Share News

రోహిత్ శర్మను మెస్సితో పోల్చిన టీమిండియా మాజీ క్రికెటర్

ABN , Publish Date - Jul 19 , 2026 | 09:45 AM

టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత జట్టు విజయం సాధించాలంటే ఈ ఇద్దరు సీనియర్ల అనుభవం అత్యంత కీలకమని స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మను మెస్సితో పోల్చిన టీమిండియా మాజీ క్రికెటర్
Mohammad Kaif

స్పోర్ట్స్ డెస్క్: 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత జట్టు విజయం సాధించాలంటే ఈ ఇద్దరు సీనియర్ల అనుభవం అత్యంత కీలకమని కైఫ్ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌ను జట్టు నుంచి క్రమంగా తప్పిస్తారనే ప్రచారం నేపథ్యంలో కైఫ్ ఈ విశ్లేషణ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌తోనే రోహిత్ కెరీర్ ముగుస్తుందనే వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఖండించారు.


ఓ స్పోర్ట్ ఛానల్ వేదికగా జరిగిన చర్చలో కైఫ్ మాట్లాడుతూ.. '2027 ప్రపంచకప్ భారత్‌కు అంత సులువుగా ఏమీ ఉండదు. దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌లు, భిన్నమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలంటే రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండాలి. వారు ఇప్పటి నుంచే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ మంచి ఫామ్‌లో కొనసాగడం జట్టుకు ఎంతో అవసరం' అని కైఫ్ వెల్లడించాడు.


అలానే రోహిత్, కోహ్లీల ప్రాధాన్యతను వివరిస్తూ కైఫ్ అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో వారిని పోల్చాడు. 'మెస్సీకి 39 ఏళ్లు వచ్చినా తన జట్టును ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాడు. సెమీఫైనల్లో అతడు గోల్ చేయకపోయినా.. అసిస్ట్‌తో జట్టుకు తోడ్పడ్డాడు. అనుభవానికి ఉన్న శక్తి అదే. జట్టులో యువ ఆటగాళ్లు మ్యాచ్‌లను ముగించగలరు, కానీ సీనియర్లు వారిని సరైన దిశలో నడిపించగలరు. అర్జెంటీనాకు మెస్సీ ఎలాంటివాడో, రాబోయే వరల్డ్ కప్‌లో భారత్‌కు రోహిత్, కోహ్లీలు అలాంటివారు' అని కైఫ్ పేర్కొన్నాడు.


ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ వన్డే ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్, విరాట్‌ల సేవలు రాబోయే ప్రపంచకప్‌లో వంద శాతం అవసరమని, ముఖ్యంగా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో వీరిద్దరి మార్గదర్శకత్వం జట్టుకు కొండంత అండగా నిలుస్తుందని కైఫ్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా చరిత్రలో తొలిసారి... ప్రపంచ కప్ విజేతలకు స్పెషల్ రింగ్స్

ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం

Updated Date - Jul 19 , 2026 | 10:37 AM