అమ్మను సర్‌ప్రైజ్ చేసేద్దాం...!
ABN , Publish Date - May 10 , 2026 | 09:15 AM
అమ్మ... పేరుకి రెండు అక్షరాలే. కానీ అమ్మ మనసు నిండా పిల్లలపై ఆకాశమంత ప్రేమ. అమ్మ ప్రపంచంలో అంతా పిల్లలే.
అమ్మ... పేరుకి రెండు అక్షరాలే. కానీ అమ్మ మనసు నిండా పిల్లలపై ఆకాశమంత ప్రేమ. అమ్మ ప్రపంచంలో అంతా పిల్లలే. ‘ఈరోజు పాప పుట్టిన రోజు ఏదైనా స్వీట్ చేయాలి.. పరీక్షలైపోయి బాబు హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నాడు... రోజూ వాడికి ఇష్టమైన వంటలే వండాలి...’ ఇలా ఆమె మనసులో ఎప్పుడూ పిల్లల ఊసులే. మరి పిల్లలు అమ్మ గురించి ఏమనుకుంటున్నారు? అమ్మ కోసం ఏం చేస్తున్నారు? రోజూ కాకపోయినా... కనీసం ఈ ‘మదర్స్ డే’ (మే 10) నాడు అమ్మకు సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అలాంటి ఐడియాలే ఇవన్నీ...
‘పాపా... ఈరోజు నీ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అర్జిత్‌సింగ్ మ్యూజిక్ కాన్సర్ట్‌కి టికెట్స్ బుక్ చేశా. నువ్వు, నీ ఫ్రెండ్స్ వెళ్లిరండి..’ అని అమ్మ చెప్పినప్పుడు కలిగిన సర్‌ప్రైజ్‌ను ఆ పాప మర్చిపోగలదా?
‘బాబూ.. బిగ్గరగా కళ్లు మూసుకో... ఓ గిఫ్ట్.. నీ గదిలో వెయిట్ చేస్తోంది..’ అంటూ సైకిల్ తాళాలని చేతిలో పెట్టినప్పుడు ఆ బాబు ఎగ్గిరి గంతేసి, వాళ్ల అమ్మని వాటేసుకుంటాడు.
ఈ అమ్మలే కాదు... రిషి, ఆశ్రిత్, అఖిల్, అక్షిత, అనన్యల అమ్మలూ ఇలాగే సర్‌ప్రైజ్‌లు చేస్తుంటారు. అమ్మలు ఎప్పుడూ ఎక్కడైనా అంతే! ఇండియాలోనే కాదు అమెరికాలో ఉన్న అమ్మలు కూడా పిల్లల కోసం, వాళ్లకి సంతోషం కలిగించేందుకు ఎన్నో పనులు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఇలా అమ్మలేనా సర్‌ప్రైజ్‌లు చేసేది? ఈ ‘మదర్స్ డే’కి అమ్మలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే పనులు పిల్లలు చేస్తే ఎలా ఉంటుంది? ఏడాదంతా మనకోసమే పనిచేసే అమ్మకి సంబంధించిన ఈ ‘బిగ్ డే’ని పిల్లలు చాలారకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలు: ఇంట్లో అందరికన్నా ముందే లేచి, అన్ని పనులు కానిచ్చేసి, ఇంటిల్లిపాదికీ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేస్తుంది అమ్మ. అయినా కూడా స్కూల్‌కి లేట్ అయ్యిందని, సగం ఇడ్లీ మిగిల్చేసి వెళ్లే పిల్లలు, చట్నీలో ఉప్పు ఎక్కువైందని కంప్లెయింట్ చేసే పిల్లలే ఎక్కువ. అలా కాకుండా ఈ రోజు ముందే నిద్ర లేచి, అమ్మకు నచ్చిన టిఫిన్ చేసి పెడితే, తప్పకుండా ఆశ్చర్యపోతుంది. మురిసిపోతుంది. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంది. శాండ్విచ్‌లు, సలాడ్‌లు లాంటివి స్కూల్ పిల్లలు కూడా సులభంగా చేయొచ్చు. ఇంకాస్త పెద్ద పిల్లలయితే అమ్మకు నచ్చిన రెసిపీ వండితే బాగుంటుంది.

