Share News

ఫిఫా చరిత్రలో తొలిసారి... ప్రపంచ కప్ విజేతలకు స్పెషల్ రింగ్స్

ABN , Publish Date - Jul 19 , 2026 | 08:30 AM

ఫిఫా పుట్‌బాల్ ప్రపంచకప్ 2026​ విషయంలో నిర్వాహకులు తొలి నుంచే వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఆటగాళ్లకు ఓ సర్​ప్రైజ్ ఇవ్వనుంది. ఫైనల్​లో విజేతగా నిలిచిన జట్టుకు టైటిల్‌తో పాటుగా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఛాంపియన్ ఉంగరాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఫిఫా చరిత్రలో తొలిసారి... ప్రపంచ కప్ విజేతలకు స్పెషల్ రింగ్స్
FIFA World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ మహాసంగ్రామం ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త హంగులతో సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. ఈసారి ప్రపంచకప్ విజేతగా నిలిచే జట్టుకు ఫిఫా చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ప్రత్యేక బహుమతిని అందించనున్నారు. అమెరికన్ క్రీడల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఛాంపియన్‌షిప్ రింగ్స్' (ఉంగరాలు) అందించే సాంప్రదాయాన్ని ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లోకి తీసుకువస్తున్నారు.


అమెరికాలోని ప్రసిద్ధ లీగ్‌లైన ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL), ఎన్‌బీఏ (NBA), మేజర్ లీగ్ బేస్‌బాల్ (MLB), ఎన్‌హెచ్‌ఎల్ (NHL) లలో విజేతలకు ఇలాంటి ప్రత్యేక ఉంగరాలను అందించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు అదే సంస్కృతిని ఫుట్‌బాల్ వేదికపై కూడా పరిచయం చేస్తున్నారు ఫిఫా నిర్వాహకులు. ఫిఫా ప్రపంచ కప్-2026కు గుర్తుగా 2,026 ఉంగరాలను మాత్రమే తయారు చేయించారు. ఈ ఉంగరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇందులో 30 ఉంగరాలను విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు, కోచింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా కేటాయిస్తారు.


మిగిలిన 1,996 ఉంగరాలను అధికారిక లైసెన్స్డ్ ఉత్పత్తులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కోసం అందుబాటులో ఉంచుతారు. అయితే దీని ధర మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేక నంబర్, ధ్రువీకరణ పత్రం (Certificate of Authenticity) ఉంటాయి. ఉంగరానికి ఒకవైపు ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ ముద్రించి ఉండగా, మరోవైపు విజేత జట్టు వివరాలను అందంగా పొందుపరుస్తారు. ఇవాళ(ఆదివారం) జరిగే ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే, ప్రాథమికంగా విజేత జట్టు కెప్టెన్‌కు, ప్రధాన కోచ్‌కు తాత్కాలిక ఉంగరాలను అందజేస్తారు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలి కొలతలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ముస్తాబు చేసిన 30 ఉంగరాలను ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా బహూకరిస్తారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం

ఫైనల్‌ కిక్‌

Updated Date - Jul 19 , 2026 | 11:06 AM