Share News

‘ఫ్యాట్‌ డాగ్‌’ ఎన్నికలు.. గోలాకు 66,952 ఓట్లు

ABN , Publish Date - Oct 18 , 2026 | 10:06 AM

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ మార్కెట్‌.... స్థానికంగా ఉన్న ఒక బర్గర్‌ షాపులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో యువత ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు.

‘ఫ్యాట్‌ డాగ్‌’ ఎన్నికలు.. గోలాకు 66,952 ఓట్లు
Delhi Dog Election

  • భలే ఎన్నికలు!

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ మార్కెట్‌.... స్థానికంగా ఉన్న ఒక బర్గర్‌ షాపులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో యువత ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. అలా అని ఈ ఎన్నికలు నేతలను ఎన్నుకునేవి అనుకుంటే పొరపాటే. ‘ఫ్యాట్‌ డాగ్‌ ఆఫ్‌ ఢిల్లీ’ పేరుతో లావుగా, బొద్దుగా ఉండే కుక్క ఏదో నిర్ణయించడం కోసం నిర్వహించిన పోటీ ఇది. సుమారు 94 వేల మంది ఓటు హక్కు వినియోగించు కున్న ఈ ఎన్నికలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఒక నెల రోజుల పాటు సోషల్‌ మీడియాలో ఏ పేజీ చూసినా బొద్దుగా ఉన్న కుక్కల ఫొటోలే. ఒక్కో కుక్కకు ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు. వందలాది మంది వాటికి ఫాలోవర్లుగా మారిపోయారు. ప్రచార పోస్టర్లు తయారు చేయించారు. ఢిల్లీలో రాజకీయాలు, క్రికెట్‌ వంటి అంశాలపై చర్చించే యువత నెలరోజుల పాటు వీధి కుక్కల గురించి ఉత్సాహంగా చర్చించింది. ‘ఫ్యాట్‌ డాగ్‌ ఆఫ్‌ ఢిల్లీ’ పేరుతో నిర్వహించిన ఎన్నికల్లో వారి కుక్కను గెలిపించుకోవడం కోసం డాగ్‌ లవర్స్‌ చేసిన ప్రయత్నాలివి.


ఓటింగ్‌ ఇలా...

ఈ ఎన్నికల్లో 60కిపైగా కుక్కలు బరిలో నిలిచాయి. ఫైనల్‌ పోటీలో గోలా, గూగూ అనే రెండు కుక్కలు పోటీపడ్డాయి. ఢిల్లీలోని హౌజ్‌ ఖాస్‌లోని ఎస్‌డీఏ మార్కెట్‌లో ఉండే గోలా ఎట్టకేలకు ఎన్నికల్లో విజేతగా నిలిచింది. గోలాకు స్థానిక ప్రజలతో పాటు, సోషల్‌ మీడి యాలో వేల సంఖ్యలో అభిమానులున్నారు. సాకేత్‌ ప్రాంతంలో ఉండే గూగూ అనే డాగ్‌ రన్నరప్‌గా నిలిచింది. దీనికి కూడా సోషల్‌ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు న్నారు. అయితే గోలా ఈ పోటీల సమయం లోనే మరణించడం అభిమానులను కలచి వేసింది.


book4.2.jpgఈ ఎన్నికల్లో 94 వేల మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. గోలాకు 66,952 ఓట్లు రాగా, గూగూ 39,904 ఓట్లతో రన్నరప్‌గా నిలిచింది. డాగ్‌ లవర్స్‌ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం నిర్వాహ కులు నాలుగు సెంటర్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. పోలింగ్‌ కేంద్రా లకు రాలేని వారికోసం ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ఆన్‌లైన్‌లో ఓటు వేసే ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఒక చిన్న కాగితంపై వాళ్లకు నచ్చిన కుక్క పేరు రాసి బాక్స్‌లో వేశారు. ఓటు వేసిన వారి వేలిపై సిరా గుర్తుకు బదులుగా చేతిపై స్టార్‌ స్టిక్కర్‌ అతికించారు.


బహుమతుల వర్షం

పోటీలో పాల్గొన్న కుక్కలకు విరాళాలు, బహుమతులు అందించడానికి అనేక సంస్థలు ముందు కొచ్చాయి. డిస్ట్రిక్ట్‌ బై జొమాటో, సియెన్నా మేడ్‌ ఇన్‌ బెంగాల్‌ కలిసి పోటీలో పాల్గొన్న ప్రతీ కుక్కకు ప్రత్యేకంగా తయారు చేసిన సిరామిక్‌ గిన్నెను అందించాయి. ఎంపిక చేసిన జంతు సంరక్షణ కేంద్రానికి రూ.50 వేలు విరాళంగా అందించారు నిర్వాహకులు. కుక్కలకు ఏడాదిపాటు సరిపడా ఆహారం అందించేందుకు మరో రూ. 50 వేలు కేటాయించారు.


book4.3.jpgబేర్‌హగ్స్‌ అనే సంస్థ కుక్కల వైద్య ఖర్చుల కోసం రూ.50 వేలు ఇచ్చింది. అంతేకాకుండా వాటికి తినుబండారాలు, పడకలు, రాత్రివేళల్లో కనిపించేలా మెరిసే మెడపట్టీలను కూడా అందించింది. ఇవే కాకుండా కుక్కలకు కేకులు, బొమ్మలు, జాకెట్లు, నులిపురుగుల నివారణ మందులు, పోషక పదార్థాలను బహుమతులుగా ఇచ్చారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కుక్కల్లో రెండు మరణించాయి. దాంతో వాటికి ఇవ్వాల్సిన బహుమతులను తరువాతి స్థానాల్లో ఉన్న కుక్కలకు అందించారు.


విమర్శలు... ప్రశంసలు...

ఈ పోటీ సరదాగా సాగినప్పటికీ, కుక్కల ఆరోగ్యం గురించి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కల ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చని, వాటి ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని విమర్శించారు. అయితే, ఈ కార్యక్రమం వల్ల వీధి కుక్కలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని, వాటి పట్ల ప్రేమ, శ్రద్ధ పెరుగుతున్నాయని కొంతమంది అన్నారు. వీధి కుక్కలు కూడా మనం నివసించే ప్రాంతాల్లో భాగమేనని ప్రజలు గుర్తిస్తున్నారని, వాటి సంక్షేమం కోసం మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఏదిఏమైనా బొద్దుగా ఉన్న కుక్కల కోసం వేల మంది స్వచ్ఛందంగా ముం దుకు రావడం అభినందనీయమని సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


ఎన్నికలకు కారణమిది...

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని నగరంలో కనిపించే అధిక బరువున్న కుక్కల ఫొటోలను పోస్ట్‌ చేయడానికి ఒక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని ప్రారంభించారు. ఈ పేజీని అనుసరించే వారి సంఖ్య కొద్దిరోజుల్లోనే వేలకు చేరుకుంది. ఆ తరువాత చాలామంది వారి ప్రాంతాల్లో కనిపించే కుక్కల ఫొటోలు, వాటి పేర్లు పంపడం మొదలుపెట్టారు. దాంతో ఆమె ఆ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని ఒక పోటీగా మార్చారు. అలా సరదాగా ప్రారంభించిన ఇన్‌స్టా పేజీ ఒక సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 10:06 AM