ప్యాంటీ లైనర్స్‌తో ప్రమాదం
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:40 AM
డాక్టర్! నాకు ప్రతి రోజూ ప్యాంటీ లైనర్స్ వాడుకునే అలవాటుంది. ఈ అలవాటుతో ఏదైనా ప్రమాదం ఉందా?
డాక్టర్! నాకు ప్రతి రోజూ ప్యాంటీ లైనర్స్ వాడుకునే అలవాటుంది. ఈ అలవాటుతో ఏదైనా ప్రమాదం ఉందా?
- ఓ సోదరి, హైదరాబాద్.
రోజంతా పొడిగా, తాజాగా, సౌకర్యంగా ఉండాలనే ఆలోచనతో చాలామంది మహిళలు ప్రతి రోజూ ప్యాంటీ లైనర్స్ వాడకాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. వీటి వాడకం ఆరోగ్యకరమని కూడా భ్రమపడుతూ ఉంటారు. కానీ నిజానికి ప్యాంటీ లైనర్స్ అతి వాడకం వెజైనల్ బ్యాలెన్స్‌కు ప్రమాదకరం. పలుచని శానిటరీ ప్యాడ్ వెర్షన్ ప్యాంటీ లైనర్లను అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అరుదుగా మాత్రమే వాడుకోవాలి.
ప్రతి రోజూ వద్దు
వీటిని ప్రతి రోజూ వాడుకోవడం వల్ల మనం ఊహించుకునే పరిశుభ్రతకు వ్యతిరేకమైన ఫలితం దక్కుతుంది. ప్యాంటీ లైనర్స్ తేమను పట్టి ఉంచి, ఫంగ్‌సకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దాంతో దురద, దుర్వాసన, దద్దుర్లు మొదలవుతాయి. నిజానికి ఈ గుప్త ప్రదేశానికి గాలి తగులుతూ ఉండాలి. ప్లాస్టిక్ కాదు. కాబట్టి గాలి చొరబడే వీలున్న లోదుస్తులు మాత్రమే ధరించాలి. లోదుస్తుల లోపల ప్యాంటీ లైనర్స్ లాంటి వాటిని అదే పనిగా వాడుకోకూడదు.
ఇన్‌ఫెక్షన్ల ముప్పు
జననేంద్రియాల ఆరోగ్యానికి రక్షణగా ఆ ప్రాంతంలో దగ్గర ల్యాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్ల నుంచి యోనికి రక్షణ కల్పిస్తుంది. అయితే ఎప్పుడైతే యోనికి గాలి చొరబడే వీలుండదో అప్పుడు యోని పిహెచ్ విలువలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుని, ఆమ్లత్వం క్షీణించి, హానికారక బ్యాక్టీరియా వృద్ధికి అనువుగా మారిపోతుంది. ప్యాంటీ లైనర్స్ వల్ల యోనికి గాలి చొరబడనప్పుడు, ఆ ప్రదేశం తేమగా, వెచ్చగా మారిపోయి, క్యాండీడాతో పాటు హానికారక బ్యాక్టీరియా పెరుగుదలకు ఆ ప్రదేశం అనువుగా మారిపోతుంది. పైగా ప్యాంటీలైనర్స్ సింథటిక్ పదార్థాలతో తయారవుతాయి. అతుక్కోడానికి సహాయపడే జిగురు, సువాసన వెదజల్లే రసాయనాలను కూడా వీటి తయారీలో ఉపయోగిస్తారు. వీటితో కాంటాక్ట్ డెర్మటైటిస్ అనే చర్మ సమస్య వేధిస్తుంది. కాబట్టి పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ సమస్య ఎదుర్కొంటున్న సందర్భాల్లో, స్వల్ప రక్తస్రావమయ్యే నెలసరి చివర్లో మాత్రమే ప్యాంటీ లైనర్స్ వాడుకోవాలి. మూత్రాన్ని ఆపుకోలేని సందరాల్లో కూడా వీటిని వాడుకోవచ్చు. అలాగే వీటిని రోజుకు రెండుసార్లు మార్చుకోవాలి.
- డాక్టర్ చేతనా జైన్
అబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్.