దృఢమైన ఎముకల కోసం...
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:48 AM
రోజువారీ పనులు చేసుకోవడంతోపాటు అవయవాల పరిరక్షణలో ఎముకల పాత్ర కీలకం. అలాంటి ఎముకల్లో సాంద్రత తగ్గకుండా తీసుకోవాల్సిన పోషకాహారం గురించి తెలుసుకుందాం...
రోజువారీ పనులు చేసుకోవడంతోపాటు అవయవాల పరిరక్షణలో ఎముకల పాత్ర కీలకం. అలాంటి ఎముకల్లో సాంద్రత తగ్గకుండా తీసుకోవాల్సిన పోషకాహారం గురించి తెలుసుకుందాం...
చిన్నప్పటి నుంచే డి, కె విటమిన్లతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే పెద్దవారైన తరువాత ఎముకల్లో సాంద్రత తగ్గకుండా ఉంటుంది. పాలు, పెరుగు, పనీర్, నెయ్యి, తృణధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, తాజా పండ్లను విధిగా ఆహారంలో చేర్చుకోవాలి.
ఎముకల బలోపేతానికి మునగాకు ఎంతగానో తోడ్పడుతుంది. తరచూ దానితో కూర వండుకుని తినడం మంచిది. మిక్సీలో గుప్పెడు మునగాకు, చిన్న అల్లం ముక్క, చెంచా నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణం వేసి అరగ్లాసు నీటిని పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి. తరువాత వడబోసుకుని తాగితే ఎముకలకు శక్తి చేకూరుతుంది.
బ్లెండర్‌లో అయిదారు కీర ముక్కలు, నాలుగైదు యాపిల్ ముక్కలు, చెంచా నిమ్మరసం, చెంచా తేనె, వేడినీటిలో ఉంచి తీసిన పాలకూర ఆకులు నాలుగింటిని వేసి గ్లాసు నీటిని పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్‌ని వారానికి రెండుసార్లు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
తరచూ కేరట్, నారింజ తినడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంటుంది. ఈ రెంటినీ మిక్సీలో వేసి ఓ గ్లాసు మంచినీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగినా ఎముకలు బలోపేతమవుతాయి.
ఎండు ఉసిరి ముక్కలు తినడం, ఉసిరి పొడిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మిక్సీలో అయిదు ఉసిరి ముక్కలు, అయిదారు పుదీనా ఆకులు వేసి అరగ్లాసు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసి అందులో చెంచా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. దీనివల్ల ఎముకల నిర్మాణానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.