ఆ వీధిలో... అడుగడుగున పుస్తక రాశులు
ABN , Publish Date - May 10 , 2026 | 09:49 AM
అదొక ఇరుకైన వీధి. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యప్రియులను ఆకట్టుకునే చోటు. శుక్రవారం వచ్చిందంటే చాలు... విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులతో ఆ వీధి కిటకిటలాడుతుంది.
అదొక ఇరుకైన వీధి. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యప్రియులను ఆకట్టుకునే చోటు. శుక్రవారం వచ్చిందంటే చాలు... విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులతో ఆ వీధి కిటకిటలాడుతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ విశేషమైన బుక్ మార్కెట్ ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్‌లో ఉంది. దీనికి కొత్త సొబగులు అద్దడంతో ఆనాటి సాంస్కృతిక శోభ తిరిగి కనిపిస్తోంది.
బాగ్దాద్‌లో ఉన్న పుస్తకాల వీధిలో 8వ శతాబ్దం నుంచి విభిన్న రకాల రచయితల పుస్తకాలు అందుబాటులో ఉంటూ వచ్చాయి. ఈ పుస్తకాల వీధికి 10వ శతాబ్దానికి చెందిన రచయిత ‘అబుల్ తాయెబ్ అల్ ముతనబ్బీ’ పేరు పెట్టారు.
బాగ్దాద్‌లో ఏర్పడిన తొలి పుస్తక వాణిజ్య కేంద్రం ఇది. చాలాకాలంగా ఈ ప్రదేశం బాగ్దాద్ మేధావి వర్గానికి ఆత్మగా నిలుస్తోంది. సందర్శకులు ఇక్కడ కొన్ని వందల బుక్‌స్టోర్‌లను చూడొచ్చు. బుక్‌స్టాల్స్, కేఫ్‌లు, స్టేషనరీ షాపులు, టొబాకో దుకాణ సముదాయాలుంటాయి.

‘కైరో రాస్తుంది. బీరుట్ ప్రింట్ చేస్తుంది. బాగ్దాద్ చదువుతుంది.’ గల్ఫ్ దేశాల్లో మేధావులు అనే మాట ఇది.
విక్రేతలు రాత్రివేళ పుస్తకాలను బయటే వదిలేస్తారు. వాటికి కాపలాగా ఎవరూ ఉండరు. ఎవరైనా ఎత్తుకుపోతారన్న భయం ఉండదు. అదే విషయాన్ని పుస్తక విక్రేతలను అడిగితే ‘‘పుస్తకాలు చదివేవాడు దొంగతనం చేయడు. దొంగతనం చేసేవాడు పుస్తకాలు చదవడు’’ అంటారు.
ఒక కి.మీ పొడవైన ఈ పుస్తకాల వీధి బుక్‌స్టోర్స్, బహిరంగ దుకాణాలతో ఉంటుంది. ఈ బుక్ మార్కెట్ మెసపటోమియాలో వందల ఏళ్లుగా జరిగిన రాజకీయ, సాంస్కృతిక మార్పులకు సాక్షీభూతంగా నిలిచింది.

2007లో ఈ వీధిలో జరిగిన పేలుడు ఒక మాయని మచ్చగా నిలిచిపోయింది. నిలిపి ఉంచిన ఒక కారు బాంబు పేలిన ఘటనలో 30 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయాల పాలయ్యారు.
యుద్ధాలు, ఘర్షణల తరువాత 2021లో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న, పుస్తక వాణిజ్యానికి కేంద్ర ప్రాంతమైన బుక్ మార్కెట్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
ఒక కిలోమీటర్ పొడవుండే ఈ పుస్తకాల వీధి ముఖద్వారానికి పలువురు కవుల కవిత్వంలోని కోట్స్ ఉంటాయి. మార్కెట్ చివర్లో ప్రసిద్ధ ఇరాకీ శిల్పి మొహమ్మద్ ఘనీ హిక్మత్ చెక్కిన ‘అబుల్ తాయెబ్ అల్ ముతనబ్బీ’ శిల్పం టైగ్రిస్ నదికి అభిముఖంగా ఉంటుంది.
ఎగ్జిబిషన్లు, గ్యాలరీ ప్రారంభోత్సవాలు, పుస్తక ప్రదర్శనలతో నిత్యం పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఒకప్పుడు బాగ్దాద్... అరబ్ ప్రపంచపు సాంస్కృతిక రాజధానులలో ఒకటిగా, స్వర్ణయుగంగా పరిగణిం చబడింది. బాగ్దాద్ బుక్ మార్కెట్ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూ పుస్తక ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..
Read Latest Telangana News and National News