ప్రపంచ రికార్డును సమం చేసిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:52 PM
సౌతాఫ్రికా ఆటగాడు జోర్డన్ హెర్మన్ చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును సమం చేశాడు. నమీబియాతో జరుగుతున్న తొలి వన్డేలో 24 ఏళ్ల హెర్మన్ భారీ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
స్పోర్ట్స్ డెస్క్: దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ జోర్డన్ హెర్మన్ చరిత్ర సృష్టించాడు. ఇవాళ(బుధవారం) వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన ప్రపంచ రికార్డును సమం చేశాడు. విండ్‌హోక్ వేదికగా నమీబియాతో జరిగిన తొలి వన్డేలో ప్రొటీస్ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన ఈ 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
హెర్మన్ 126 బంతుల్లో 150 పరుగులు చేయగా.. ఇందులో 17ఫోర్లు,3 సిక్సర్లు ఉన్నాయి. 2025 ఫిబ్రవరి 10 సౌతాఫ్రికాకే చెందిన మాథ్యూ బ్రీట్జ్కీ తన వన్డే అరంగేట్రంలో న్యూజిలాండ్‌పై 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు. తాజాగా అతడి ప్రపంచ రికార్డును హెర్మన్ సమం చేశాడు. వన్డే అరంగేట్రంలో వీరిద్దరి మినహా మరెవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. ఈ ఘనత సాధించిన ఇద్దరు ఆటగాళ్లూ ప్రొటీస్ ప్లేయర్లే కావడం విశేషం. వీరి తర్వాత వెస్టిండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. 1978 ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తన వన్డే అరంగేట్రంలో హేన్స్ 136 బంతుల్లో 148 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 348 పరుగుల భారీ స్కోర్ చేసింది. 27 పరుగులకే ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజన్ (10) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అయిన హెర్మన్, టోనీ డి జోర్జి (72) కలిసి భారీ స్కోర్‌కు బలమైన పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 166 బంతుల్లో 190 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత సౌతాఫ్రికా స్కోర్ కాస్త నెమ్మదించింది.
స్వల్ప వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబాటుకు లోనైంది. అయినా 47వ ఓవర్‌లో 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. చివరకు సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో పేసర్ రూబెన్ ట్రంపల్‌మన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. జె.జె. స్మిత్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో వికెట్ సాధించారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
వన్డే అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు
మాథ్యూ బ్రీట్జ్కే(దక్షిణాఫ్రికా)-150
జోర్డాన్ హెర్మన్(దక్షిణాఫ్రికా)-150
డెస్మండ్ హేన్స్(వెస్టిండీస్)-148
రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్దానిస్థాన్)-127
మార్క్ చాప్‌మన్(హాంగ్‌కాంగ్)-124*
ఇవి కూడా చదవండి:
సూర్యరశ్మి, వర్షం లేకుండానే పంటలు.. మూతపడిన బొగ్గు గనుల్లో చైనా కొత్త ప్రయోగం..
ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌రెడ్డి