Share News

’విష’మించిన ప్రాణం.. వశపట్టిన వైద్యులు..

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:24 PM

నోటి నుంచి నురగ వస్తోంది... కనురెప్పలు మూతపడుతున్నాయి... స్పృహ తప్పుతోంది... శ్వాస ఆడటం కష్టమౌతోంది... పరిస్థితి అంతుపట్టడంలేదు... అప్పటికే రెండు ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి వచ్చిన బాధితులకు దిక్కుతోచడంలేదు.. స్థిమితంగా గమనించిన ప్రభుత్వ ఆసుపత్రి పిడియాట్రిక్‌ వైద్యులు మాత్రం పాము కాటు లక్షణాలు ఉన్నాయని గుర్తించారు...

’విష’మించిన ప్రాణం.. వశపట్టిన వైద్యులు..
బాలిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న ఎంసీహెచ్‌ వైద్యులు, వైద్య సిబ్బంది

వనపర్తి వైద్యవిభాగం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నోటి నుంచి నురగ వస్తోంది... కనురెప్పలు మూతపడుతున్నాయి... స్పృహ తప్పుతోంది... శ్వాస ఆడటం కష్టమౌతోంది... పరిస్థితి అంతుపట్టడంలేదు... అప్పటికే రెండు ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి వచ్చిన బాధితులకు దిక్కుతోచడంలేదు.. స్థిమితంగా గమనించిన ప్రభుత్వ ఆసుపత్రి పిడియాట్రిక్‌ వైద్యులు మాత్రం పాము కాటు లక్షణాలు ఉన్నాయని గుర్తించారు... ఓ బాలికకు పునర్జన్మనిచ్చారు. ఈ సంఘటన వనపర్తి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వడ్డెవాట గ్రామానికి చెందిన ఆంజనేయులు, శివమ్మ దంపతుల పదేళ్ల కూతురు నేహ కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాత్రి భోజనం తర్వాత ప్రతీరోజు మాదిరిగానే నిద్రపోయింది. ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి కడుపునొప్పితో తంట్లాడుతోంది. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే కొత్తకోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం అర్థంకాని అక ్కడి వైద్యులు చేతులెత్తేశారు.. వనపర్తిలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా శరీరమంతా ఏదో విషం వ్యాపిస్తోందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు... వనపర్తి జనరల్‌ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్‌) తీసుకెళ్లే సరికి బాలిక నోటి నుంచి అధిక లాలాజలం రావడం, కనురెప్పలు మూసుకుపోవడం, స్పృహ కోల్పోవడం, శ్వాస కండరాలు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపించాయి. పాము కాటుతో కూడిన విష ప్రభావ లక్షణాలతో ఉన్నాయని గుర్తించి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ, పరిస్థితి చెయ్యి దాటుతోంది... మరేదైనా పెద్ద ఆసుపత్రికి తరలించే లోపే ఆశలు వదులుకోవాల్సి వస్తుందని అప్రమత్తమయ్యారు... చివరి ప్రయత్నాలు అలుపెరుగకుండా మొదలుపెట్టిరు. శ్వాసనాళంలో ట్యూబ్‌ పెట్టి వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస అందించారు. 16 గంటలపాటు కొనసాగింది. నెమ్మదిగా ఆరోగ్యం మెరుగవుతుందనుకుంటే ఉన్నట్లుండి బాలికకు ఫిట్స్‌ వచ్చాయి. సమయానికి వెంటిలేటర్‌ ఆపరేటర్‌ కూడా లేడు... దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌ పక్క జిల్లా నుంచి ఆపరేటర్‌ను పిలిపించి చికిత్స అందించారు... వారం రోజుల తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉన్న ఆమె మంగళవారం డిచ్చార్జి కాబోతుంది.. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన ప్రభుత్వ వైద్యులకు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతగా చేతులు జోడిస్తున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పట్టించుకోరనే అపవాదు ఉన్నది కానీ, అక్కడ వృత్తికే అంకితమైన వైద్యనారాయణులుంటారు....

Updated Date - Sep 07 , 2026 | 11:27 PM