ఆ కాలనీలో.. ఇంటికో విమానం!
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:24 AM
ఉదయం మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తేనో, లేదంటే ఆఫీసుకు వెళుతుంటేనే టూవీలరో, కారో బయటికి తీస్తారు. కానీ ఫ్లోరిడాలోని ‘స్పూస్‌క్రీక్’ కాలనీలో మాత్రం ఛార్టర్డ్ ఫ్లైట్ తీస్తారు.
ఉదయం మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తేనో, లేదంటే ఆఫీసుకు వెళుతుంటేనే టూవీలరో, కారో బయటికి తీస్తారు. కానీ ఫ్లోరిడాలోని ‘స్పూస్‌క్రీక్’ కాలనీలో మాత్రం ఛార్టర్డ్ ఫ్లైట్ తీస్తారు. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఆశ్చర్యంగా విమానాలు వేసుకెళ్లి టిఫిన్ చేసి వస్తారు. మనదగ్గర ఇంటికో టూవీలర్ ఉన్నట్టుగానే అక్కడ ఇంటికో విమానం గ్యారేజ్‌లో పార్కు చేసి ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే ప్రత్యేకమైన కాలనీగా గుర్తింపు పొందింది.
ఇంటి ముందు కారుంటే గర్వంగా ఫీలవుతారు చాలామంది. అలాగే ఇంటి ముందు విమానం నిలిపి ఉంటే... ఆ డాబును వర్ణించలేం. అయుతే స్పూస్‌క్రీక్ కాలనీవాసులు మాత్రం ఇంటి ముందు విమానం ఉన్నా అది సాధారణ విషయం అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే ఆ కాలనీలో ఇంటికో విమానం ఉంటుంది. అందుకే ఈ కాలనీని ‘రెసిడెన్షియల్ ఎయిర్‌పార్క్’ అని పిలుస్తారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో డెటోనా బీచ్‌కు సమీపంలో ఉంటుందీ కాలనీ. ఈ కాలనీ వాసుల కోసం ప్రత్యేకంగా రన్‌వే కూడా ఉండటం విశేషం.
పైలట్ శిక్షణ కేంద్రం కాలనీగా....
రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఈ కాలనీలో రన్‌వే నిర్మించారు. యుద్ధం ముగిసిన తరువాత చాలా కాలం పాటు రన్‌వే నిరుపయోగంగా ఉంది. కొంతకాలానికి ఐదుగురు వ్యాపారవేత్తలు కలిసి ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేశారు. శిక్షణ పొందిన పైలట్లు ఉండటం, చాలా రన్‌వేలు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం సైతం ఎయిర్‌పార్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా స్పూస్‌క్రీక్ ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో అరిజోనా, కొలరాడో, ఫ్లోరిడా, టెక్సాస్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఎయిర్‌పార్క్‌లు ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా 600 ఫ్లై ఇన్ కమ్యూనిటీలు ఉన్నట్టు అంచనా. అందులో అతి పెద్దది స్పూస్‌క్రీక్ కమ్యూనిటీ. ఇక్కడ రోడ్లపై కార్లతో పాటు విమానాలు కూడా పరుగెడుతుంటాయి.
ఈ కాలనీలో 1300 ఇళ్లు ఉన్నాయి. సుమారు 5వేల మంది నివసిస్తున్నారు. 700కు పైగా చార్టర్డ్ విమానాలున్నాయి. సాధారణ కాలనీల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా టెన్నిస్‌కోర్డులు, స్విమ్మింగ్‌పూల్స్, క్లబ్‌లు, పిల్లల ఆటస్థలాలు, గోల్ఫ్‌కోర్స్‌లున్నాయి. ప్రతీ వారం విమాన యజమానులందరూ కలిసి చిన్న చిన్న ఫ్లైఅవుట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించుకుంటారు. చాలాదేశాల్లో చాలామందికి విమానప్రయాణం ఇప్పటికీ అందుబాటులో లేదు. కానీ స్పూస్‌క్రీక్ కాలనీలో మాత్రం విమానం రోజువారి ప్రయాణ వాహనంగా మారింది.
ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేరుగా విమానాన్ని రన్‌వేపైకి తీసుకెళ్లి రయ్‌న ఎగిరి పోతుంటారు. విమానాలు ఎగిరేందుకు అవసరమైన నావిగేషన్ వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. ఈ కాలనీలో నివసించే వారిలో చాలా మంది ప్రొఫెషనల్ పైలట్లున్నారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలున్నారు. ప్రతీ శనివారంఉదయం వారంతా తమ విమానాలతో బృందాలుగా పొరుగు ప్రాంతాలకు వెళ్లి టిఫిన్ చేసి వస్తారు. ఇంటికో విమానం ఉన్న ఈ కాలనీని చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి
కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?
Read Latest AP News And Telangana News And International News And Telugu News