Share News

చాణక్య నీతి.. ఇలా చేస్తే శత్రువులపై విజయం తథ్యం

ABN , Publish Date - Oct 18 , 2026 | 08:57 AM

జీవితంలో సవాళ్లు సహజం. కొన్ని ప్రత్యర్థుల వల్ల ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలో అచార్య చాణకుడు తెలిపారు.

చాణక్య నీతి.. ఇలా చేస్తే శత్రువులపై విజయం తథ్యం
Chanakya Niti

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఈ విజయం కోసం తీవ్రమైన పోటీకి సిద్ధంగా ఉండాలి. పోటీలో విజయం కోసం ప్రత్యర్థులు రకరకాల ఉపాయాలు, కుయుక్తులనూ ప్రయోగిస్తారు. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే అవతలివారితో శత్రుత్వం మొదలవుతుంది. ఇలాంటి వాటన్నిటినీ అధిగమించి విజయం సాధించేందుకు కౌటిల్యుడు తన చాణక్య నీతిలో అనేక మార్గాలు చెప్పాడు. అవేంటంటే..


ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయొద్దు..

ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమే జీవితంలో అనేక మంది చేసే అతిపెద్ద తప్పిదమని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఒకసారి విజయం సాధించాక నమ్మకం పెరుగుతుంది. ఇది ఆతివిశ్వాసంగా మారినప్పుడు జనాలు తమ ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేస్తారు. చివరకు మళ్లీ పాతాళానికి పడిపోతారు. అతివిశ్వాసంతో వచ్చే నిర్లక్ష్యం పనిపై శ్రద్ధను తగ్గిస్తుంది. మనకు తిరుగేలేదన్న తప్పుడు ధీమా పెరుగుతుంది. చివరకు అపజయం పాలవుతారు. కాబట్టి, సొంతబలంపై పూర్తి అవగాహనతో పాటు ప్రత్యర్థి బలాబలాపై స్పష్టమైన అంచనాతో ముందుకు సాగాలని ఆచార్య చాణక్యుడు తెలిపారు. రంగం ఏదైనా ప్రత్యర్థిపై సముచిత గౌరవంతో ఉంటే మనసులో నిర్లక్ష్యం, అతివిశ్వాసం దరిచేరవనేది చాణక్యుడి ఉద్బోధ.


కోపంపై నియంత్రణ

మనిషికి ఉండే అనేక భావోద్వేగాల్లో కోపం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైన భావావేశమని అచార్య చాణక్యుడు తెలిపారు. కాబట్టి, ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా సహనం కోల్పోకుండా ఉండాలి. కోపం అదుపు తప్పకుండా జాగ్రత్త పడాలి. అవతలి వారు ఎంత రెచ్చగొట్టినా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన చిత్తంతో చేసే ఆలోచనలను మెరుగైన ఫలితాన్ని ఇస్తాయి. అంతిమంగా విజయాన్ని అందిస్తాయి.


సహనంతోనే విజయం..

జీవితంలో విజయం సాధించేందుకు సుదీర్ఘకాలం పాటు శ్రమ, సహనం అవసరమని చాణక్య నీతి చెబుతోంది. కొన్ని రకాల లక్ష్యాలను చేరుకునేందుకు శారీరక, మానసిక సంసిద్ధత అవసరం. త్వరగా ఫలితాలు రావాలని ఆశిస్తే మొదటికే మోసం వస్తుంది. పరిస్థితి ఎంత విపత్కరంగా ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దని ఆచార్య చాణక్యుడు తన బోధనల్లో స్పష్టం చేశారు. శత్రువులు అడ్డంకులు సృష్టించినా, ఇతర కారణాలతో పరిస్థితులు ప్రతికూలంగా మారినా వెనక్కు తగ్గకూడదు. సహనాన్ని కోల్పోకూడదు. ప్రతి ఓటమినీ ఓ గుణపాఠంగా భావించి ముందుకు సాగాలి. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయకుండా, నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా సహనంతో ముందుకు సాగితే విజయం తథ్యమని ఆచార్య చాణక్య బోధనలు చెబుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

చాణక్య నీతి.. ఈ సూత్రాలు పాటిస్తే వ్యాపారంలో లాభాలే లాభాలు

కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? ఉచితంగా మార్చుకోండిలా..!

Updated Date - Oct 18 , 2026 | 09:31 AM