14 ఏళ్లకే అసాధారణ ఘనత.. సాట్‌లో 1600/1600
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:15 PM
14 ఏళ్ల వయసులోనే సాట్‌లో 1600కి 1600 మార్కులు సాధించి ఆశ్రిత్ తళ్లూరి అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రాక్టీస్ పరీక్షల్లోనూ ఇదే స్కోరు సాధించిన అతడు.. పట్టుదల, ప్రశాంతతతో ఫైనల్ ఎగ్జామ్స్‌లోనూ పర్ఫెక్ట్ స్కోరు సాధించాడు.
ఫుల్టన్ కౌంటీ(అమెరికా), ఆంధ్రజ్యోతి: హైస్కూల్ స్థాయిలో విద్యార్థులు స్కొలాస్టిక్ అఛీవ్‌మెంట్ టెస్ట్(SAT) రాయడం సహజం. కానీ అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఫుల్టన్ కౌంటీకి చెందిన ఆశ్రిత్ తాళ్లూరి అనే 14ఏళ్ల బాలుడు మాత్రం.. చిన్న వయసులోనే అందులో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఏకంగా 1600కి 1600 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచాడు.
ఫైనల్ ఎగ్జామ్‌కు ముందే ఆశ్రిత్ మూడు ప్రాక్టీస్ టెస్టుల్లోనూ 1600 మార్కులు సాధించాడు. జనవరిలో ఎగ్జామ్ రాసుకునేందుకు రిజిస్టర్ చేసుకున్న అతడు.. ఆ తర్వాత కొన్ని నెలలపాటు ప్రణాళికబద్ధంగా సిద్ధమయ్యాడు. ట్యూషన్ చెప్పించుకోవడం, యూట్యూబ్ వీడియోలను చూడటం వంటివి చేసేవాడు. రైటింగ్, రీడింగ్ విభాగాల్లో ఒత్తిడిని జయిస్తూనే ఫైనల్ ఎగ్జామ్స్‌ను ప్రశాంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఫలితాలు వెలువడగా.. అతడు ఫుల్ స్కోర్ 1600 సాధించాడని తెలియడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఆశ్రిత్ ప్రతిభ సాట్‌కే పరిమితం కాలేదు. మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే 14½ హైస్కూల్ క్రెడిట్లు పూర్తి చేశాడు. హార్వర్డ్, రైస్ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన కళాశాల స్థాయి వేసవి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఇన్నోవేషన్ అకాడమీలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆశ్రిత్.. డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ ద్వారా 2 కళాశాల స్థాయి కోర్సులను కూడా అభ్యసిస్తున్నాడు. విరామ సమయంలో సాట్ ప్రాక్టీస్ పేపర్లు రూపొందిస్తూనే.. పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇతర విద్యార్థులకు సూచనలిస్తున్నాడు. చదువుతో పాటు చెస్, విమానయానంపై ఆసక్తి పెంచుకున్న అతడు.. మెట్రో అట్లాంటా ప్రాంతంలోని హ్యాకథాన్‌లలోనూ పాల్గొంటున్నాడు. భవిష్యత్తులో న్యూరో సర్జన్‌గా ఎదగాలన్నది అతడి లక్ష్యమట.
ఇవీ చదవండి:
ఆస్టిన్ పాఠశాల.. అద్భుతమైన పునఃప్రారంభం
సీఎం చంద్రబాబుతో గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ డా. రాజా భేటీ