కంట్లో కారం కొట్టి... బ్యాంక్ సొమ్ము దోచేసి.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:47 PM
బ్యాంక్ సిబ్బంది కంట్లో కారం కొట్టి.. ఓ వ్యక్తి కౌంటర్‌లో నగదును దోచేశాడు. అయితే సిబ్బంది అతణ్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: దొంగల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ దొంగ కారం సాయంతో బ్యాంక్ నుంచి నాలుగున్నర లక్షల రూపాయలు దోచేశాడు. మహారాష్ట్రలోని నాగపూర్ వద్ద ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జరిగిందీ ఘటన.
సూరజ్ అనే ఓ వ్యక్తి ఎలాగైనా బ్యాంక్ లూటీ చేయాలని పక్కాగా ప్లాన్ వేశాడు. ఇందుకోసం అవసరమైన సామగ్రినంతా కొనుగోలు చేశాడు. ముఖానికి మాస్కు.. దాడి చేయడానికి కారం లాంటివి అందులో ఉన్నాయి. చోరీ సాఫీగా జరగడం కోసం జనాల రద్దీ లేని సమయాన్ని గుర్తించాడు. ఆ తరువాత తన ప్రణాళిక ప్రకారం.. అనువైన సమయంలో ఒక్కసారిగా బ్యాంకులోకి చొరబడ్డాడు. చేతిగుప్పిళ్లతో కారాన్ని తీసుకుని బ్యాంక్ సిబ్బంది కంట్లో కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో సిబ్బంది బ్యాంకు లోపలే ఒకచోట నుంచి మరోచోటకు పరుగులు పెట్టారు. అతడు వెంటవెంటనే కారంతో దాడి చేస్తూ.. కౌంటర్‌లో ఉన్న నాలుగున్నర లక్షల రూపాయలను కాజేశాడు. ఆపై బయటకు పారిపోయాడు. అయితే సిబ్బంది అతణ్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ వ్యక్తి ‘సెక్యురిటీ గార్డ్స్ భోజనానికి వెళ్లినట్టు ఉన్నారు’ అని సరదాగా స్పందించారు.
ఇవి కూడా చదవండి:
వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తి నగదు దోపిడి.. వీడియో వైరల్
బంగారం షాపులో యువతి చోరీ.. నగల బాక్స్‌తో పరుగో పరుగు..