Share News

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

ABN , Publish Date - May 23 , 2026 | 09:10 PM

పిట్ బుల్ జాతి కుక్కల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెండు పిట్ బుల్స్ ఆ మహిళను అతి దారుణంగా కొరికి చంపేశాయి. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..
Florida dog attack

న్యూయార్క్, మే 23: పిట్ బుల్ జాతి కుక్కల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెండు పిట్ బుల్స్ ఆ మహిళను అతి దారుణంగా కొరికి చంపేశాయి. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఫ్లోరిడాకు చెందిన 50 ఏళ్ల జోడీ కోవాన్.. బ్రేవర్డ్ కౌంటీలో నివాసం ఉంటోంది. జోడీ పొరిగింటిలో ఉండే వారు రెండు బలమైన పిట్ బుల్ జాతి కుక్కలను పెంచుకుంటున్నారు. ఆ పిట్ బుల్స్ ఎప్పుడూ చాలా ఆవేశంగా ఉండేవి. ఆ వీధిలో విచ్చలవిడిగా తిరిగేవి. ఆ కుక్కలను వీధిలో వదలొద్దని జోడీ కుటుంబసభ్యులు వాటి యజమానులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.


వారు ఫిర్యాదులను పట్టించుకోలేదు. మంగళవారం జోడీ తన చిన్న పెంపుడు కుక్కతో బయటకు వెళ్లింది. రోడ్డుపైకి రాగానే పిట్ బుల్స్ జోడీ పెంపుడు కుక్కపై దాడి చేయటం మొదలెట్టాయి. జోడీ వాటి నుంచి తన పెంపుడు కుక్కను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కుక్కలు జోడీ మీద దాడి చేయటం మొదలెట్టాయి. విచక్షణా రహితంగా కొరకసాగాయి. జోడీ చావు కేకలు పెట్టసాగింది. ఆ అరుపులు విన్న జోడీ భర్త స్మిత్ బయటకు వచ్చాడు. స్మిత్ బయటకు వచ్చే సమయానికి కుక్కలు జోడీ నుంచి దూరంగా వెళ్లి.. అటు, ఇటు తిరగసాగాయి.


స్మిత్ వాటిని మరింత దూరంగా తరిమికొట్టాడు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. తీవ్రంగా గాయపడ్డ జోడీని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాల కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ రెండు కుక్కలను అనిమల్ కంట్రోల్ ఆఫీసర్లు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు.


ఇవి కూడా చదవండి

రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

అప్పుడు హార్దిక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు: ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె

Updated Date - May 23 , 2026 | 09:19 PM