రాతపరీక్ష లేకుండానే పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి!
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:00 PM
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి తపాలా శాఖ మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ వంటి హోదాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకాలకు సంబంధించిన ఖాళీలు, దరఖాస్తు విధానం ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు
దేశవ్యాప్తంగా మొత్తం 23,757 GDS పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్: 917 పోస్టులు
UR: 400
OBC: 213
SC: 125
ST: 45
EWS: 109
దివ్యాంగులు: 25
తెలంగాణ: 419 పోస్టులు
UR: 201
OBC: 85
SC: 59
ST: 17
EWS: 45
దివ్యాంగులు: 12
దరఖాస్తు ఎలా చేయాలి?
GDS పోస్టులకు అప్లై చేసే విధానాన్ని దశలవారీగా తెలుసుకుందాం..
రిజిస్ట్రేషన్
ముందుగా ఇండియా పోస్ట్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. సంబంధిత నోటిఫికేషన్‌ను ఎంచుకుని Click Here to Registerపై క్లిక్ చేయాలి. అనంతరం New Candidate Registration ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తర్వాత మొబైల్ నంబర్‌ను నమోదు చేసి Send OTPపై క్లిక్ చేయాలి. ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి Verify OTP చేయాలి. ఇదే విధంగా ఈమెయిల్ ఐడీని నమోదు చేసి, దానికి వచ్చిన OTPని ధ్రువీకరించాలి.
ఆ తర్వాత అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, తల్లిదండ్రుల పేర్లు, కేటగిరీ తదితర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి Complete Registrationపై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తాయి.
లాగిన్
వెబ్‌సైట్‌లోని Login ఆప్షన్‌ను ఎంచుకుని రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి Verify OTPపై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లింపు
తర్వాత Fee Payment ఆప్షన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. అయితే మహిళలు, SC, ST, PwBD కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయడం
ఫీజు చెల్లించిన తర్వాత Apply Onlineపై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన వ్యక్తిగత వివరాలు ఇందులో కనిపిస్తాయి. అవసరమైన చిరునామా వివరాలను నమోదు చేసి Save and Nextపై క్లిక్ చేయాలి. తర్వాత విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. ఏ రాష్ట్రంలో చదివారు, పదో తరగతి ఉత్తీర్ణత సంవత్సరం, బోర్డు, హాల్ టికెట్ నంబర్, సబ్జెక్టుల వారీగా మార్కులు/పాయింట్లు వంటి వివరాలను నమోదు చేయాలి.
పోస్టాఫీసుల ఎంపిక
తదుపరి దశలో అభ్యర్థి కోరుకున్న సర్కిల్, డివిజన్ ఆధారంగా పోస్టులను ఎంపిక చేసుకోవాలి. అందుబాటులో ఉన్న వాటిలో మొత్తం 20 పోస్టాఫీసులను BPM, ABPM లేదా డాక్ సేవక్ పోస్టుల కోసం ప్రాధాన్యం క్రమంలో ఎంచుకోవాలి. అనంతరం Save and Nextపై క్లిక్ చేయాలి.
ఫొటో, సంతకం అప్‌లోడ్
తర్వాత సూచించిన విధంగా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. డిక్లరేషన్‌ను చదివి అంగీకారానికి టిక్ పెట్టి Previewపై క్లిక్ చేయాలి. అప్పటివరకు నమోదు చేసిన వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు చేసుకోవాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Submit Applicationపై క్లిక్ చేయాలి. అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
Also Read:
పోలాల అమావాస్య.. చివరి శ్రావణ శుక్రవారం.. ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలంటే?
వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..