అమెరికాలో విషాదం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం
ABN , Publish Date - May 10 , 2026 | 07:56 AM
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొని ఓ వ్యక్తి మరణించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం (DEN)లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానం డెన్వర్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరడానికి రన్‌వేపై వేగంగా వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి.. భద్రతా కంచెను దాటి రన్‌వేలోకి ప్రవేశించాడు. దీంతో చివరకు విమానం ఢీకొని మరణించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద తీవ్రతకు విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 224 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఇంజిన్‌లో మంటలు వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సంఘటనపై విమానాశ్రయ అధికారులు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణ ప్రారంభించాయి. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో, ఒక వ్యక్తి భద్రతా కంచెను దాటి రన్‌వే వరకూ ఎలా రాగలిగాడనే అంశంపై అధికారులు విచారిస్తున్నారు. మరణించిన వ్యక్తి వివరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటన కారణంగా డెన్వర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొంత సమయం పాటు అంతరాయం ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి
పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్టు