సువేందును చుట్టుముట్టిన టీఎంసీ మద్దతుదారులు.. స్పల్ప లాఠీచార్జి
ABN , Publish Date - Apr 29 , 2026 | 03:37 PM
బెంగాల్ ప్రతిపక్ష నేత, భవానీపూర్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల ఏర్పాట్లు తనిఖీ చేసేందుకు బుధవారం ఒక పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ మద్దతుదారులు అక్కడకు చేరుకుని 'జై బెంగాల్' నినాదాలు చేశారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఏడు జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో చురుకుగా జరుగుతోంది. బెంగాల్ ప్రతిపక్ష నేత, భవానీపూర్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల ఏర్పాట్లు తనిఖీ చేసేందుకు బుధవారం ఒక పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ మద్దతుదారులు అక్కడకు చేరుకుని 'జై బెంగాల్' నినాదాలు చేశారు. కొద్దిసేపటికే వారంతా సువేందును చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ వెంటనే జోక్యం చేసుకుని స్వల్పంగా లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
వాళ్లు బంగ్లాదేశ్ ముస్లింలు: సువేందు
కాగా, పోలింగ్ బూత్ వద్ద తనను ముందుకు కదలకుండా చుట్టుముట్టిన వాళ్లంతా బంగ్లాదేశ్ ముస్లింలని సువేందు తెలిపారు. వాళ్లంతా భయంతో వణుకుతున్నారని, మమత బెనర్జీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. పోలింగ్ బూత్ వద్ద తలెత్తిన ఉద్రిక్తతను వెంటనే అదుపులోకి తెచ్చామని, ఎలాంటి అవంతారాలు లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ చురుకుగా, ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు.
మధ్యాహ్నానికే భారీగా పోలింగ్
కాగా, మధ్యహ్నం ఒంటిగంట ప్రాంతానికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడానికి మరో కొద్ది గంటలు ఉండటంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించగా, బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలు టీఎంసీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నారని, ఎన్నికల సంఘం పరిశీలకులు రెచ్చిపోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాగా, అభిషేక్ బెనర్జీ నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్టాలో పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గుర్తుపై టేపు అతికించినట్టు బీజేపీ మీడియా ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..
బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది.. సీఎం మమత ఆరోపణలు