అస్సాంలో కమలం హ్యాట్రిక్... ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవం
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:27 PM
అస్సాంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోనుంది. వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకోబోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ 85 నుంచి 95 సీట్లు గెలుచుకోనుందని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
గౌహతి: అస్సాంలో భారతీయ జనతా పార్టీ (BJP) తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోనుంది. బీజేపీ వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకోనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ 85 నుంచి 95 సీట్లు గెలుచుకోనుందని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 32 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, బీజేపీ 88 నుంచి 98 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 22 నుంచి 32 సీట్లు, ఇతరులు 3-5 సీట్లు గెలుచుకుంటారని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. 'పీపుల్స్ పల్స్' సైతం బీజేపీకే పట్టం కట్టింది. బీజేపీ 68-72, కాంగ్రెస్ 22-26, ఏజీపీ 7-10, బీపీఎఫ్ 8-9 సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది. 'పల్స్ టుడే' అంచనా ప్రకారం బీజేపీకి 88-92 సీట్లు, కాంగ్రెస్‌కు 29-32, ఇతరులకు 4-6 సీట్లు వస్తాయి. ఎస్ఏఎస్ గ్రూప్ సైతం బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపింది. బీజేపీ 84-90, కాంగ్రెస్ 40-60, ఇతరులకు 2-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
'యాక్సిస్ మై' ఇండియా సైతం బీజేపీ క్లీన్ స్వీప్ సాధిస్తుందని ఢంకా బజాయించింది. ఎన్డీయేకు 88 నుంచి 100 సీట్లు వస్తాయని తేల్చిచెప్పింది. కాంగ్రెస్ కూటమికి 24 నుంచి 36 సీట్లు రానున్నట్టు తెలిపింది. 48 శాతం ప్రజలు ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ వైపు మొగ్గుచూపుతుండగా, 32 శాతం ఓటర్లు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. కాగా, అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటుకు 64 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 85.38 శాతం పోలింగ్ నమోదైంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ముగిసిన పోలింగ్.. మూడింట రెండువంతుల మెజారిటీ మాదే: మమతా బెనర్జీ
మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