జెలెన్స్కీ పత్రికా సమావేశం.. దుర్గంధంతో విలేకరులకు ఇక్కట్లు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:51 AM
సీరియస్ అంశాలపై చర్చలు జరిగే ఓ అంతర్జాతీయ పత్రికా సమావేశంలో తాజాగా నవ్వు పుట్టించే అంశం వెలుగు చూసింది. అకస్మాత్తుగా దుర్గంధం వ్యాపించడంతో విలేకరులు గదిలోంచి బయటకు పరుగులు తీశారు.
ఇంటర్నెట్ డెస్క్: సీరియస్ అంశాలపై చర్చలు జరిగే ఓ అంతర్జాతీయ పత్రికా సమావేశంలో తాజాగా నవ్వు పుట్టించే ఉదంతం వెలుగు చూసింది. బ్రసెల్స్లో ఇటీవల జరిగిన యూరోపియన్ కౌన్సిల్ పత్రికా సమావేశంలో దుర్గంధం వ్యాపించడంతో జర్నలిస్టులు నానా ఇక్కట్లు పడ్డారు. అపానవాయువు వదిలేది ఎవరో తెలియక తలబాదుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ రాకకోసం ఎదురుచూస్తున్న విలేకరులకు ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో జర్నలిస్టులు నానా అవస్థలూ పడ్డారని పొలిటికో వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. జెలెన్స్కీ సమావేశం మిస్ కావొద్దనుకున్న కొందరు మాత్రం గదిలోనే ఉండి కాస్త నరకం అనుభవించారు.
అపానవాయువును ఎవరు వదిలారంటూ కొందరు జర్నలిస్టులు నెట్టింట సరదా కామెంట్స్ కూడా చేశారు. ఈ ఘటనకు ముందు రోజు కూడా విలేకరులు దుర్గంధంతో ఇబ్బందిపడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ పరిస్థితుల్లో తానూ చిక్కుకుని ఇబ్బంది పడ్డానని ఆర్థిక, రాజకీయ వ్యవహారాల విశ్లేషకుడు, జర్నలిస్టు శంకర్ అయ్యర్ ఎక్స్ వేదికగా తెలిపారు. బయటివారికి ఇది నవ్వు తెప్పించేదిగా ఉన్నా తమకు మాత్రం చుక్కలు కనిపించాయని అన్నారు. ఎవరా అజ్ఞాత వ్యక్తి? అంటూ నెట్టింట పోస్టు పెట్టారు. పదే పదే అపానవాయువు వదిలేదెవరంటూ మీడియాలో సెటైరికల్ కథనాలు కూడా వచ్చాయి.
అంతర్జాతీయ నేతల సమావేశాల్లో జర్నలిస్టులు ఒక్కోసారి ఇంటర్వ్యూల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఈసారి మాత్రం పరిస్థితి కొత్త మలుపు తిరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. ‘సమావేశం మిస్ కావొద్దన్న ఉద్దేశంతో అక్కడున్న అనేక మంది కాఫీలు తాగుతూనే గదిలోనే గంటలకు గంటలు గడిపేశారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి తప్పవేమో’ అని శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
రష్యా చమురుపై ఆంక్షల సడలింపు.. భారత్ సహా పలు దేశాలకు మినహాయింపు