శరాఘాతం లాంటి సర్జికల్ మెనోపాజ్
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:03 AM
పైబడే వయసుతో సహజసిద్ధంగా మెనోపాజ్ దశకు చేరుకోడానికీ, సర్జరీలో భాగంగా అండాశయాలను తొలగించడం వల్ల అకస్మాత్తుగా తలెత్తే ‘సర్జికల్ మెనోపాజ్’కూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
పైబడే వయసుతో సహజసిద్ధంగా మెనోపాజ్ దశకు చేరుకోడానికీ, సర్జరీలో భాగంగా అండాశయాలను తొలగించడం వల్ల అకస్మాత్తుగా తలెత్తే ‘సర్జికల్ మెనోపాజ్’కూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ తరహా మెనోపాజ్ బాధలను సమర్థమైన చికిత్సలతో వదిలించుకోవచ్చంటున్నారు వైద్యులు.
సాధారణంగా నడివయసు మహిళల్లో అండాశయాల పనితీరు సన్నగిల్లి, ఈస్ట్రోజన్ ఉత్పత్తి క్షీణించడం మొదలుపెడుతుంది. 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో తలెత్తే ఈ పెరి మెనోపాజ్ దశ, 52 నుంచి 55 ఏళ్ల వరకూ కొనసాగి, అంతిమంగా నెలసరి పూర్తిగా ఆగిపోయే మెనోపాజ్ దశ సమీపిస్తుంది. అయితే పెరి మెనోపాజ్ దశలో... ఒంట్లో వేడి ఆవిర్లు, భావోద్వేగాలు అదుపు తప్పడం, చికాకు, రాత్రివేళ చమటలు, మూత్రవిసర్జన మీద నియంత్రణ కోల్పోవడం, కండరాలు, ఎముకల నొప్పులు లాంటి లక్షణాలు ప్రతి మహిళనూ వేధిస్తాయి. ఈ లక్షణాలు కొన్నేళ్ల పాటు కొనసాగి క్రమేపీ మెనోపాజ్‌కు చేరుకుంటారు. ఇదొక క్రమమైన ప్రక్రియ. సహజసిద్ధంగా నడివయసు మహిళల శరీరాల్లో తలెత్తే మెనోపాజ్ తీరు ఇది. కానీ ‘సర్జికల్ మెనోపాజ్’ కాస్త భిన్నమైనది.
సర్జికల్ మెనోపాజ్ అంటే?
ఏ కారణం వల్లనైనా వయసుతో సంబంధం లేకుండా, సర్జరీలో భాగంగా అండాశయాలను తొలగించవలసి వచ్చినప్పుడు సదరు మహిళల్లో ‘సర్జికల్ మెనోపాజ్’ తలెత్తుతుంది. అలాంటి సర్జరీలు ఏవంటే...
గర్భాశయ సర్జరీలు: ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు, అధిక రక్తస్రావం మొదలైన సమస్యలను సరిదిద్దడం కోసం గర్భాశయానికి సర్జరీ చేసే సందర్భంలో వైద్యులు అండాశయాలను కూడా పరీక్షిస్తారు. ఒకవేళ అండాశయాలు ఆరోగ్యంగా లేకపోతే, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్‌తో పాటు అండాశయాలను కూడా తొలగిస్తారు.
సిస్టులు: కొన్ని సందర్భాల్లో అండాశయాల్లో పెద్ద సిస్టులు ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో కూడా అండాశయాలను తొలగిస్తారు. 40 నుంచి 45 వయస్కుల్లో సిస్టు ఫలితంగా అండాశయాలు ట్విస్ట్ అయిపోతాయి. కొందరికి ఒక అండాశయంలో ఇంకొందరికి రెండు అండాశయాల్లో ఈ సమస్య ఉన్నప్పుడు రెండింటినీ తొలగించాల్సి వస్తుంది.
క్యాన్సర్: కొందరి కుటుంబంలో అండాశయాల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు, సదరు మహిళలకు భవిష్యత్తులో అండాశయ క్యాన్సర్ తలెత్తే ముప్పు ఎక్కువ కాబట్టి వారి గర్భాశయంతో పాటు అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్‌ను కూడా తొలగించవలసి వస్తుంది.
