Share News

ఫైనల్‌ కిక్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:40 AM

మెస్సీ, యామల్‌పైనే అందరి దృష్టి అటు పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న స్పెయిన్‌.. ఇటు లేటు గోల్స్‌తో అనూహ్య విజయాలతో సవాల్‌ విసురుతున్న...

ఫైనల్‌  కిక్‌

రాత్రి 12.30 నుంచి

యునైటెడ్‌ 8లో

నేడే ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌ పోరు

డిఫెన్సివ్‌ స్పెయిన్‌తో అటాకింగ్‌ అర్జెంటీనా ఢీ

మెస్సీ, యామల్‌పైనే అందరి దృష్టి అటు పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న స్పెయిన్‌.. ఇటు లేటు గోల్స్‌తో అనూహ్య విజయాలతో సవాల్‌ విసురుతున్న డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా..! లామినె యామల్‌లాంటి యువ రక్తంతో ఉన్న స్పెయిన్‌, సమష్టిగా చెలరేగుతూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తుంటే.. నాటకీయంగా ఆటను మలుపులు తిప్పుతూ థ్రిల్లింగ్‌ పోరాటాలతో మెస్సీ సేన గెలుపు దోచేస్తోంది. రెండు జట్ల ఆటతీరు వేరైనా.. అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచ కిరీటమే!! ప్రపంచ ఫుట్‌బాల్‌లో మేటి జట్లయిన అర్జెంటీనా, స్పెయిన్‌..ఆఖరి సంగ్రామానికి సిద్ధమయ్యాయి. ఆరు దశాబ్దాల తర్వాత ఈ రెండు జట్లూ మెగా టోర్నీలో ముఖాముఖి తలపడుతున్నాయి. అర్జెంటీనా సారథి లియోనెల్‌ మెస్సీకి దాదాపుగా ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావడంతో.. గ్రాండ్‌ విక్టరీతో గుడ్‌బై చెప్పాలన్నది అతని అభిమానుల ఆశ.మరి.. ఇద్దరిలో ట్రోఫీ ఎవరిది? వరుసగా రెండోసారి టైటిల్‌ నెగ్గి మెస్సీ సేన చరిత్ర సృష్టిస్తుందా? పెద్దన్నలాంటి అర్జెంటీనాను ఓడించి స్పెయిన్‌ సంచలనం నమోదు చేస్తుందా? నేడు తేలనుంది.

న్యూయార్క్‌: నెల రోజులకుపైగా అలరించిన సాకర్‌ వరల్డ్‌కప్‌ తుది అంకానికి చేరుకొంది. డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా, ‘యూరోపియన్‌’ విజేత స్పెయిన్‌.. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో తల పడనున్నాయి. వరుసగా రెండో టైటిల్‌తో రికార్డు సృష్టించాలని మెస్సీ సేన పట్టుదలతో ఉండగా.. తుదిపోరుకు చేరిన రెండోసారి కూడా టైటిల్‌తో మెరవాలని స్పెయిన్‌ ఆరాటపడుతోంది. ఇరుజట్లూ ఫైనల్‌ చేరుకొన్న తీరు చూస్తే ఎంతో భిన్నం. హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా తడబడినా.. కీలక సమయాలలో పుంజుకొని థ్రిల్లింగ్‌ విజయాలతో ఫైనల్‌కు చేరుకొంది. మరోవైపు స్పెయిన్‌ నిలకడైన ఆటతో ఊహించని రీతిలో టైటిల్‌ రేస్‌లో నిలిచింది.


11-Sports.jpg

మెస్సీ చుట్టూనే..

అర్జెంటీనా ఆట మొత్తం కెప్టెన్‌ మెస్సీ చుట్టూనే తిరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రతి మ్యాచ్‌ విజయంలో అతడి పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటూనే ఉంది. లీగ్‌ దశలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెస్సీ హ్యాట్రిక్‌ గోల్స్‌తో విరుచుకుపడ్డాడు. అయితే, నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓటమి అంచుల నుంచి తప్పించుకొని అనూహ్య విజయాలను అందుకొంది. ప్రీక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌ చేతిలో 0-2తో ఇక ఇంటికే అనుకొన్న దశలో అద్భుత రీతిలో మూడు గోల్స్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చింది. క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. అదనపు సమయంలో దూకుడైన ఆటతో సెమీస్‌ బెర్త్‌ పట్టేసింది. అర్జెంటీనాకు అనుకూలంగా రెఫరీలు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు రేగినా, ఆటతోనే వాటికి కౌంటర్‌ ఇచ్చింది. ఇంగ్లండ్‌తో హైవోల్టేజ్‌ సెమీ్‌సలో లేటు గోల్స్‌తో ఒక్కసారిగా హీటెక్కించింది. మెస్సీతోపాటు లాటరో మార్టినెజ్‌, ఎంజో ఫెర్నాండెజ్‌, అల్వారెజ్‌తో జట్టు బలంగా కనిపిస్తోంది. గోల్‌ కీపర్‌ డిబు మార్టినెజ్‌ అనుభవం కూడా జట్టుకు లాభించనుంది.


