మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:26 AM
భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరు మారిపోనుందా? ఇకపై అంతరిక్షంలో కూడా యుద్ధాలు జరగబోతున్నాయా? అవుననే అంటున్నారు యుద్ధ నిపుణులు.. రాబోయే ఐదేళ్లలో అంతరిక్షంలో కూడా యుద్ధం చెలరేగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరు మారిపోనుందా? ఇకపై అంతరిక్షంలో కూడా యుద్ధాలు జరగబోతున్నాయా? అవుననే అంటున్నారు యుద్ధ నిపుణులు.. రాబోయే ఐదేళ్లలో అంతరిక్షంలో కూడా యుద్ధం చెలరేగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే ఆయుధాలను వివిధ దేశాలు అభివృద్ధి చేస్తుండటంతో అంతరిక్షం కూడా సైనిక పోరాటాలకు వేదికగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి (Space Warfare).
ఐదేళ్ల తర్వాత అంతరిక్షంలో సంఘర్షణ జరిగే ప్రమాదం పెరుగుతుందని బ్రిటన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఫ్రీమన్ ఎయిర్ అండ్ స్పేస్ ఇన్స్టిట్యూట్ నిపుణురాలు డాక్టర్ జూలియా బాల్మ్ హెచ్చరించారు. బ్రిటన్తో పాటు దాని మిత్రదేశాల అంతరిక్ష వ్యవస్థలు ప్రత్యర్థుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమాచార మార్పిడి, నావిగేషన్, వాతావరణ అంచనాలు, టెలివిజన్ ప్రసారాలు వంటి అనేక కీలక సేవలు ఉపగ్రహాలపై ఆధారపడి ఉన్నాయి. అంతరిక్షంలో కీలక ఉపగ్రహాలను ధ్వంసం చేసినా, వాటి పనితీరుకు ఆటంకం కలిగించినా అనేక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది (Anti-Satellite Weapons).
ముఖ్యంగా జీపీఎస్ సేవలు నిలిచిపోతే విమానాల రాకపోకలు, నౌకాయానం, రవాణా వ్యవస్థలపై ప్రభావం పడవచ్చు. ఇంటర్నెట్, బ్యాంకింగ్, సమాచార ప్రసార సేవల్లోనూ అంతరాయాలు ఏర్పడవచ్చు. అందువల్ల ఉపగ్రహాల రక్షణ ఇప్పుడు దేశాల భద్రతలో కీలక అంశంగా మారుతోంది. అంతరిక్షంలో రష్యా, చైనాలు చేపడుతున్న కొన్ని కార్యకలాపాలు పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యాకు చెందిన ఉపగ్రహాలు ఇతర అంతరిక్ష వాహనాలకు సమీపంగా కదలడం, అంతరిక్ష వస్తువులను పట్టుకోగల సాంకేతికతను చైనా పరీక్షించడం వంటి పరిణామాలను నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు (Russia Space Weapons).
ఇప్పటివరకు అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం, ఉపగ్రహాలకు ఇంధనం అందించడం వంటి వాణిజ్య అవసరాలపై దృష్టి పెట్టిన కొన్ని సంస్థలు ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించిన సాంకేతికతలపైనా పనిచేస్తున్నాయి (Space Defence). బ్రిటిష్ ఉపగ్రహాల రక్షణ కోసం ప్రత్యేక అంతరిక్ష విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ సెప్టెంబర్లో ప్రకటించింది. దేశాలు తమ ఉపగ్రహాలను రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు అంతరిక్షంలో సంఘర్షణలు తలెత్తకుండా అంతర్జాతీయ సహకారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