Share News

రణరంగంగా మారిన ఫ్రాన్స్.. వేల మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 08:10 AM

ఫ్రాన్స్‌లో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. వేల మంది సామాన్యులు నిరసనబాట పట్టారు. మౌలికవసతుల లేమిపై గత నెలలో విద్యార్థులు కదను తొక్కగా శనివారం వేల మంది సామాన్యులు నిరసనబాట పట్టారు.

రణరంగంగా మారిన ఫ్రాన్స్.. వేల మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు
France protests

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. శనివారం వేల మంది సామాన్యులు నిరసనకు తెరతీశారు. మౌలికవసతుల లేమిపై గత నెలలో విద్యార్థులు కదను తొక్కగా నిన్న సామాన్యులు నిరసనబాట పట్టారు. పోలీసులతో ఘర్షణలు, భవనాలకు నిప్పుపెట్టడం, పోలీసుల భాష్పవాయువు, వాటర్ క్యానన్ల ప్రయోగంతో పలు ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. పెరుగుతున్న జీవనవ్యయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంపై ఆగ్రహంతో ప్రజలు నిరసనబాట పట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


పోలీసులతో ఘర్షణలు.. భవనాలకు నిప్పు

లియోన్ నగరంలో నిరసనకారులు ఓ టూరిస్టు కార్యాలయానికి నిప్పంటించారు. మార్సియెల్ నగరంలో కూడా పలు భవనాలకు నిప్పంటించడంతో అవి దెబ్బతిన్నాయి. ప్యారిస్‌లో పోలీసులు నిన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు, వాటర్ క్యానన్‌ను ప్రయోగించారు. ఇప్పటివరకూ పోలీసులు 1200 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అయితే, దేశవ్యాప్తంగా మరిన్ని నిరసనలకు ప్లాన్ చేశామని నిరసనకారులు తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు, జీవనవ్యయాలు, ప్రజావ్యవస్థల్లో పడిపోతున్న నాణ్యత, అధికమవుతున్న అసమానతలతో విసిగి తాము నిరసనబాట పట్టామని అనేక మంది చెప్పారు.


వామపక్ష అతివాద భావజాలం వల్లే..

ఈ నిరసనల వెనుక వాపపక్ష అతివాద భావజాలం ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. లూటీలు జరిగాయని తెలిపింది. కొందరు నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారని చెప్పింది. భవనాలకు నిప్పు పెట్టారని, ప్రభుత్వ ఆఫీసులు, మీడియా కార్యాలయాలపై కూడా దాడులు చేశారని ఆరోపించింది. విద్యార్థుల నిరసనల సందర్భంగా అప్పట్లో ప్రభుత్వం పోలీసులు స్టన్ గ్రెనేడ్స్‌ వినియోగించకుండా నిషేధం విధించింది. ఈసారి మాత్రం వీటినీ వాడే అవకాశం ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. గతనెలలో విద్యార్థి నిరసనల సందర్భంగా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారా? అనే విషయంపై అక్కడ దర్యాప్తు ప్రారంభమైంది.


ఈ వార్తలనూ చదవండి:

మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..

జెలెన్‌స్కీ పత్రికా సమావేశం.. దుర్గంధంతో విలేకరులకు ఇక్కట్లు

Updated Date - Oct 18 , 2026 | 09:02 AM