వేధించే లక్షణాలు
సహజసిద్ధ మెనోపాజ్‌లో మహిళల శరీరాల్లో దశలవారీ మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి శరీరం ఆ లక్షణాలకు అలవాటు పడుతుంది. కానీ ‘సర్జికల్ మెనోపాజ్’ పూర్తి భిన్నం. ఈ మెనోపాజ్ లక్షణాలు అకస్మాత్తుగా ముంచెత్తుతాయి. సర్జరీతో అండాశయాలను తొలగించిన కొన్ని రోజులు, వారాల్లోపే తీవ్రమైన వేడి ఆవిర్లు వేధిస్తాయి. రోజులో పలుసార్లు చమటలు పట్టేస్తూ ఉంటాయి. గుండె దడ మొదలవుతుంది. రాత్రుళ్లు నిద్ర పట్టదు, భావోద్వేగాలు అదుపుతప్పుతూ ఉంటాయి. మూత్రవిసర్జన అదుపు తప్పడం, బ్రెయిన్ ఫాగింగ్ లాంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. 30 ఏళ్ల మహిళల్లో ఇలాంటి లక్షణాలు వారి జీవన నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇలా సర్జికల్ మెనోపాజ్, చిన్న వయసు మహిళలను భౌతికంగా, మానసికంగా రెండు విధాలా బాధిస్తుంది. ఎముకలు, కండరాల నొప్పులతో శరీరం ప్రతికూలంగా మారితే, మతిమరుపు, అయోమయంతో మనసు నియంత్రణ తప్పుతుంది. పైగా ఈ లక్షణాలు తాత్కాలికమైనవి కావు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో సర్జరీలో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో అండాశయాలను తొలగించుకున్న మహిళలు, ఉపద్రవంలా విరుచుకుపడే సర్జికల్ మెనోపాజ్‌తో పాటు, దాని తాలూకు ప్రభావాలను కూడా జీవితాంతం భరించవలసి వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల చిన్న వయసులోనే ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోతాయి. గుండెకు రక్షణ కొరవడి, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. అలాగే వెజైనల్ డ్రైనె్‌సతో లైంగిక జీవితం కూడా దెబ్బ తింటుంది. ఇలా సర్జికల్ మెనోపాజ్‌తో చిన్న వయసు మహిళల జీవితాలు అకస్మాత్తుగా తల్లకిందులైపోతాయి.
హార్మోన్ థెరపీ తప్పనిసరి
సర్జికల్ మెనోపాజ్ మహిళలకు హార్మోన్ రీప్లే్‌సమెంట్ థెరపీ తప్పనిసరి. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల లోపు సర్జికల్ మెనోపాజ్‌కు గురైన మహిళలు హెచ్‌ఆర్‌టి చికిత్సను ఆశ్రయించడం ఎంతో ముఖ్యం. అండాశయాలు లేకపోవడం వల్ల తలెత్తే ఈస్ట్రోజన్ హార్మోన్‌ను ఈ చికిత్సతో భర్తీ చేసుకోవచ్చు. సహజసిద్ధ మెనోపాజ్ ఏ వయసులో తలెత్తుతుందో ఆ వయసు వరకూ.. అంటే 52 నుంచి 53 ఏళ్ల వరకూ ఈ చికిత్సను తీసుకోవచ్చు. అయితే ఈ చికిత్సకు ముందు, వైద్యులు, సదరు మహిళ ఆరోగ్యాన్నీ, క్యాన్సర్ ముప్పునూ అంచనా వేసి, అన్ని విధాలా సురక్షితమని నిర్థారించుకున్న తర్వాతే హార్మోన్ రీప్లే్‌సమెంట్ థెరపీని ఎంచుకుంటారు. ఈ చికిత్సతో మెనోపాజ్ లక్షణాలు అదుపులోకి రావడంతో పాటు గుండె, ఎముకల ఆరోగ్యం కూడా దిగజారకుండా నివారించవచ్చు. అలాగే వైద్యులు, ఈ చికిత్సతో పాటు విటమిన్ డి, క్యాల్షియం సప్లిమెంట్లు, ప్రొటీన్ ఆహారాన్ని సూచిస్తారు. కండరాల పటుత్వం కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, రెసిస్టెన్స్ వ్యాయామాలు, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగాలను సూచిస్తారు. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు, పురీషనాళ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లతో పాటు క్యాన్సర్ జన్యువు పాజిటివ్ ఉన్న సందర్భాల్లో ఆ కోవకు చెందిన మహిళలకు హెచ్‌ఆర్‌టి చికిత్స సాధ్యపడదు. వైద్యులు ఈ మహిళలకు నాన్ హార్మోనల్ థెరపీని సూచిస్తారు.
