2,700 ఎకరాల్లో మైకేల్ జాక్సన్ ఫాంటసీ ప్రపంచం.. చూస్తే మైమరిచిపోవాల్సిందే.!
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:56 PM
సెలబ్రిటీల ఇళ్లను చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే మైకేల్ జాక్సన్ నివాస భవనం చూస్తే ఆ సెలబ్రిటీలు కూడా అవాక్కవ్వాల్సిందేనేమో. 2,700 ఎకరాల్లో ఆయన ఫాంటసీ ప్రపంచాన్నే నిర్మించారు. ఇంతకీ ఏమిటా ఫాంటసీ ప్రపంచం? ఆ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం...
ఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీలు తమ ఇళ్లను భిన్నంగా, లగ్జరీగా కట్టుకోవాలనుకుంటారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాలరాతి సౌధాలు, ఇంద్రభవనాలను నిర్మించుకుంటారు. అయితే మైకేల్ జాక్సన్ మాత్రం ఓ ఇంటికి బదులుగా ఏకంగా ఫాంటసీ ప్రపంచాన్నే నిర్మించారు. 2,700 ఎకరాల్లో ఉండే ఆ ప్రపంచంలో జూ, సినిమా థియేటర్ ప్రైవేట్ పార్కు, రైల్వే స్టేషన్ ఇలా అన్నీ ఉంటాయి.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ రాంచ్(పశువులను పెంచే వ్యవసాయ క్షేత్రం)ను మైకేల్ జాక్సన్ 1983లో కొనుగోలు చేశారు. ఆ తరువాత దానికి నెవర్‌ల్యాండ్ అనే పేరు పెట్టి ప్రైవేట్ ఫాంటసీ వరల్డ్‌గా మార్చారు. ఆ తరువాత నెవర్‌ల్యాండ్‌నే తన నివాసం చేసుకున్నారు. అందులో ఓ పెద్ద నీటి కొలను, రైల్వే స్టేషన్, మైమరిపించే పార్కులను ఏర్పాటు చేశారు. అక్కడ ఓవైపు జలపాతం, రాతి వంతెన, పూలతోటలు కనువిందు చేస్తే.. మరోవైపు ప్రైవేట్ జూ పార్క్, సినిమా థియేటర్ మరింత వినోదాన్ని పంచుతాయి. ఈ ప్రకృతి సౌందర్యం మధ్యలో రైలుబండి 'కూ.. చుక్ చుక్.!' అంటూ పరుగులు పెడుతుంది. ఆ రైలులోంచి ఈ సొగసులన్నీ చూస్తే ఎవరికైనా ఒళ్లు పులకరించాల్సిందే! ఇలా మాటల్లో వివరించేందుకు, వర్ణించడానికి సాధ్యపడని రీతిలో ఆయన నెవర్‌ల్యాండ్ పేరిట తన ఫాంటసీ ప్రపంచాన్ని తీర్చిదిద్దారు.
మసకబారిన నెవర్‌ల్యాండ్ కళ..
అయితే.. ఈ నెవర్‌ల్యాండ్ ఆ తరువాతి కాలంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. 2003లో ఓ క్రిమినల్ కేసు దర్యాప్తులో పోలీసులు నెవర్‌ల్యాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. అప్పటి నుంచి మైకేల్ జాక్సన్ అక్కడ నివసించడం మానేశారు. 2009లో ఆయన మరణానంతరం నెవర్‌ల్యాండ్ ఆర్థిక చిక్కుల్లో పడింది. దీంతో ఆ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేశారు. మెల్లగా ఆ ఫాంటసీ ప్రపంచం తన ఉనికిని కోల్పోవడం మొదలుపెట్టింది.
2015లో దాని పేరును కూడా మార్చేశారు. ఆ సంత్సరంలోనే రాంచ్‌ను 100 మిలియన్ డాలర్లకు విక్రయానికి పెట్టగా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత దాని ధరను 67 మిలియన్ డాలర్లకు తగ్గించినా అమ్ముడుపోలేదు. చివరికి 2020లో ఓ వ్యాపారవేత్త రాంచ్‌ను 22 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. ఇప్పటికీ ఆ రాంచ్ అక్కడే ఉంది. కానీ నెవర్‌ల్యాండ్ లేదు. 2,700 ఎకరాల ప్రాపర్టీ అక్కడే ఉంది. కానీ దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన ఫాంటసీ ప్రపంచం మాత్రం కనుమరుగైంది.
ఇవి కూడా చదవండి:
తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!
హైదరాబాద్‌కు దగ్గరలోనే ఈ అద్భుత కోట.. ఈ విశేషాలు మీకు తెలుసా?