22-Sports.jpg

ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా..

యువకులతో కూడిన స్పెయిన్‌ ప్రత్యర్థులకు ఏమాత్రం చాన్సివ్వకుండా తుది పోరుకు చేరింది. ముఖ్యంగా ఆ జట్టు డిఫెన్స్‌ను ఛేదించడం ప్రత్యర్థుల వల్ల కావడంలేదు. గోల్‌ కీపర్‌ సమైన్‌ పెట్టని గోడలా గోల్‌ పోస్టుకు అడ్డుగా నిలుస్తున్నాడు. క్వార్టర్స్‌లో బెల్జియం మినహా ఆడిన మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా స్పెయిన్‌పై గోల్‌ చేయలేక పోయింది. గ్రూప్‌ దశలో ఫర్వాలేదనిపించిన స్పెయిన్‌.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో మాత్రం మేటి జట్లకు షాకిచ్చింది. పోర్చుగల్‌పై లేటు గోల్‌తో ముందంజ వేసిన స్పెయిన్‌.. క్వార్టర్స్‌లో బెల్జియంను 2-1తో కంగుతినిపించింది. సెమీ్‌సలో పటిష్ట ఫ్రాన్స్‌ను 2-0తో చిత్తు చేయడంతో స్పెయిన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఎంబాపె లాంటి ప్లేయర్‌ను కూడా స్పెయిన్‌ డిఫెన్స్‌ సమర్థంగా కట్టడి చేసింది. చిచ్చర పిడుగు లామినె యామల్‌ పాదరసంలా కదులుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నాడు. అతడిని కట్టడి చేయడానికి కాచుకున్న ప్రత్యర్థులకు జట్టులోని సీనియర్లు ఓయర్జబల్‌, పెడ్రో పోరో, మైకేల్‌ మెరినో, ఫాబియాన్‌ రూయిజ్‌ చెక్‌ పెడుతున్నారు. అర్జెంటీనాతో పోల్చితే స్పెయిన్‌ ఆటగాళ్లకు అనుభవం తక్కువైనా.. పటిష్ట రక్షణ శ్రేణితోపాటు కీలక సమయంలో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం.

టిక్కెట్‌ 27 లక్షలు

అమెరికాలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ ఈవెంట్‌గా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ రికార్డులకెక్కే అవకాశం ఉందని ఫోర్బ్స్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కనీస ధర రూ. 6.68 లక్షలు. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్‌ సగటు ధర సుమారు రూ. 11 లక్షలుగా ఉన్నట్టు సమాచారం. మెట్‌ లైఫ్‌ స్టేడియంలోని 115ఎ సెక్షన్‌లో అయితే రూ. 27 లక్షలపైనే ఉంది.

ముఖాముఖి ఇలా..

ఇప్పటిదాకా ఇరుజట్లు ఒకే ఒకసారి ప్రపంచకప్‌ (1966)లో ముఖాముఖి తలపడ్డాయి. ఆ పోరులో అర్జెంటీనా 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్ల మధ్య 14 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగితే.. చెరో 6 విజయాలు సాధించాయి. మిగతా రెండు డ్రాగా ముగిశాయి.

2010లో తొలిసారి విజేతగా నిలిచిన స్పెయిన్‌..

16 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరింది.

వరుసగా రెండోసారి టైటిల్‌ నెగ్గిన ఇటలీ (1934, 1938), బ్రెజిల్‌ (1958, 1962) సరసన

నిలవడానికి అర్జెంటీనాకు ఇదే అరుదైన అవకాశం.

మొత్తంగా మూడుసార్లు అర్జెంటీనా (1978, 1986, 2022) విశ్వవిజేతగా నిలవగా.. మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడింది.

ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

Updated Date - Jul 19 , 2026 | 03:40 AM