మమత కోటలో బీజేపీ పాగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం
ABN , Publish Date - Apr 29 , 2026 | 08:42 PM
బెంగాల్‌లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్‌మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రజలు మార్పు కోరుతూ ఓటేశారా? టీఎంసీ హవాకు ఈసారి గండి పడి, బీజేపీ విజయం సాధించనుందా? పలు ఎగ్జిట్ పోల్స్ అవుననే చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్‌మత్ పోల్స్, బీకాన్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి. నువ్వా-నేనా అన్ని రీతిలో టీఎంసీ-బీజేపీ మధ్య పోటీ ఉందని జేవీసీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
చాణక్య స్ట్రాటజీస్
చాటక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం టీఎంసీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. బీజేపీ 150 నుంచి 160 స్థానాలను గెలుచుకోనుంది. టీఎంసీ 130-140 సీట్లు దక్కించుకుంటుంది. కాంగ్రెస్ 2-4 సీట్లు గెలుస్తుంది.
మ్యాట్రిజ్ సర్వే
మాట్రిజ్ సర్వే సైతం బీజేపీకే పట్టం కట్టింది. బీజేపీ 146-161 సీట్లు, టీఎంసీ 125-140 సీట్లు గెలుచుకుంటాయి.
ప్రజా పోల్
ఈ సర్వే ప్రకారం బీజేపీ 178-208 సీట్లు గెలుచుకుంటుంది. టీఎంసీ 85-110 సీట్లకే పరిమితమవుతుంది. ఇతరులు జీరో నుంచి 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
పోల్ డైరీ
పోల్ డైరీ సర్వేలోనూ బీజేపీ 142-171 సీట్లు గెలుచుకుంటుంది. టీఎంసీ 99-127 సీట్లు దక్కించుకుంటుంది. కాంగ్రెస్ 3-5, ఇతరులు 2-4 స్థానాలు గెలుచుకుంటారు.
మమతకు పట్టం
మమతా బెనర్జీ మరోసారి ఘనవిజయం సాధించనున్నట్టు మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
పీపుల్స్ పల్స్
టీఎంసీ 177-187 సీట్లు గెలుచుకుని మరోసారి విజయం హస్తగతం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ 95-110 సీట్లు దక్కనున్నాయి. కాంగ్రెస్ 1-3 సీట్లు గెలుచుకుంటుందని, సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఖాతా కూడా తెరవదని అంచనా వేసింది.
జన్‌మత్ పోల్స్
టీఎంసీకి అఖండ్ విజయం సాధిస్తుందని జన్‌మత్ పోల్స్ అంచనా వేసింది. టీఎంసీకి 195-200 సీట్లు వస్తాయని, బీజేపీ 80-90 సీట్లు దక్కించుకుటుందని, కాంగ్రెస్ 1-3 సీట్లు, వామపక్షాలకు 0-1 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
హోరాహోరీ..
కాగా, టీఎంసీ, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని జేవీసీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీఎంసీకి 131-152, బీజేపీకి 138-159 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్-2, ఇతరులకు ఒక సీటు వస్తాయని జోస్యం చెప్పింది.
ఇవి కూడా చదవండి..
కేరళం ఎగ్జిట్ పోల్స్ 2026: యుడిఎఫ్ (UDF) ముందంజ.. అధికార మార్పు దిశగా 'కేరళం'?
అస్సాంలో కమలం హ్యాట్రిక్... ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవం