బోస్టన్‌లో ఘనంగా TANA న్యూ ఇంగ్లండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత వేడుక
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:02 PM
బోస్టన్‌లో TANA న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో ‘నందమూరి అందగాడు’ సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతికూల వాతావరణం మధ్య 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరుకాగా, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ గాయకులు ఎన్టీఆర్ చిత్రాల పాటలతో అలరించారు.
వర్ష హెచ్చరికలను లెక్కచేయకుండా సంగీత కార్యక్రమానికి పోటెత్తిన తెలుగు అభిమానులు
16 మంది గాయకులతో మధు చారి మధురవాణి బృందం అలరింపు
200 మందికి పైగా ప్రేక్షకుల హాజరు
బోస్టన్: అమెరికాలోని బోస్టన్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ‘నందమూరి అందగాడు’ సంగీత కార్యక్రమం తెలుగు పాటల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తీవ్ర వర్షాలు, వాతావరణ హెచ్చరికలు జారీ అయినప్పటికీ కార్యక్రమానికి 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరై తెలుగు సినీ సంగీతంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద సాయిబాబా ఆలయంగా ప్రసిద్ధి చెందిన శిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని TANA న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ సహకారంతో నిర్వహించారు.
నందమూరి తారక రామారావు(NTR) నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలను ఒకే వేదికపై వినిపిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంగీతాభిమానులను ఆకట్టుకుంది. పాత తరం తెలుగు సినీ సంగీతంలోని మాధుర్యాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ సాగిన పాటలు.. ప్రేక్షకులను గత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాయి. వర్షం కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రేక్షకులు కుటుంబ సమేతంగా కార్యక్రమానికి తరలివచ్చారు.
ప్రముఖ గాయకుడు మధు చారి నాయకత్వంలో మధురవాణి మ్యూజికల్ గ్రూప్‌కు చెందిన 16 మంది ప్రతిభావంతులైన గాయకులు ఎన్టీఆర్ పలు ప్రసిద్ధ గీతాలను ఆలపించారు. గాయకుల సమన్వయం, పాటల ఎంపిక, సంగీత బృందం ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతీ పాట అనంతరం ప్రేక్షకుల నుంచి చప్పట్లతో అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు సంగీతాభిమానులు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఒకవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు తెలుగు పాటలపై ఉన్న అభిమానంతో ప్రేక్షకులు కార్యక్రమానికి హాజరుకావడం నిర్వాహకుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఈ కార్యక్రమంలో TANA న్యూ ఇంగ్లండ్ కోఆర్డినేటర్లు మౌనిక మానుకొండ, యెండూరి శ్రీనివాస్, రావు యలమంచిలి, కృష్ణ ప్రసాద్ సోంపల్లి పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(TAGB) అధ్యక్షురాలు సుధ ముల్పూర్.. తన బృందంతో కలిసి కార్యక్రమానికి హాజరై కళాకారులను, నిర్వాహకులను అభినందించారు. ఆమెతో పాటు TAGB మాజీ అధ్యక్షులు నలుగురూ కార్యక్రమానికి హాజరై తమ మద్దతు తెలిపారు, ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు. S4 మీడియా అండ్ సోర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ శ్రీని బొల్ల.. ఈ కార్యక్రమానికి హాజరై కళాకారులను అభినందించారు. TAGB మాజీ అధ్యక్షులు బాబు రావు పొలవరపు కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు, కళాకారులందరికీ ట్రోఫీలను అందజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై TANA అధ్యక్షుడు డా.నరేన్ కొడాలి తన సందేశంలో TANA న్యూ ఇంగ్లాండ్ రీజియన్ నాయకత్వాన్ని, వలంటీర్లను అభినందించారు. ప్రత్యేకంగా రమణ తిరువీధి, త్రిభు పారుపల్లి, శ్రీనివాస్ కాకి, గోపీ నెక్కలపూడి, వేణు కూనంనేని తదితర వలంటీర్లు కార్యక్రమం విజయవంతం కావడానికి అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ప్రేక్షకులను కార్యక్రమంతో అనుసంధానిస్తూ, కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లిన అరుణ్ ముల్పూర్ ఎంసీగా అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రేక్షకులు TANA న్యూ ఇంగ్లండ్ బృందం చేసిన సమన్వయాన్ని ప్రశంసించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం, కళాకారులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, ప్రేక్షకులకు మంచి అనుభూతిని కల్పించడం పట్ల నిర్వాహక బృందాన్ని అభినందించారు.

తెలుగు పాటలు, ఎన్టీఆర్ చిత్రాలపై ఉన్న అభిమానాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం ద్వారా బోస్టన్ తెలుగు సమాజంలో సాంస్కృతిక అనుబంధం మరోసారి ప్రతిబింబించింది. ‘నందమూరి అందగాడు’ కార్యక్రమం కేవలం ఒక సంగీత కార్యక్రమంగా కాకుండా.. తెలుగు సినీ సంగీత వైభవాన్ని, ఎన్టీఆర్ కళా వారసత్వాన్ని గుర్తుచేసిన ఒక ప్రత్యేక సాంస్కృతిక వేడుకగా నిలిచింది. ప్రతికూల వాతావరణాన్నీ లెక్కచేయకుండా 200 మందికి పైగా తెలుగు పాటల అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TANA న్యూ ఇంగ్లండ్ నాయకత్వం, మధురవాణి మ్యూజికల్ గ్రూప్, గాయకులు, వలంటీర్లు, సహకరించిన సంస్థల ప్రతినిధులు, కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు 2027 మెగా ఈవెంట్‌ను తానా, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ సమన్వయం తోటి ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు.

సింగర్స్: మధు చారి, దినేష్ మఖిజా, సురేష్ దోనేపూడి, గోపి మగులూరి, మూర్తి పరకాల, మానస పరకాల, వల్లీ అమరవాది, జగదీష్ బిసా, అపర్ణ రేపాక, ప్రశాంతి పుట్టగంటి, శాస్త్రి పుల్య, అపర్ణ పుల్య, ప్రవీణ్ పెద్ది, మానస కృష్ణ, సునీత తడకమల్ల, శ్రీనివాస్ బాల, పద్మజ బాల, బిఆర్ దేవి, అరుణ్ ముల్పూర్, సుధా ముల్పూర్, స్మితా చారి, రాధిక గోలీ, శాంతి కలతుర్, రేఖ మల్లాది, సంగీత శివపురపు
సౌండ్ సిస్టమ్: మురళీ మక్తేదార్, మాధవి దోనేపూడి
ఇవీ చదవండి:
ఆస్టిన్ పాఠశాల.. అద్భుతమైన పునఃప్రారంభం
సీఎం చంద్రబాబుతో గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ డా. రాజా భేటీ