Share News

చందమామకు 10 వేల పగుళ్లు!

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:02 AM

నిండు జాబిలి.. అంటూ చందమామను వర్ణించేందుకు ఇకపై ఒకింత ఆలోచించాలేమో!. ఎందుకంటే నిండు చంద్రమామ చిక్కిపోతున్నాడని.. ఆయనపై భూకంపం తరహాలో చంద్రకంపం, పగుళ్లు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చందమామకు 10 వేల పగుళ్లు!

  • చల్లబడుతున్న అంతర్భాగం.. సంకోచాలతో కుంచించుకు పోతున్న నిండు జాబిలి

  • 148 అడుగులు తగ్గిన వ్యాసార్థం

నిండు జాబిలి.. అంటూ చందమామను వర్ణించేందుకు ఇకపై ఒకింత ఆలోచించాలేమో!. ఎందుకంటే నిండు చంద్రమామ చిక్కిపోతున్నాడని.. ఆయనపై భూకంపం తరహాలో చంద్రకంపం, పగుళ్లు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా చేసిన పరిశోధనలో జాబిలమ్మపై ఏకంగా 10వేలకుపైగా పగుళ్లను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రభావం.. పలు దేశాలు చేపడుతున్న చంద్రయాత్రపై పడుతుందని అంటున్నారు. తాజా అధ్యయనంలో పలు కీలక విషయాలు గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక, చందమామ కుంచించుకుపోవడం, పగుళ్లు ఏర్పడడం పట్ల వ్యోమగాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకీ పగుళ్లు?

చంద్రుడి అంతర్భాగం క్రమంగా చల్లబడి సంకోచిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగానే విస్తృతమైన టెక్టోనిక్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఇది చంద్రుడి ఉపరితలంపై పగుళ్లకు దారితీసిందని చెప్పారు. ప్రస్తుతం 10 వేలకుపైగా పగుళ్లను గుర్తించామన్నారు. ఇది మరిన్ని చంద్రకంపాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. చంద్రకంపాలు ఏర్పడితే వ్యోమగాములు గ్రహంపై దిగేందుకు, పరిశోధనలు చేసేందుకు, వ్యోమనౌకలకు కూడా ప్రమాదమని వివరించారు. ఇప్పటికే నిర్మించిన మౌలిక సదుపాయాలు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో చంద్రుడి వ్యాసార్థం భారీగా కుంచించుకు పోయినట్టు గుర్తించారు. 40 నుంచి 80 కోట్ల ఏళ్ల కాలంలో చంద్రుని వ్యాసార్థం 45 మీటర్ల(148 అడుగులు) మేరకు తగ్గిపోయిందని తెలుసుకున్నారు. ఇక, ఈ అధ్యయనంలో చంద్రుడి అంతర్భాగం క్రమంగా వేడిని కోల్పోతూ చల్లబడుతోందని, దీంతో చందమామ కుంచించుకుపోతున్నట్టు గుర్తించారు. ఇది చంద్రుని బాహ్య కవచాన్ని సంపీడనానికి గురి చేస్తోందని, తద్వారా ఉపరితలం పెళుసుగా మారి పగుళ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ పగుళ్ల కారణంగా లోబేట్‌ స్కార్ప్‌లు ఏర్పడతాయని, ముడతల వంటి నిర్మాణాలను పోలి ఉంటాయని, గుట్టగా పోగుపడి కొండచరియలను తలపిస్తాయని పేర్కొన్నారు. ఇక, చంద్రుని సంకోచం అనేది ఆకస్మికంగా జరిగిన ప్రక్రియ కాదని, ఒక క్రమమైన భౌగోళిక ప్రక్రియ అని వివరించారు. 10 లక్షల సంవత్సరాల కాలంలో ఆరు నుంచి 11సెంటీమీటర్ల మేరకు కుంచించుకుపోతున్నట్టు తెలిపారు..


అసలు ఆందోళన ఇదే..

పగుళ్ల కారణంగా చంద్రుడిపై దీర్ఘకాలిక అన్వేషణ కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరికరాలు, ఆవాసాలకు ముప్పు ఏర్పడడంపై ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో మానవ ఆవాసాలు ఏర్పరుచుకునేందుకు, ముఖ్యమైన ప్రయోగాలకు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావిస్తున్నారు. ‘నాసా’ సైతం దక్షిణ ధ్రువంపైనే ఆర్టెమిస్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. దక్షిణ ధ్రువంలోని కొన్ని బిలాలలో నీటి మంచు ఉందని, ఇది భవిష్యత్తు యాత్రలకు వనరుగా మారుతుందని విశ్వసిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతంలోనే పగుళ్లు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన హైరిజొల్యూషన్‌ ఫొటోగ్రా్‌ఫ్సను పరిశీలించారు. ల్యూనార్‌ రికనైసెన్స్‌ ఆర్టిటార్‌ కెమెరా(ఎల్‌ఆర్‌వోసీ) నుంచి 17 సంవత్సరాల సమాచారాన్ని సేకరించారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Oct 18 , 2026 | 06:04 AM