నాన్ హార్మోనల్ థెరపీ ఇలా...
ఈ థెరపీకి కొన్ని దుష్ప్రభావాలుంటాయి. కాబట్టి మహిళలకు కాలేయం, మూత్రపిండాల పనితీరులను పరిశీలించి, వాటి పనితీరు సాధారణంగా ఉన్నప్పుడు వైద్యులు ఈ థెరపీని సూచిస్తారు. ఈ థెరపీలో భాగంగా సెలెక్టివ్ సెరటోనిన్ రీఅ్‌పటేక్ ఇన్హిబిటర్స్ అందిస్తారు. ఇవి మెదడు మీద ప్రభావాన్ని కనబరిచి, వేడి ఆవిర్లు, భావోద్వేగాలు అదుపు తప్పడం మొదలైన లక్షణాలన్నిటినీ అదుపు చేస్తాయి. అలాగే లైంగిక జీవిత నాణ్యతను పెంచడం కోసం ఈస్ట్రోజన్ క్రీమ్స్ కూడా వాడుకోవలసి వస్తుంది.
అవగాహన పెంచుకుని...
పొట్టకు జరిగే సర్జరీల గురించి మహిళలు అవగాహన పెంచుకోవడం అవసరం. సర్జరీలో ఏం జరిగింది? ఏ అవయవాలకు సర్జరీ జరిగింది? ఏ ఏ అవయవాలను తొలగించారు? మొదలైన వివరాలు తెలుసుకోవాలి. గర్భాశయాన్ని తొలగించారా? లేదంటే దాంతో పాటు అండాశయాలను కూడా తొలగించారా? అన్నది వైద్యులను అడిగి తెలుసుకోవాలి. అండాశయాలను తొలగించే పరిస్థితి ఉన్నప్పుడు వాటిలో ఒక అండాశయాన్ని ఉంచేసే అవకాశముందా? అన్నది కూడా వైద్యులను అడగాలి. రెండు అండాశయాలను కూడా తొలగిస్తే, సర్జికల్ మెనోపాజ్‌కు ఎలా సిద్ధపడాలో? ఎలాంటి చికిత్సలను ఆశ్రయించాలో వైద్యులను అడిగి తెలుసుకోవాలి. హెచ్‌ఆర్‌టి చికిత్సకు అర్హత ఉందా, లేదా? ఈ చికిత్సతో తలెత్తే దీర్ఘకాలిక ప్రభావాలేవి? అన్నది కూడా తెలుసుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలితో...
సర్జికల్ మెనోపాజ్‌కు గురైన మహిళలు తప్పనిసరిగా ప్రొటీన్ పుష్కలంగా తీసుకోవాలి. చికెన్, గుడ్లు, లేత మాంసంతో పాటు క్యాల్షియం సమృద్ధిగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మెదడు కణాల ఆరోగ్యానికి తోడ్పడే ఫిష్ ఆయిల్స్ తీసుకోవాలి. సహజసిద్ధ మెనోపాజ్, సర్జికల్ మెనోపాజ్.. ఈ రెండింట్లో ఏ పరిస్థితికి చేరుకున్న మహిళల్లోనైనా, ఈస్ట్రోజన్ లోపం వల్ల, థర్మోరెగ్యులేటరీ మెకానిజం పని చేయడం మానేస్తుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉన్నా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు మెదడు, శరీరానికి సంకేతాన్ని పంపిస్తూ ఉంటుంది. దాంతో అధిక చమటలు వేధిస్తాయి. కాబట్టి ఈ లక్షణాల తీవ్రతను తగ్గించుకోవడం కోసం వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాఫీలు, మద్యం మానుకోవాలి. వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
డాక్టర్ ఆనీ ప్రణుత పి,
కన్సల్టెంట్ అబ్‌స్టెట్రీషియన్
అండ్ గైనకాలజీ,
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్,
హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
దృఢమైన ఎముకల కోసం...
Read Latest Telangana News And AP News And National News
And Telugu News