కాస్త చేయి వేద్దాం: ప్రతీ ఇంట్లో అమ్మ సూపర్‌హీరో. గడియారం ముల్లు లాగే క్షణం కూడా తీరిక లేకుండా రోజంతా, ఒంటిచేత్తో ఎన్నో పనులు చేస్తుంటుంది. ఈ ఒక్క రోజు పిల్లలు అమ్మ కన్నా ముందే లేచి ఇంటి పనుల్లో ఒకటో రెండో చేసి, అమ్మను ఆశ్చర్యపరిస్తే. అలాంటి ‘మదర్స్ డే’ని అమ్మ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఇల్లు ఊడ్చడం, గదులలో వస్తువులని సర్దడం, పాలని కాచడం లాంటి చిన్న చిన్న పనులైనా సరే. అమ్మకు అదే పెద్ద సాయం.
రిలాక్స్ అయ్యేలా: ‘హోమ్ స్పా’లాంటి వాతావరణాన్ని మాస్టర్ బాత్‌రూమ్‌లో సిద్ధం చేయాలి. సువాసన భరితమైన క్యాండిల్స్‌ను వెలిగించడం, గులాబీ రేకుల్ని నీళ్లలో వేసి పెట్టడం, ప్రత్యేకమైన బాడీ ష్రబ్, లోషన్ మాస్క్, ఫేస్ మాస్కులు అందుబాటులో ఉంచడంతో పాటు మంద్రపాటి సంగీతం వచ్చే ఏర్పాట్లు చేస్తే అమ్మ ఆ సెటప్ అంతా చూసి ఆశ్చర్యానికి లోనవుతుంది. కాసేపు తప్పకుండా రిలాక్స్ అవుతుంది.
నచ్చిన ప్రదేశాలకు: ‘ఆ మ్యూజియం చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా’, ‘చిన్నప్పుడు మా నాన్నగారితో ఫలానాచోటుకి షాపింగ్‌కి వెళ్లాను. ఆ తరవాత మళ్లీ వెళ్లలేదు.’ ‘ఆ రెస్టారెంట్‌లో భోంచేయాలని ఉంద’ని అమ్మ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని ఈ రోజు ఆమెను ఆయా ప్రదేశాల్లో ఎక్కడికైనా ఒకచోటుకి తీసుకువెళ్లి చూడండి. అమ్మ ఎంతలా ఆశ్చర్యపోతుందో తెలుస్తుంది!

బహుమతుల బుట్ట: ప్రతీ సందర్భంలోనూ బహుమతులు అందించడం సాధారణ విషయం. ఈ రోజు అమ్మకి కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఓ క్షణం ఆగండి. ఒక్కటి కాకుండా ఈసారి ఓ బహుమతుల బుట్టని ఇస్తే ఎలా ఉంటుంది. ఇది భారీగా, ఖర్చుతో కూడినది కానవసరం లేదు. నాలుగు రోజా పూలు లేదా మల్లెపూల మాల, అమ్మకి ఇష్టమైన చాక్లెట్లు, క్యాండీలు, నచ్చిన చిప్స్ ప్యాకెట్‌లు, గాజులు, హెయిర్ బ్యాండ్, నప్పే లిప్ బామ్.. ఇలా అమ్మకు నచ్చే వస్తువుల్ని అందంగా ర్యాప్ చేసిన ఓ బుట్టలో పెట్టి ఇస్తే... ఈ బహుమతిని అమ్మ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.
సెంటిమెంట్ ఆల్బమ్: స్కూలు, కాలేజీ, ఉద్యోగం.. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నా, చిన్నప్పటి నుంచి అమ్మతో తీసుకున్న ఫోటోలు బోలెడు ఉంటాయి. మీరూ అమ్మా; నాన్నా, అమ్మా; అక్క లేదా అన్నతో అమ్మ ఉన్న ఫోటోలని ఓ చిన్న ఆల్బమ్‌లో పెట్టి ప్రతీ ఫోటో పక్కనా మంచి క్యాప్షన్స్ రాసి, అమ్మ మీద మీకున్న ప్రేమని అక్షరాల్లో బంధించి అందించండి. అమ్మ ఎంతో మురిసిపోతూ ఈ ఆల్బమ్‌ని తన తలగడ పక్కనే పెట్టుకుని రోజుకు ఓసారైనా చూస్తూ తప్పకుండా మురిసిపోతుంది. ఈ ఫొటోలతో వీడియోలు చేసి, చక్కని సంగీతాన్ని జతచేసి ‘మెమరబుల్ మూమెంట్స్’ గా ఫోన్‌లో కూడా అందించవచ్చు.

