చమురు ఊరట
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:57 AM
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల సాకుతో భారత్‌పై అమెరికా అడ్డగోలు సుంకాలు విధించవచ్చన్న ఆందోళనకు తెరపడింది. రష్యా నుంచి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు కొనే దేశాలపై 100శాతం వరకు సుంకాలు..
భారత్ సహా రష్యా చమురు కొనే దేశాలపై ఆంక్షలను మినహాయించిన ట్రంప్
అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
ఇటీవలే రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు ట్రంప్ ఒప్పందం
యూఎ్‌సలో మధ్యంతరం నేపథ్యంలో ధరల నియంత్రణే లక్ష్యంగా చర్యలు
రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకునే అవకాశం
వాషింగ్టన్, అక్టోబరు 17: రష్యా నుంచి చమురు కొనుగోళ్ల సాకుతో భారత్‌పై అమెరికా అడ్డగోలు సుంకాలు విధించవచ్చన్న ఆందోళనకు తెరపడింది. రష్యా నుంచి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు కొనే దేశాలపై 100శాతం వరకు సుంకాలు, ఆంక్షలు విధించేలా తీసుకువచ్చిన చట్టం అమలును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా పక్కనపెట్టారు. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ మినహాయింపు ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నివేదికను అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు పంపినట్టు తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌కు ఊరట లభించింది. ఇరాన్, రష్యాలపై మరిన్ని ఆంక్షలు విధించడం, రష్యా నుంచి చమురు, సహజవాయువు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు కొనే దేశాలపై 100శాతం వరకు సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారాలను కట్టబెడుతూ అమెరికా చట్టసభలు ‘లిండ్సే ఓ గ్రాహం బిల్లు’ను ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రంప్ సంతకంతో అది చట్టరూపంలోకి వచ్చింది. దీనితో భారత్‌పై సుంకాలు విధిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా టాప్‌లో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉండటమే దీనికి కారణం. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు చుక్కలను తాకుతుండటం, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పెట్రోలియం ధరలు వ్యతిరేక ప్రభావం చూపవచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్వయంగా రష్యా నుంచి భారీగా డీజిల్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై తలపెట్టిన సుంకాలు, ఆంక్షలకూ మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయంతో రష్యా నుంచి భారీగా చమురు, పెట్రోలియం ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలోకి వచ్చేందుకు, చమురు ధరలు దిగి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో అటు అమెరికా సుంకాల నుంచి, ఇటు చమురు ధరల భారం నుంచి భారత్‌కు ఊరట లభించేందుకు సానుకూలత ఏర్పడింది. అదే సమయంలో రష్యా నుంచి మరింతగా చమురు కొనుగోలు చేసేందుకూ వీలు కుదరనుంది.