Share News

హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:56 PM

శివాలయంలోని హుండీ లెక్కింపులో భక్తులు దేవుడికి రాసిన ఉత్తరాలు బయటపడ్డాయి. వాటిల్లో కొన్ని నవ్వించే విధంగా ఉండగా, మరికొన్ని కంటతడి పెట్టించేలా ఉన్నాయి.

హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!
Letter to Lord Shiva

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయ హుండీ లెక్కింపులో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి విచ్ఛేసిన భక్తుల్లో కొందరు హుండీలో తమ కోరికల చిట్టీలు వేయగా.. అవి తాజాగా బయటపడ్డాయి. భక్తులు తమ కోరికలను శివుడికి చేరవేసేందుకు రాసిన లేఖలే అవి. అయితే ఆ ఉత్తరాలు చదివిన ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. కొన్ని లేఖలు నవ్వు తెపించేలా ఉండగా.. మరికొన్ని కంటతడి పెట్టించేలా ఉన్నాయి.


ఓ భక్తుడు తన కోరిక తీరితే మద్యం సేవించడం మొత్తానికే మానేస్తానని శివుడికి విన్నవించారు. కాకపోతే లాస్ట్ టైమ్ ఒకసారి తాగిన తరువాతే మందుకు గుడ్‌బై చెబుతానని ఓ షరతు పెట్టారు. ‘దేవుడా! నా కోరికను తీర్చు. నేను ఎప్పటినుంచో దాని కోసం కలలు కంటున్నాను. నువ్వు ఒక్కసారి దాన్ని తీర్చావనుకో.. నేను జీవితాంతం మందు ముట్టను. కానీ మానేసేముందు చివరిసారి మనస్ఫూర్తిగా తాగుతాను’ అని అందులో రాసుకొచ్చారు.

మూడో తరగతి చదివే ఓ చిన్నారి రాసిన ఉత్తరమైతే అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. తన నోట్ బుక్‌‌లో కాగితాలనే చింపి ఆ లేఖ రాసిందా బాలిక. ‘ప్లీజ్ గాడ్.. నన్ను పరీక్షల్లో పాస్ చేయించు’ అని వేడుకుంది. లెటర్ చివర్లో ‘సబ్జెక్ట్‌లు.. హిందీ, జీకే, ఈవీఎస్’ అని ఆమె రాయడం చూసి అక్కడి సిబ్బంది కడుపుబ్బా నవ్వుకున్నారు.

అన్నీ ఉత్తరాలు ఇలా ఫన్నీగానే లేవు. కొన్ని లేఖలు చదివి సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళ ‘చనిపోయిన నా తమ్ముడిని మళ్లీ పుట్టించు దేవుడా.. నా కడుపున వాడు జన్మించి.. మా ఇంటికి తిరిగి వచ్చేలా చేయి’ అని రాసిన లేఖ చూసి కంటతడి పెట్టుకున్నారు. తన అనారోగ్యాన్ని నయం చేయాలని మరో మహిళ లేఖలో శివుడికి పెట్టుకున్న మొర వారి హృదయాలను కదిలించింది.


చిన్నారి లేఖ

girl.jpg

చనిపోయిన సోదరుడు తన కడుపున పుట్టాలని మహిళ రాసిన లేఖ

brother.jpeg

మందు మానేసే ముందు ఒక్కసారి తాగుతానని షరతు పెట్టిన భక్తుడి లేఖ

letter.jpeg


ఇవి కూడా చదవండి:

వినాయకుడి మట్టి విగ్రహాలే ఎందుకు? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలెందుకు వద్దు?

శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న అధికారులు

Updated Date - Sep 10 , 2026 | 06:50 PM