Share News

ముగిసిన పోలింగ్.. మూడింట రెండువంతుల మెజారిటీ మాదే: మమతా బెనర్జీ

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:37 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాగా, టీఎంసీ గెలుపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.

ముగిసిన పోలింగ్.. మూడింట రెండువంతుల మెజారిటీ మాదే: మమతా బెనర్జీ
Mamata Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ సందర్భంగా చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చేటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మెరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా మొదలైంది.


2/3 మెజారిటీతో గెలుస్తాం: మమతాబెనర్జీ

కాగా, పోలింగ్ పూర్తయిన వెంటనే టీఎంసీ గెలుపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ బెంగాల్‌లో ఓటమి చవిచూడనుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. దీనికి ముందు తాను అభ్యర్థిగా నిలబడిన భవానీపూర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును మమతా బెనర్జీ వినియోగించుకున్నారు. సీఆర్‌పీఎఫ్, కేంద్ర బలగాలపై నిప్పులు చెరిగారు. ఒక్క పోలింగ్ బూత్‌కు కూడా సురక్షితంగా లేదన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లు సీఆర్‌పీఎఫ్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, ఎక్కడా కూడా రాష్ట్ర పోలీసులు బూత్‌ వద్ద కనిపించలేదని చెప్పారు. అర్ధరాత్రి నుంచే సీఆర్‌పీఎఫ్ బలగాలు, కేంద్ర పరిశీలకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, టీఎంసీ కార్యకర్తల ఇళ్లల్లో చొరబడ్డారని, టార్చర్ పెట్టారని ఆరోపించారు. 1984 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఈ తరహా ప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు తానెప్పుడూ చూడలేదన్నారు.


ఇవి కూడా చదవండి..

మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..

Updated Date - Apr 29 , 2026 | 06:42 PM