రోజూ కొత్తగా: ‘మాతృ దినోత్సవం’ కాబట్టి ఈ రోజు కాస్త హడావుడి ప్రదర్శించి, తిరిగి రేపటి నుంచి మామూలుగా అయిపోతారు చాలామంది. అయితే ఇచ్చిన బహుమతి ఈరోజు పూలు, రేపు కాయలు, ఎల్లుండి కొత్తిమీర కాస్తే భలేగా ఉంటుంది కదూ. అందుకే ఈ మధ్య ఇంట్లోనే పెంచుకోగలిగే ‘మినీ హెర్బ్ గార్డెన్స్ కిట్’లు లభిస్తున్నాయి. ఇందులో ఇంటి తోటకు సంబంధించిన రకరకాల విత్తనాలే కాదు, గార్డెనింగ్ గ్లోవ్స్, టూల్స్, పూలకుండీలు తదితరాలన్నీ ఉంటాయి. పెరడు లేదా బాల్కనీలో వీటిని అమర్చి, ఆయా విత్తనాలను జల్లి అమ్మ, తనకిష్టమైన చిన్న తోటను పెంచుకోవచ్చు. ఆ బుల్లి తోటలో వచ్చే కూరగాయలను రోజూ ఉపయోగిస్తూ, పిల్లలు ఇచ్చిన బహుమతి పెరిగి పెద్దదవుతూ, కాయలు కాస్తోందని అమ్మ సంతోషపడుతుంది.
కళల తరగతులకు: కొంతమంది అమ్మలకు కళలంటే మహా ఇష్టంగా ఉంటుంది. ఈ రోజు వాళ్లని ముందుగా బుక్‌చేసిన ఓ పెయింటింగ్ తరగతి లేదా సంగీతం క్లాసుకు తీసుకుని వెళ్లి సర్‌ప్రైజ్ చేయవచ్చు. ఆమెకు ఇష్టం అయితే ‘కుకరీ’ క్లాసులకూ తీసుకెళ్లొచ్చు. బుక్ ఎగ్జిబిషన్లు కూడా మంచి ఆప్షనే. ఎప్పుడూ ఇంటి పనుల్లో గడిపే అమ్మ ఇలాంటి ‘హ్యాపెనింగ్ ఈవెంట్స్’ని చూసి ఆశ్చర్యపోతుంది. కాస్త రిలాక్స్‌డ్‌గా ఫీల్ కావొచ్చు. ఈ శుభదినాన ఆమెకు అలా ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన వారవుతారు.
ఇవే కాదు... మనసు పెడితే ఇలాంటి సరికొత్త ఆలోచనలు ఎన్నో మీకే తడుతాయి. ‘మదర్స్ డే’ వారోత్సవంగా మీ మనసులో నుంచి వచ్చిన భావాలను అక్షరీకరించి ఏడు కార్డుల్లో అమ్మంటే...? అని చిన్న కవితలు రాసి, స్కెచ్‌పెన్నులతో అందంగా అలంకరించి ఇవ్వొచ్చు. అమ్మతో కలిసి సరదాగా ‘డే అవుట్’ టూర్‌కి వెళ్లొచ్చు. డిన్నర్‌కి ఆమె చిన్నప్పటి స్నేహితులని ఇంటికి ఆహ్వానించి పేద్ద సర్‌ప్రైజ్ చేయొచ్చు. ఏది చేసినా ప్రతీ పనిలో అమ్మంటే మీకు ఉన్న ప్రేమ, అభిమానం కనిపిస్తూ, అమెకి సంతోషం కలిగించేదిగా ఉండాలి. ఆలస్యమెందుకూ... ఈ రోజు అమ్మని సర్‌ప్రైజ్ చేసి, సంతోషించేలా చేసేద్దాం!
ఈ వార్తలు కూడా చదవండి:
ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..
Read Latest Telangana News and National News