస్తరణ కేంద్రాలను సీఎం ప్రారంభిస్తారు. కియా ఇండియా భాగస్వామ్యంతో ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ స్టార్ట్‌పల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక ప్రోటో టైపింగ్‌ సెంటర్‌ ప్రత్యేక వీడియోను కూడా ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం తర్వాత జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక సాంకేతిక చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. పారిశామ్రిక సంఘాలతో ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రత్యేక రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు.


అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో ఎంవోయూలు

రాష్ట్రానికి చెందిన 10వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులను అంతర్జాతీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌తో అనుసంధానం చేస్తూ అమెజాన్‌ సంస్థతో ఎంవోయూ చేసుకోనున్నారు. ‘ఏపీ ఎంఎస్ఎంఈ వన్‌’ పోర్టల్‌ ద్వారా అర్హత ఉన్న పరిశ్రమలకు వ్యాపార సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు రూ. 50 వేల విలువైన వాలెట్‌ క్రెడిట్లను అందించేందుకు జోహో కార్పొరేషన్‌తో ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఒడాఫోన్‌ ఐడియా బిజినెస్‌- సీఐఐ- నీతి ఆయోగ్‌ల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష పరిశ్రమలకు ఉచిత ‘డిజిటల్‌ మెచ్యూరిటీ అసె్‌సమెంట్‌’ చేపట్టనున్నారు. డీప్‌-టెక్‌ స్టార్ట్‌పలకు ఆర్థిక సహకారం అందించేందుకు రూ.20 కోట్లతో ఏర్పాటుచేసిన ప్రత్యేక సీడ్‌ ఫండ్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆరామెక్స్‌ (లాజిస్టిక్స్‌), క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (జడ్‌ఈడీ సర్టిఫికేషన్‌), పీఎఫ్ఆర్‌డీఏ (నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌), ఈఈఎస్ఎల్‌ (వాటర్‌ అండ్‌ ఎనర్జీ ఆడిట్లు) సంస్థలతో ఒప్పందాలు కుదరనున్నాయి.


నాలుగు ‘లైఫ్‌ యాక్షన్‌ ఎగ్జిమిషన్‌ జోన్లు’

సదస్సు ప్రాంగణంలో 4 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు.

జోన్‌-ఏ (రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌): స్టార్టప్‌ క్లినిక్‌, ఏఐ అండ్‌ ఎంఎల్‌ ప్రదర్శనలు, మెడ్‌టెక్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, లైవ్‌ స్టార్టప్‌ డెమోలు.

జోన్‌-బీ(ఎంఎస్‌ఎంఈ డెవల్‌పమెంట్‌ ఎకోసిస్టమ్‌): ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వివరాలు, ఓడీవోపీ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు.

జోన్‌-సీ(పార్ట్‌నర్‌ ఫెసిలిటీ డెస్క్‌): ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌, గ్లోబల్‌ సెల్లింగ్‌ ఆన్‌ బోర్డింగ్‌, క్వాలిటీ సర్టిఫికేషన్‌ నమోదు, స్పాట్‌ సర్వీసులు

జోన్‌-డీ(బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ డెస్క్‌): వివిధ బ్యాంకుల ప్రతినిధులు స్టాళ్లలో అందుబాటులో ఉండి, రుణ ప్రక్రియను అక్కడికక్కడే ప్రారంభిస్తారు.

Updated Date - May 24 , 2026 | 05:47 AM