Share News

వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూసుకెళ్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మెరుగైన పనితీరుతో ఇతర జిల్లాలను వెనక్కి నెట్టి ర్యాంకుల్లో ముందంజ వేసింది.

వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..
Prakasam District GVA Growth

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూసుకెళ్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మెరుగైన పనితీరుతో ఇతర జిల్లాలను వెనక్కి నెట్టి ర్యాంకుల్లో ముందంజ వేసింది. అమరావతి సచివాలయంలో ఇవాళ (గురువారం) నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై జరిగిన చర్చలో ఈ విషయం వెల్లడైంది. జిల్లాల స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో ప్రకాశం జిల్లా గణనీయమైన పురోగతి సాధించినట్లు సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ తెలిపారు.


వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గతేడాది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే ప్రకాశం జిల్లా తన ర్యాంకును మెరుగుపరుచుకుందని పీయూశ్ కుమార్ వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,388 కోట్ల జీవీఏతో ప్రకాశం జిల్లా 7వ స్థానంలో నిలవగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,202 కోట్ల జీవీఏ సాధించిందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 34.09 శాతం వృద్ధి అని, దీంతో జిల్లా 7వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని చెప్పుకొచ్చారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఈ వృద్ధి సాధ్యమైనట్లు ఆయన తెలిపారు.


ప్రకాశం జిల్లా వృద్ధిరేటు మెరుగుపడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. వృద్ధిరేటులో వెనుకబడిన జిల్లాలు ప్రకాశం సాధించిన పురోగతి నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన సూచించారు. అన్ని జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసి, అభివృద్ధి ఫలితాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష..

'పేదల సొంతింటి కల నెరవేర్చాలి'.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం

Updated Date - Sep 10 , 2026 | 04:34 PM