Share News

విజయ్‌ అను నేను..

ABN , Publish Date - May 10 , 2026 | 05:38 AM

క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, ఎప్పటికప్పుడు కీలక మలుపులు తిరుగుతూ, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఐదు రోజులుగా వేడెక్కిన తమిళ రాజకీయం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది.

విజయ్‌ అను నేను..

  • క్లైమాక్స్‌లో ఆదుకున్న వీసీకే, ఐయూఎంఎల్‌

  • ఐదు రోజుల ఉత్కంఠకు తెర

  • పతాక సన్నివేశంలో మరింత హైడ్రామా

  • రాత్రి 7 గంటలకు కేరళ ప్రయాణానికి గవర్నర్‌

  • ఈలోపు ‘మద్దతు’ కోసం టీవీకే ప్రయత్నాలు

  • సాయంత్రం 4కు వీసీకే, ఐయూఎంఎల్‌ మద్దతు

  • ఆ లేఖలు, జాబితాతో బయలుదేరిన విజయ్‌

  • దారిలోనే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ రద్దు

  • ఎట్టకేలకు 6.35 గంటలకు మళ్లీ ఆహ్వానం

  • ప్రమాణానికి ఓకే.. 13లోగా బలనిరూపణకు ఆదేశం

  • చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణం

విజయ్‌ ప్రమాణం ఇలా..

సి.జోసఫ్‌ విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియాన్ని ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. విజయ్‌ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరు కానున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లోని సినీపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా తరలిరానున్నారు. విజయ్‌తో పాటు మంత్రులుగా కొంతమంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

చెన్నై, మే 9 (ఆంధ్రజ్యోతి): క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, ఎప్పటికప్పుడు కీలక మలుపులు తిరుగుతూ, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఐదు రోజులుగా వేడెక్కిన తమిళ రాజకీయం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. ‘విజయ్‌ అను నేను..’ అంటూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం పది గంటలకు ఆయనతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు. దశాబ్దాల తర్వాత తొలి ద్రవిడేతర ముఖ్యమంత్రిగా జోసెఫ్‌ విజయ్‌ తమిళనాట రికార్డు సృష్టించనున్నారు. వీసీకే, ఐయూఎంఎల్‌ ఇచ్చిన మద్దతుతో తమిళనాడులో టీవీకే తనకు అవసరమైన మ్యాజిక్‌ నంబరును శనివారం సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతును విజయ్‌ సంపాదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం నానా తంటాలు పడిన ఆ పార్టీ కథ చివరికి శనివారం సుఖాంతమైంది. వీసీకే, ఐయూఎంఎల్‌ మద్దతుతో టీవీకే సంఖ్యా బలం 120కు చేరుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్‌ నంబరు 118.


దీంతో తమకు తగిన మెజారిటీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్‌ చేసిన వినతిని గవర్నర్‌ ఆమోదించారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలాన్ని వివరించకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేనని తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాధ్‌ అర్లేకర్‌ ఇప్పటికే మూడుసార్లు తేల్చి చెప్పారు. శనివారం ఉదయం 11 గంటలకు తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన వీసీకే అధినేత తిరుమావళవన్‌ నుంచి చాలాసేపటివరకు ఏ స్పందనా లేదు. ఈ లోపు వీసీకే ప్రధాన కార్యాలయం వద్ద భారీగా కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు మోహరించారు. అందరిలో ఉత్కంఠ! ఐదు రోజుల హైడ్రామాకు శనివారమైనా తెర పడుతుందో లేదోనని సందిగ్ధత. ఇంతలో.. గవర్నర్‌ సాయంత్రం 7.10 గంటలకు కేరళ వెళుతున్నారన్న వార్త మరింత ఉద్విగ్నతకు కారణమైంది. ఆదివారంతో తమిళనాడు 16వ అసెంబ్లీ కాలం వ్యవధి ముగియనున్నందున ఏం జరుగుతుందోన్న టెన్షన్‌ క్షణక్షణానికి పెరుగుతూ పోయింది. ఇంతలో.. వీసీకే నేతలు మరో ప్రకటన చేస్తూ.. సాయంత్రం 4 గంటలకు తమ నిర్ణయం చెబుతామన్నారు. చెప్పినదానికి ఐదు నిమిషాల ముందే వీసీకే ప్రతినిధులు... టీవీకే నేత ఆదవ అర్జునకు మద్దతు లేఖ అందించారు. బేషరతుగా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు గవర్నర్‌కు రాసిన లేఖను వారికి ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌(ఐయూఎంఎల్‌) కూడా టీవీకే ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు గవర్నర్‌కు లేఖ రాసింది. ఆ లేఖను టీవీకే నేతలు కేఏ సెంగోట్టయ్యన్‌, అరుణ్‌రాజ్‌కు అందించింది. ఆ వెంటనే విజయ్‌ గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. విజయ్‌ వినతి మేరకు సాయంత్రం 5.45 గంటలకు గవర్నర్‌ను కలవాలని లోక్‌భవన్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. విజయ్‌ బృందం, సీపీఎం నేత షణ్ముగం తదితరులు లోక్‌భవన్‌కు బయలుదేరారు. కానీ ఇంతలోనే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ రద్దయిందని లోక్‌భవన్‌ నుంచి ఫోన్‌ రావడంతో మార్గమధ్యలోనే వారు ఆగిపోయారు.


ఈ లోపు గవర్నర్‌ కేరళ వెళ్తున్నట్లు లోక్‌భవన్‌ వర్గాలు మీడియాకు చెప్పాయి. దాంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. టీవీకేకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలు గవర్నర్‌ తీరును తీవ్రంగా ఖండించాయి. అయితే 6.30 గంటలకు తనను కలవాలంటూ గవర్నర్‌ కార్యాలయం నుంచి 6.10 గంటలకు విజయ్‌కు ఆహ్వానం అందింది. దాంతో హడావుడిగా బయలుదేరిన విజయ్‌..6.35 గంటలకు లోక్‌భవన్‌ లోపలికి వెళ్లారు. గవర్నర్‌తో 1.45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో విజయ్‌, టీవీకే నేతలతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. విజయ్‌ తనకు మద్దతుగా పార్టీలు ఇచ్చిన లేఖలను గవర్నర్‌కు అందించారు. వాటిని పరిశీలించిన గవర్నర్‌.. వెంటనే ఉత్తర్వులు సిద్ధం చేయించి, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించారు.


బయటనుంచే మద్దతు: వీసీకే, ఐయూఎంఎల్‌

విజయ్‌ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు వీసీకే, ఐయూఎంఎల్‌ స్పష్టం చేశాయి. వీసీకే అధినేత తిరుమావళవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకూడదన్న కారణంగానే టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వీసీకే వల్ల విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారనే అపవాదు తమకు రాకూడదనే తలంపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజస్వామ్యాన్ని కాపాడటం, శాసనసభ్యులు అమ్ముడుపోకుండా చూడటమే తమ ఉద్దేశ్యమన్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు చెప్పే తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము మద్దతు ఇస్తున్నట్లు ఐయూఎంఎల్‌ అధినేత ఖాదర్‌ మొహిద్దీన్‌ ప్రకటించారు. స్టాలిన్‌కు చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా విజయ్‌ గవర్నర్‌తో భేటీ కాగానే, రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు మళ్లీ సంబరాలు జరుపుకొన్నారు.

13 లోగా బలనిరూపణకు ఆదేశం

ఈ నెల 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని విజయ్‌ను గవర్నర్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ మద్దతు ఇస్తున్నట్లు విజయ్‌ లేఖలు అందజేసినందున ఈ నెల 13వ తేదీ లోగా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు.

హైదరాబాద్‌లో తమిళనాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

శంషాబాద్‌, మే 9(ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు చెందిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నొవాటెల్‌ హోటల్‌లో బసచేశారు. హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు స్థానిక విలేకరులు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. అయితే ఐదుగురిలో ఇద్దరు హోటల్‌లోనే ఉండగా, మరో ముగ్గురు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు చూసి రాత్రికి తిరిగి వచ్చారు. తమిళనాడు సీఎంగా విజయ్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో వీరంతా చెన్నై వెళ్తారని సమాచారం. వాస్తవానికి ఈ ఎమ్మెల్యేలు శుక్రవారం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఇక్కడనుంచి బెంగళూరుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - May 10 , 2026 | 06:38 AM